భారత్‌కు డూ ఆర్ డై వన్డే నేడే!

ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనటానికి రోహిత్ శర్మ నాయకత్వంలోని పూర్తిస్థాయిజట్టు బయలు దేరి వెళ్లడంతో...రిజర్వ్ ఆటగాళ్లతో కూడిన జట్టుతోనే భారత్ వన్డే సిరీస్ లో తలపడుతోంది.

Advertisement
Update:2022-10-09 07:28 IST

భారత్- దక్షిణాఫ్రికాజట్ల మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ లోని కీలక రెండోపోరుకు రాంచీలోని జార్ఖండ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది.సిరీస్ అవకాశాలు సజీవంగా నిలుపుకోవాలంటే ఆతిథ్య భారత్ ఈ మ్యాచ్ లో నెగ్గితీరాల్సి ఉంది. భారత్- దక్షిణాఫ్రికాజట్ల మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ షో.. లక్నో మీదుగా జార్ఖండ్ రాజధాని రాంచీకి చేరుకొంది. ఇక్కడి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగే సూపర్ సండే సమరం సఫారీలకు చెలగాటం, భారత్ కు సిరీస్ సంకటంగా మారింది.

శిఖర్ ధావన్ నాయకత్వంలో..

బవుమా నాయకత్వంలోని దక్షిణాఫ్రికా జట్టుతో తలపడుతున్న భారత జట్టుకు ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనటానికి రోహిత్ శర్మ నాయకత్వంలోని పూర్తిస్థాయిజట్టు బయలు దేరి వెళ్లడంతో...రిజర్వ్ ఆటగాళ్లతో కూడిన జట్టుతోనే భారత్ వన్డే సిరీస్ లో తలపడుతోంది. రోహిత్, విరాట్, రాహుల్ లాంటి స్టార్ ప్లేయర్లంతా ప్రపంచకప్ కు పరిమితం కావడంతో..యువఆటగాళ్లు ఇషాన్ కిషన్, రితురాజ్ గయక్వాడ్, సీనియర్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్ ప్రధాన ఆటగాళ్లుగా జట్టు భారాన్ని మోస్తున్నారు.

బౌలింగ్ విభాగంలో అవే క‌ష్టాలు..

సిరీస్ లో భాగంగా లక్నో వేదికగా ముగిసిన తొలివన్డేలో ఆతిథ్య భారత్ బౌలింగ్ బలహీనతతోనే 9 పరుగుల పరాజయంతో వెనుకబడిపోయింది. వర్షం దెబ్బతో 40 ఓవర్లకే పరిమితం చేసిన ఈ 50 ఓవర్ల పోరులో భారత్ తరపున వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ సంజు శాంసన్, పేస్ ఆల్ రౌండర్ శార్ధూల్ ఠాకూర్ తుదివరకూ పోరాడినా ఓటమి తప్పలేదు. సిరాజ్, శార్ధూల్, ఆవేశ్ ఖాన్, రవి బిష్నోయ్, కుల్దీప్ యాదవ్ లతో కూడిన భారత బౌలింగ్ ఎటాక్..పూర్తిస్థాయి సఫారీజట్టును అదుపుచేయలేకపోయింది. డేవిడ్ మిల్లర్, క్లాసెన్ జోడీ అజేయ సెంచరీ భాగస్వామ్యంతో భారత బౌలర్లను ఓ ఆటాడుకొన్నారు.

చహార్ స్థానంలో సుందర్..

భారత స్టార్ బౌలర్ దీపక్ చహార్ కాలు మెలికపడడంతో ముందు జాగ్రత్తచర్యగా జట్టు నుంచి తప్పించి..అతని స్థానంలో ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ను చేర్చుకొన్నట్లు బీసీసీఐ ప్రకటించింది. సిరీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకోవాలంటే భారతజట్టు ఆరునూరైనా...రెండోవన్డేలో నెగ్గితీరాల్సి ఉంది. పార్నెల్, రబడ, కేశవ్ మహారాజ్, షంషీలతో కూడిన సఫారీ బౌలింగ్ ఎటాక్ ను భారత టాపార్డర్ దీటుగా ఎదుర్కొనగలిగితేనే విజయావకాశాలు ఉంటాయి. బౌలింగ్ తో పాటు ఫీల్డింగ్ విభాగంలోనూ మెరుగుపడకుంటే...భారత్ కు మ్యాచ్ నెగ్గడం అంతతేలిక కాబోదు. బ్యాటింగ్ కు అనువుగా ఉండే రాంచీ స్టేడియం పిచ్ పైన 280కి పైగా పరుగులు సాధించిన జట్టుకే విజయావకాశాలు ఉంటాయి. భారత స్పిన్నర్లు స్థాయికి తగ్గట్టుగా రాణించగలిగితేనే భారత్ పైచేయి సాధించగలుగుతుంది. సీనియర్ స్టార్ శిఖర్ ధావన్ కు ఓపెనర్ గా మాత్రమే కాదు.. కెప్టెన్ గానూ ఈ మ్యాచ్ సవాలుగా , సత్తాకు పరీక్షగా నిలిచింది.

Tags:    
Advertisement

Similar News