క్రిస్టియానో రొనాల్డో మరో ప్రపంచ రికార్డు!

పోర్చుగీసు సాకర్ దిగ్గజం, ఎవర్ గ్రీన్ క్రిస్టియానో రొనాల్డో తన రికార్డులను తానే అధిగమిస్తూ సాగిపోతున్నాడు.

Advertisement
Update:2023-06-21 15:00 IST

క్రిస్టియానో రొనాల్డో మరో ప్రపంచ రికార్డు!

పోర్చుగీసు సాకర్ దిగ్గజం, ఎవర్ గ్రీన్ క్రిస్టియానో రొనాల్డో తన రికార్డులను తానే అధిగమిస్తూ సాగిపోతున్నాడు. 38 సంవత్సరాల వయసులో తన దేశం తరపున 200అంతర్జాతీయమ్యాచ్ లు ఆడిన తొలి ప్లేయర్ గా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు...

మెరుపువేగంతో సాగిపోయే ఫుట్ బాల్ కు వయసుతో ఏమాత్రం పనిలేదని పోర్చుగల్ కెప్టెన్, ప్రపంచ మేటి సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో చాటి చెప్పాడు. వయసు మీద పడుతున్నా తన ఆటలో వాడివేడీ ఏమాత్రం తగ్గకుండా తన ప్రస్థానం కొనసాగిస్తూ రికార్డుల మోత మోగిస్తున్నాడు.

ఒకేదేశం తరపున 200 ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

200 మ్యాచ్ లో విన్నింగ్ గోల్....

2024 యూరోపియన్ కప్ ఫుట్ బాల్ అర్హత పోటీలలో 38సంవత్సరాల క్రిస్టియానో రొనాల్డో తనజోరును కొనసాగిస్తూ వస్తున్నాడు. రెక్ జావిక్ వేదికగా ఐస్ లాండ్ తో జరిగిన క్వాలిఫైయింగ్ రౌండ్ మ్యాచ్ లో పోర్చుగల్ 1-0తో విజేతగా నిలవడంలో రొనాల్డో ప్రధానపాత్ర వహించాడు.

హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఐస్ లాండ్ అడుగడుగునా పోటీ ఇవ్వడంతో పోర్చుగల్ కు డ్రా తప్పదని అందరూ అనుకొన్నారు. అయితే..ఆట 89వ నిముషంలో

క్రిస్టియానో రొనాల్డో సాధించిన క్లోజ్ రేంజ్ గోల్ తో పోర్చుగీసుజట్టు 1-0తో విజయాన్ని సొంతం చేసుకోగలిగింది.పోర్చుగల్ జాతీయజట్టులో సభ్యుడిగా తన 200వ మ్యాచ్ ఆడిన రొనాల్డో 123వ గోల్ నమోదు చేయడం ద్వారా జంట ప్రపంచ రికార్డులు నమోదు చేశాడు.

200 మ్యాచ్ లు ఆడిన తొలిప్లేయర్ గా, 123 గోల్స్ సాధించిన తొలి ఆటగాడిగా జంట ప్రపంచ రికార్డులను క్రిస్టియానో రొనాల్డో నెలకొల్పాడు. ఈ మ్యాచ్ సందర్భంగా రోనాల్డోకు నిర్వాహక సంఘం ప్రత్యేక జ్ఞాపికను ఇచ్చి సత్కరించింది.

2003 నుంచి 2023 వరకూ..

2003 ఆగస్టు 18న పోర్చుగల్ తరపున తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన రొనాల్డో..గత రెండు దశాబ్దాల కాలంలో 200 మ్యాచ్ లు ఆడగలిగాడు. ఫుట్ బాల్ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ గా రొనాల్డో గుర్తింపు తెచ్చుకొన్నాడు.

ప్రస్తుత యూరోసాకర్ అర్హత పోటీలలో భాగంగా లిచ్ టెన్ స్టీన్, లగ్జెంబర్గ్ జట్లతో జరిగిన పోటీలలో గోల్స్ సాధించిన రొనాల్డో..బోస్నియా- హెర్జ్ గోవినాతో జరిగిన పోటీలో మాత్రం కనీసం ఒక్కగోలూ సాధించలేకపోయాడు. అయితే..ఐస్ లాండ్ తో జరిగిన కీలక పోరులో మాత్రం తన జట్టు విజయానికి అవసరమైన గోలు సాధించగలిగాడు.

తన దేశం తరపున 200వ మ్యాచ్ ఆడటం, జట్టు విజయానికి అవసరమైన గోల్ సాధించడం సంతృప్తినిచ్చినట్లు మ్యాచ్ అనంతరం క్రిస్టియానో రొనాల్డో ప్రకటించాడు.

యూరో అర్హత పోటీలలో గ్రూప్ -జె లీగ్ లో తలపడుతున్న పోర్చుగల్ ఇప్పటికే 4 విజయాలు, 14 గోల్స్ తో టాపర్ గా నిలిచింది.

రొనాల్డో కు ఆ చాన్స్ ఉందా?

ప్రస్తుతం 2024 యూరోపియన్ కప్ సాకర్ క్వాలిఫైయింగ్ రౌండ్లలో పాల్గొంటున్న రొనాల్డోకు మరో ఏడాదిలో జరిగే ఫైనల్ పోరు నాటికి 39 సంవత్సరాలు నిండుతాయి.

2024 యూరోకప్ లో రొనాల్డో పాల్గొనేది లేనిదీ రానున్న కాలమే చెప్పాలి.

యూరోపియన్ చాంపియన్షిప్ ఫైనల్స్ లో 14 గోల్స్, చాంపియన్స్ లీగ్ లో 140 గోల్స్ సాధించిన ఏకైక ఆటగాడిగా రొనాల్డో పేరుతోనే పలు రికార్డులు ఉన్నాయి. అంతేకాదు. యూరోప్ లోని ఐదు ప్రధాన లీగ్ ల్లో..ఇంగ్లండ్, ఇటలీ, స్పానిష్ లీగ్ ల్లో అత్యధిక గోల్స్ సాధించిన ప్లేయర్ రికార్డులు సైతం రొనాల్డోకే దక్కాయి.

రొనాల్డో సాధించిన మొత్తం 800 గోల్స్ లో వివిధ క్లబ్ ల తరపున సాధించినవే 690 కి పైగా గోల్స్ ఉన్నాయి. స్పోర్టింగ్ లిస్బన్ తరపున 5, మాంచెస్టర్ యునైటెడ్ తరపున 118, రియల్ మాడ్రిడ్ జట్టు సభ్యుడిగా 450గోల్స్, యువెంటస్ తరపున 95 గోల్స్ సాధించాడు. అంతేకాదు...తన జాతీయజట్టు పోర్చుగల్ తరపున 123గోల్స్ సాధించడం ఓ రికార్డుగా మిగిలిపోతుంది.

2019 సీజన్లో 700 గోల్స్ మైలురాయిని చేరిన రొనాల్డో 2021 సీజన్ నాటికి కానీ 770 గోల్స్ మార్క్ ను చేరలేకపోయాడు. ప్రస్తుతం సౌదీ అరేబియన్ లీగ్ లో అల్- నాజర్ క్లబ్ కు రొనాల్డో ఆడుతున్నాడు. తనజట్టు తరపున ఇప్పటికే 12 గోల్స్ సాధించాడు.

తన కెరియర్ లో ఫుట్ బాల్ ఆడిన మొత్తం సమయంలో రొనాల్డో ప్రతి 112 నిముషాలకు ఓ గోల్ చొప్పున సాధించడం ఓ రికార్డుగా నిలిచిపోతుంది.

స్వీడన్ , లాత్వియా, ఆండోర్రా, అర్మీనియా ప్రత్యర్థులుగా పోర్చుగల్ తరపున రొనాల్డో అత్యధిక గోల్స్ నమోదు చేశాడు.

యూరోపియన్ క్వాలిఫైయింగ్ రౌండ్ గ్రూప్- జె పోటీలలో ఇప్పటికే లగ్జెంబర్గ్, బోస్నియా అండ్ హెర్జిగోవినా, ఐస్ లాండ్ జట్లతో తలపడిన పోర్చుగల్ తన ఆఖరి లీగ్ పోటీలో స్లవేకియాతో తలపడాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News