ప్రపంచకప్ లో దక్షిణాఫ్రికా రికార్డుల మోత!

వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో దక్షిణాఫ్రికా చెలరేగిపోతోంది. భారత్ తో సమానంగా రాణిస్తూ రికార్డుల మోత మోగిస్తోంది.

Advertisement
Update:2023-11-03 11:22 IST

ప్రపంచకప్ లో దక్షిణాఫ్రికా రికార్డుల మోత!

భారత్ వేదికగా నాలుగోసారి జరుగుతున్న వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో భారత్ తో పాటు దక్షిణాఫ్రికాజట్టు సైతం భారీవిజయాలతో , సరికొత్త రికార్డులతో ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. మొదటి 7 రౌండ్ల మ్యాచ్ ల్లోనే దక్షిణాఫ్రికా రెండు సరికొత్త రికార్డులు నమోదు చేసింది.

అలవోకగా 350 స్కోర్లు.....

పదిజట్ల రౌండ్ రాబిన్ లీగ్ మొదటి ఏడురౌండ్లలో ఆరు విజయాలు, ఓ పరాజయంతో 12 పాయింట్లు సాధించడం ద్వారా లీగ్ టేబుల్ రెండోస్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికా మరే జట్టుకు సాధ్యంకాని రెండు బ్యాటింగ్ రికార్డులు నమోదు చేసింది.

మొదటి 7 రౌండ్లలోనే నాలుగుసార్లు 350కి పైగా స్కోర్లు సాధించిన తొలిజట్టుగా నిలిచింది. ప్లస్ 2.290 నెట్ రన్ రేట్ తో పటిష్టమైన స్థితిలో ఉంది. అంతేకాదు..ఐదుమ్యాచ్ ల్లో 100కి పైగా పరుగుల తేడాతో విజయాలు నమోదు చేసిన ఏకైకజట్టుగా ఉంది.

అత్యధిక సిక్సర్లు బాదినజట్టుగా దక్షిణాఫ్రికా....

ప్రస్తుత ప్రపంచకప్ మొదటి 7 రౌండ్లలో మ్యాచ్ ల్లో దక్షిణాఫ్రికా హిట్టర్లు 82 సిక్సర్లు బాదడం ఓ అరుదైన రికార్డుగా మిగిలిపోతుంది. పూణేలోని మ‌హారాష్ట్ర‌ క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా న్యూజిలాండ్ తో ముగిసిన పోరులో దక్షిణాఫ్రికా బ్యాటర్లు 15 సిక్సర్లు బాదారు. 2019 ప్రపంచకప్ లో ఇంగ్లండ్ నెలకొల్పిన 76 సిక్సర్ల ప్రపంచకప్ రికార్డును ప్రస్తుత ప్రపంచకప్ లో సఫారీజట్టు అధిగమించగలిగింది.

2015 ప్రపంచకప్ లో వెస్టిండీస్ అత్యధికంగా 68 సిక్సర్లు సాధించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ఓపెనర్ క్వింటన్ డి కాక్ 18 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉంటే..క్లాసెన్ 17 సిక్సర్లు, మిల్లర్ 14 సిక్సర్లు బాదారు. మార్కో జెన్సన్ 9 సిక్సర్లు, మర్కరమ్ 8 సిక్సర్లు నమోదు చేశారు.

నాలుగు శతకాలతో డి కాక్ టాప్....

2023 ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ మొదటి 7 రౌండ్ల మ్యాచ్ ల్లోనే దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డి కాక్ అత్యధికంగా నాలుగు సెంచరీలతో అత్యధిక పరుగులు, శతకాలు నమోదు చేసిన బ్యాటర్ గా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

48 సంవత్సరాల ప్రపంచకప్ చరిత్రలో మూడుకు పైగా శతకాలు సాధించిన మూడో బ్యాటర్ గా డి కాక్ నిలిచాడు. సింగిల్ ప్రపంచకప్ లో అత్యధిక శతకాలు బాదిన ప్రపంచ రికార్డు భారత కెప్టెన్ రోహిత్ శర్మ పేరుతో ఉంది. 2019 ప్రపంచకప్ లో రోహిత్ 5 శతకాలు సాధిస్తే..శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర 2015 ప్రపంచకప్ లో 4 శతకాలు బాదాడు. ఆ తరువాత నాలుగు సెంచరీల రికార్డును డికాక్ మాత్రమే అందుకోగలిగాడు. మిగిలిన రెండురౌండ్ల మ్యాచ్ ల్లో డి కాక్ మరో శతకం బాదితే..రోహిత్ శర్మ 5 సెంచరీల రికార్డును సమం చేసే అవకాశం లేకపోలేదు.

వన్ డౌన్ ఆటగాడు వాన్ డెర్ డ్యూసెన్ 2 శతకాలు బాదితే క్లాసెన్, మర్కరమ్ చెరో సెంచరీతో 200 స్ట్ర్రయిక్ రేట్ నమోదు చేయగలిగారు.

కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం జరిగే 8వ రౌండ్ పోరులో భారత్- దక్షిణాఫ్రికా అమీతుమీ తేల్చుకోనున్నాయి.

Tags:    
Advertisement

Similar News