ప్రపంచకప్ లో నేడే భారత్- దక్షిణాఫ్రికా పోరు!

2023-వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో అతిపెద్ద సమరానికి భారత క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్స్ లో రంగం సిద్ధమయ్యింది. లీగ్ టేబుల్ టాపర్ భారత్, రెండోస్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికా ఢీ అంటే ఢీ అంటున్నాయి.

Advertisement
Update:2023-11-05 10:20 IST

2023-వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో అతిపెద్ద సమరానికి భారత క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్స్ లో రంగం సిద్ధమయ్యింది. లీగ్ టేబుల్ టాపర్ భారత్, రెండోస్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికా ఢీ అంటే ఢీ అంటున్నాయి.

ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో 10 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ సమరం ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటి వరకూ జరిగిన 7 రౌండ్లలో నిలకడగా రాణిస్తూ, భారీవిజయాలు సాధిస్తూ సెమీస్ బెర్త్ లు ఖాయం చేసుకొ్న్న ప్రపంచ నంబర్ వన్ భారత్, పవర్ ఫుల్ దక్షిణాఫ్రికా జట్లు ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడబోతున్నాయి, సూపర్ సండే బ్లాక్ బస్టర్ ఫైట్ గా జరిగే ఈపోరు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభంకానుంది.

దిగ్గజాల సమరం....

ప్రస్తుత టోర్నీలో ప్రత్యర్థిజట్లను అలవోక గా చిత్తు చేస్తూ..భీకరమైన ఫామ్ లో ఉన్న భారత్- దక్షిణాఫ్రికాజట్ల పోరు కోసం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులు ఎక్కడలేని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. పటిష్టమైన దక్షిణాఫ్రికాను చిత్తు చేయడం ద్వారా భారత్ వరుసగా 8వ విజయం సాధిస్తుందా? లేక వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్ జోరుకు సఫారీ టీమ్ పగ్గాలు వేస్తుందా? అన్న ఉత్కంఠతో అభిమానులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దేశంలోని అతిపెద్ద క్రికెట్ మైదానాలలో

ఒకటిగా ఉన్న ఈడెన్ గార్డెన్స్ 80వేలమందికి పైగా అభిమానులతో కిటకిటలాడిపోడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికితోడు భారత రన్ మెషీన్ విరాట్ కొహ్లీ 35వ పుట్టినరోజు వేడుకలు సైతం మ్యాచ్ లో భాగంగా బెంగాల్ క్రికెట్ సంఘం నిర్వహిస్తోంది.

లోస్కోరింగా..హైస్కోరింగా?

ఈడెన్ గార్డెన్స్ పిచ్ అనగానే లోస్కోరింగ్ మ్యాచ్ లే కళ్లముందు కదలాడుతాయి. ప్రస్తుత ప్రపంచకప్ లో భాగంగా ఇప్పటి వరకూ ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన రెండుకు రెండుమ్యాచ్ లూ లోస్కోరింగ్ తోనే ముగియటంతో...బ్యాటింగ్ బలం కలిగిన రెండుజట్ల నడుమ జరిగే ఈ పోరు ఎలా సాగుతుంది, ఎంతస్కోరు నమోదవుతుందన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.

రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, విరాట్ కొహ్లీ, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజాలతో భారత బ్యాటింగ్ లైనప్, సెంచరీల హీరో క్వింటన్ డి కాక్, డ్యూసెన్, మర్కరమ్, క్లాసెన్, డేవిడ్ మిల్లర్, కేశవ్ మహారాజ్ లతో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్ సమానబలంతో కనిపిస్తోంది.

ఇటు...అటూ బౌలర్లే కీలకం....

సమఉజ్జీల సమరంలా జరిగే ఈ మ్యాచ్ లో బౌలర్లే కీలకం కానున్నారు. భారత పేసర్ల త్రయం బుమ్రా, షమీ, సిరాజ్ తోపాటు స్పిన్ జోడీ జడేజా, కుల్దీప్ కలసి కట్టుగా రాణించగలిగితేనే పవర్ ఫుల్ దక్షిణాఫ్రికాకు పగ్గాలు వేసే అవకాశం ఉంది. మరోవైపు మార్కో జెన్సన్, లుంగీ ఎన్ గిడీ, రబడ, టబ్రిజ్ షంషీ, కేశవ్ మహారాజ్ లతో కూడిన సఫారీ బౌలింగ్ ఎటాక్ ..భారత బ్యాటర్లకు సవాలు విసురుతోంది.

ఈడెన్ గార్డెన్స్ పిచ్,వాతావరణ పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకోగలిగిన జట్టుకే విజయావకాశాలు ఉంటాయి.

సెట్టింగ్ లో సఫారీలు- చేజింగ్ లో భారత్!

రౌండ్ రాబిన్ లీగ్ లో ఇప్పటి వరకూ ఆడిన 7 రౌండ్ల మ్యాచ్ ల్లో భారత్ నూటికి నూరుశాతం విజయాలతో 14 పాయింట్లు సాధించడం ద్వారా టేబుల్ టాపర్ గా నిలిచింది. పైగా అత్యధిక మ్యాచ్ ల్లో భారత్ చేజింగ్ లోనే విజయాలు నమోదు చేసింది. భారత్ తరపున ఓపెనర్ రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ మాత్రమే సెంచరీలు సాధించగలిగారు.

విరాట్, రోహిత్ చెరో రెండుసార్లు 80కి పైగా స్కోర్లకు అవుటయ్యారు. శుభమన్ గిల్ సైతం సెంచరీకి చేరువగా వచ్చి అవుటయ్యాడు.

ఇక..ముందుగా బ్యాటింగ్ కు దిగిన సమయంలో 350కి పైగా స్కోర్లను అలవోకగా సాధిస్తున్న ఏకైకజట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది. ఓపెనర్ క్వింటన్ డి కాక్ ఇప్పటికే మూడు శతకాలు బాదితే..డ్యూసెన్ 2 సెంచరీలు, మర్కరమ్, క్లాసెన్ చెరో శతకం నమోదు చేశారు.

లీగ్ దశలో ఆడిన 7 మ్యాచ్ ల్లో దక్షిణాఫ్రికా 6 విజయాలు, ఓ పరాజయం రికార్డుతో ఉంది. ధర్మశాల వేదికగా జరిగిన లోస్కోరింగ్ పోరులో నెదర్లాండ్స్ చేతిలో 38 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. 12 పాయింట్లతో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోగలిగింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన సమయంలో 5 విజయాలు సాధించిన రికార్డు సఫారీలకు ఉంది. చేజింగ్ కు దిగిన సమయంలో ఓ గెలుపు, ఓ ఓటమి రికార్డుతో ఉంది.

భారత్ వరుసగా 7 విజయాలు సాధిస్తే..దక్షిణాఫ్రికా గత నాలుగుమ్యాచ్ ల్లోనూ విజేతగా నిలవడం ద్వారా 8వ రౌండ్ పోరుకు సిద్ధమయ్యింది. పిచ్ స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉండే పక్షంలో భారత్ అదనపు స్పిన్నర్ గా రవిచంద్రన్ అశ్విన్ ను తుదిజట్టులోకి తీసుకొనే అవకాశం లేకపోలేదు.

ఈ సూపర్ సండే బ్లాక్ బస్టర్ ఫైట్ లో ఏజట్టు నెగ్గినా..ఓడినా వచ్చేది ఆత్మవిశ్వాసం మాత్రమే కానీ..పోయేదీ ఏమీ ఉండదు. ఎందుకంటే రెండుజట్లూ ఇప్పటికే సెమీస్ చేరడంతో..రౌండ్ రాబిన్ లీగ్ లో ఇదో మ్యాచ్ మాత్రమే.

రెండుజట్లూ ఇది తమకు మరో మ్యాచ్ మాత్రమే అన్న భావనతోనే బరిలోకి దిగుతున్నాయి. ఫలితం ఎలాఉన్నా మ్యాచ్ మాత్రం రసపట్టుగా, పైసా వసూల్ అనుకొనేలా సాగటం మాత్రం ఖాయం.

Tags:    
Advertisement

Similar News