వినేశ్ అప్పీలు తీర్పు తేదీపై గందరగోళం!

పారిస్ ఒలింపిక్స్ కు తెరపడుతున్నా భారత వస్తాదు వినేశ్ పోగట్ కు సత్వరమే న్యాయం జరిగేలా కనిపించడం లేదు.

Advertisement
Update:2024-08-11 10:00 IST

పారిస్ ఒలింపిక్స్ కు తెరపడుతున్నా భారత వస్తాదు వినేశ్ పోగట్ కు సత్వరమే న్యాయం జరిగేలా కనిపించడం లేదు.

క్రీడాప్రపంచాన్ని, భారత జాతిని గత కొద్దిరోజులుగా కదిపి కుదిపేసిన మల్లయోధురాలు వినేశ్ పోగట్ కు ఉపశమనం కల్పించే దిశగా అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం సత్వరమే నిర్ణయం తీసుకొనేలా కనిపించడం లేదు. తనకు న్యాయం చేయాలంటూ వినేశ్ చేసిన అప్పీలుపై విచారణ ముగిసినా..తుదితీర్పు ప్రకటించే తేదీపై గందరగోళం కొనసాగుతోంది.

100 గ్రాముల అదనపు బరువుతో.....

పారిస్ వేదికగా గత రెండువారాలుగా జరుగుతున్న 2024 ఒలింపిక్స్ లో భారత అథ్లెట్లు సాధించిన పతకాలు, ప్రదర్శన కంటే..మహిళా కుస్తీ బరిలో వినేశ్ పోగట్ కు జరిగిన అన్యాయం పైనే ఇప్పుడు దేశమంతా చర్చించుకొంటున్నారు. అన్నీ సక్రమంగా జరిగితే బంగారు పతకంతో పోడియంపై సగర్వంగా నిలవాల్సిన వినేశ్ ఓ సాంకేతిక అంశంపై న్యాయం కోసం ప్రపంచ కుస్తీ సమాఖ్య, అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘంతో న్యాయపోరాటం చేయాల్సి వస్తోంది.

మహిళల ఫ్రీ-స్టయిల్ కుస్తీ 50 కిలోల విభాగంలో ఒకేరోజున మూడుదేశాల వస్తాదులను చిత్తు చేయడం ద్వారా ఫైనల్స్ చేరిన రోజున 50 కిలోల బరువు మాత్రమే ఉన్న వినేశ్ పోగట్...ఫైనల్ రోజున 100 గ్రాముల బరువు అదనంగా ఉండటంతో అనర్హత వేటుకు బలయ్యింది.

అదనపు బరువు తగ్గటం కోసం ఫైనల్ కు ముందురోజు రాత్రి వినేశ్ కంటిమీద కునుకు లేకుండా గడిపింది. తెల్లవార్లూ నిదురలేకుండా గడపడంతో పాటు జిమ్ లో కసరత్తులు చేసింది..అదీ చాలదన్నట్లు సైక్లింగ్ చేసి..ఆ తరువాత విపరీతమైన ఆవిరి ఉండే గదిలో కూడా గడిపింది. కిలో అదనపు బరువు నుంచి 100 గ్రాముల అదనపు బరువు స్థాయికి వచ్చింది. చివరకు శిరోజాలను సైతం కత్తిరించుకొన్నా ఫలితం లేకుండా పోయింది. వందగ్రాముల అదనపు బరువే వినేశ్ పై అనర్హత వేటు వేసేలా చేసింది. బంగారు పతకం కోసం పోటీపడకుండా నిలువరించింది. కనీసం రజత పతకమైనా దక్కకుండా చేసింది.

తల్లడిల్లిన భారత జాతి..

వినేశ్ పోగట్ చేసిన పోరాటం, ఎదుర్కొన్న సమస్యలు, నిబంధనల సాకుతో అన్యాయంగా అనర్హత వేటుకు గురికావడాన్ని చూసి భారత జాతి చలించిపోయింది.

క్రీడలంటే మక్కువ ఉన్న ఏ ఇద్దరు కలిసినా వినేశ్ కు జరిగిన అన్యాయం గురించే చర్చించుకొనేలా చేసింది. అంతేకాదు..తీవ్రనిరాశ, అంతులేని మనస్తాపం, భరించలేని గుండెకోతతో డిప్రెషన్ లో పడిపోయిన వినేశ్ అర్థంతరంగా రిటైర్మెంట్ ప్రకటించింది. తనలో శక్తి ఉడిగిపోయిందని, సహనం, పోరాడే శక్తి ఆవిరైపోయానని,

కుస్తీనే ఊపిరిగా భావించిన తాను కుస్తీ తల్లి నుంచి వీడ్కోలు తీసుకొంటున్నానంటూ ఓ భావోద్వేగమైన ట్వి్ట్ చేసింది.

మరోవైపు..ఫైనల్స్ వరకూ 50 కిలోల బరువుతోనే ఉన్న వినేశ్ కు న్యాయం చేయాలని, కనీసం రజత పతకమైనా ఇచ్చి ఊరట కలగించాలంటూ సీఏఎస్ ( కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ ) ను ఆశ్రయించింది.

వినేశ్ పోగట్ తరపున విఖ్యాత అంతర్జాతీయ న్యాయవాదులు హరీశ్ సాల్వే, విదూష్ పత్ సింఘానియా వకాల్తా తీసుకొని వాదించారు. ప్రతివాదిగా ఐక్య కుస్తీ ప్రపంచ సమాఖ్య ప్రతినిధులు హాజరయ్యారు. విచారణను ముగించి తుదితీర్పును రిజర్వ్ లో ఉంచారు. అయితే ..తుదితీర్పును వెలువరించే తేదీపైన మాత్రం

గందరగోళం నెలకొంది. ఒలింపిక్స్ ముగింపు రోజునే తుది తీర్పు బయట పెడతామని ఒకసారి..లేదు లేదు..ఆగస్టు 13న వెలువరిస్తామని మరోసారి చెబుతూ అయోమయంలో పడేశారు.

వినేశ్ కు పతకం అనుమానమే?

ఒలింపిక్స్ చరిత్రలో ఇద్దరికి రజత పతకాలు ఇచ్చిన చరిత్ర, సాంప్రదాయం అంటూ లేవని..వినేశ్ విచారణ ప్రారంభానికి ముందే అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య అధ్యక్షుడు థామస్ బెక్ ప్రకటించి అనుమానాలకు బీజం వేశారు. మరోవైపు ప్రపంచ కుస్తీ నియమనిబంధనలను రూపొందించడం, అమలు చేయటం లాంటి వ్యవహారాలను పర్యవేక్షించే ప్రపంచ ఐక్యకుస్తీ సమాఖ్య సైతం వినేశ్ కు అదనంగా రజత పతకం ఇవ్వటానికి ఏమాత్రం సమ్మతించడంలేదు. అయితే..వినేశ్ కు పతకం దక్కకుండా చేసిన నిబంధనలను సవరించడానికి సుముఖమేనని స్పష్టం చేసింది.

ఇదంతా చూస్తుంటే సాంకేతిక అంశాలతో తీవ్రఅన్యాయానికి గురైన 29 సంవత్సరాల వినేశ్ కు ఏమాత్రం న్యాయం జరిగేలా కనిపించడం లేదు. ఏదైనా అద్భుతం జరిగి వినేశ్ కు రజత పతకం ఇవ్వాలని నిర్ణయిస్తే మాత్రం 140 కోట్లమంది భారతీయులతోపాటు ప్రపంచ క్రీడాభిమానులంతా ఆనందంతో ఉక్కిరిబిక్కిరికాక తప్పదు.

Tags:    
Advertisement

Similar News