స్పిన్నర్లకు చిక్కడు, పేసర్లకు దొరకడు..జిడ్డాటలో మొనగాడు!
భారత టెస్టు క్రికెట్ నయావాల్ చతేశ్వర్ పూజారా కంగారూల పని పట్టడానికి మరోసారి సై అంటున్నాడు.
భారత టెస్టు క్రికెట్ నయావాల్ చతేశ్వర్ పూజారా కంగారూల పని పట్టడానికి మరోసారి సై అంటున్నాడు. నాగపూర్ వేదికగా ఆస్ట్ర్రేలియాతో జరిగే తొలిటెస్టుతో పాటు నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ కు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాడు...
మెరుపు వేగంతో కేవలం మూడున్నర గంటల్లోనే ముగిసిపోయే ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో.... లస్యం అమృతం విషమైతే, ఐదురోజులపాటు సాగే సాంప్రదాయ టెస్టు క్రికెట్లో నిదానమే ప్రధానం.
గంటగంటకూ, సెషన్ సెషన్ కూ ఆధిక్యత చేతులు మారుతూ ఐదురోజులపాటు నాలుగు ఇన్నింగ్స్ గా సాగే టెస్టుమ్యాచ్ ల్లో ఓ జట్టు విజేతగా నిలవాలంటే, నెగ్గుకురావాలంటే వన్ డౌన్ స్థానంలో ఆచితూచి ఆడుతూ, గంటల తరబడి క్రీజులో పాతుకుపోయే బ్యాటర్ ఉండితీరాలి.
గతంలో భారత్ తరపున వన్ డౌన్ స్థానంలో రాహుల్ ద్రావిడ్ అలాంటి పాత్రే నిర్వర్తించాడు. ఎంతటి గొప్పగొప్ప బౌలర్లనయినా పటిష్టమైన తన డిఫెన్స్ తో విసిగించి డస్సిపోయేలా చేసేవాడు. ఇప్పుడు ద్రావిడ్ వారసుడిగా నయావాల్ చతేశ్వర్ పూజారా సైతం కచ్చితంగా అదే పాత్రను నిర్వర్తిస్తున్నాడు.
ఒక్క పరుగు కోసం 40 బంతులు..
చతేశ్వర్ పూజారా..టెస్టు క్రికెట్ కోసమే పుట్టిన ఆటగాడు. అందిన బంతిని అందినట్లు బాదేరకం కాదు. చక్కటి నైపుణ్యానికి ఓర్పు,నేర్పులను మేళవించి మరీ బౌలర్లను ఎదుర్కొనడంలో పూజారాకు పూజారా మాత్రమే సాటి. బౌలర్లు తప్పు చేసిన సమయం లేదా బౌండ్రీ బంతులు దొరికిన సమయంలోనే పరుగులు సాధించడం నైజం.
సింగిల్స్ , డబుల్స్ తీస్తూ..స్ట్ర్రయిక్ రొటేట్ చేస్తూ ప్రత్యర్థి బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టడంలో పూజారా తర్వాతే ఎవరైనా.
భారత్ తరపున ఇప్పటికే 98 టెస్టు మ్యాచ్ లు ఆడేసి 7 వేలకు పైగా పరుగులు సాధించిన పూజారా..ఓ టెస్టు ఇన్నింగ్స్ లో తన తొలి పరుగు సాధించడానికి 40 బంతుల పాటు జిడ్డాట ఆడి ..బాబోయ్ అనిపించాడు.
స్పిన్నర్లపాలిట యముడు..
మెరుపు ఫాస్ట్ బౌలర్లను, మ్యాజిక్ స్పిన్ బౌలర్లను ఒకేతీరుగా ఎదుర్కొనగల సామర్థ్యం పూజారాకు ఉంది. అయితే..తన ఫుట్ వర్క్ తో స్పిన్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ పరుగులు సాధించడంలో పూజారాకు అసాధారణ ప్రతిభే ఉంది.
లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్, లెఫ్టామ్ స్పిన్..స్పిన్నర్ ఎవరైనా లెక్కచేయకుండా ఆడగల దమ్ము ప్రస్తుత భారత టెస్టు జట్టులో కేవలం పూజారాకు మాత్రమే ఉంది.
ఆస్ట్ర్రేలియాతో నాగపూర్ వేదికగా ప్రారంభమయ్యే నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో పూజారా కీలకం కానున్నాడు. కంగారూ స్పిన్నర్ల నేథన్ లయన్, ఆస్టన్ అగర్ లను దీటుగా ఎదుర్కొనే బాధ్యతను టీమ్ మేనేజ్ మెంట్ పూజారాకే అప్పజెప్పింది.
2018-19, 2020-21 సిరీస్ ల్లో భారత్ విజేతగా నిలవడంలో పూజారా ప్రధానపాత్రే వహించాడు.
కంగారూలపై తిరుగులేని రికార్డు..
ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా పూజారాకు కళ్లు చెదిరే రికార్డే ఉంది. మొత్తం 37 ఇన్నింగ్స్ లో 54 సగటుతో 1893 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 42 స్ట్ర్రయిక్ రేటుతో, 204 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డులతో మరో సిరీస్ సమరానికి ఆస్ట్ర్రేలియాతో పూజారా సై అంటున్నాడు.
2010లో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా టెస్టు అరంగేట్రం చేసిన పూజారా 2022 బంగ్లా సిరీస్ వరకూ ఆడిన మొత్తం 98 టెస్టుల్లో 7వేల 14 పరుగులు సాధించాడు. మొత్తం 19 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలతో 44.39 సగటు నమోదు చేశాడు. ప్రస్తుత సిరీస్ లోని రెండోటెస్టు ద్వారా 100 టెస్టుల క్లబ్ లో చేరిన అరుదైన భారత క్రికెటర్ల సరసన నిలవటానికి ఉరకలేస్తున్నాడు.
2023 ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్స్ కు భారత్ అర్హత సాధించాలన్నా..ఆస్ట్ర్రేలియాతో నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భారత్ విజేతగా నిలవాలన్నా జిడ్డాటలో మేటి చతేశ్వర్ పూజారా అత్యుత్తమంగా రాణించక తప్పదు.