ప్రపంచకప్ రన్నరప్ ప్రఙ్జానంద్!

2023 ప్రపంచకప్ చెస్ ఫైనల్లో భారత యువగ్రాండ్ మాస్టర్ ప్రఙ్జానంద్ పోరాడి ఓడి రజత పతకంతో సరిపెట్టుకొన్నాడు. 2024 క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సంపాదించాడు.

Advertisement
Update:2023-08-25 14:00 IST

భారత యువగ్రాండ్ మాస్టర్ ప్రఙ్జానంద్

2023 ప్రపంచకప్ చెస్ ఫైనల్లో భారత యువగ్రాండ్ మాస్టర్ ప్రఙ్జానంద్ పోరాడి ఓడి రజత పతకంతో సరిపెట్టుకొన్నాడు. 2024 క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సంపాదించాడు.

అజర్ బైజాన్ రాజధాని బకు వేదికగా జరిగిన 2023 ప్రపంచకప్ చదరంగ టైటిల్ పోరులో భారత యువగ్రాండ్ మాస్టర్, 18 సంవత్సరాల ప్రఙ్జానంద్ పోరాడి ఓడి రజత పతకంతో నిలిచాడు.

ప్రపంచ టాప్ ర్యాంక్ ప్లేయర్, ఐదుసార్లు విశ్వవిజేత మాగ్నుస్ కార్ల్ సన్ తో జరిగిన ఫైనల్ లో ప్రఙ్జానంద్ గట్టిపోటీ ఇచ్చినా ఓటమి తప్పలేదు. రెండుగేమ్ ల క్లాసికల్ రౌండ్ ను 1-1తో డ్రాగా ముగించిన ప్రఙ్జానంద్ రెండుగేమ్ ల టై బ్రేక్ లో సైతం సమఉజ్జీగానే నిలవడంతో రెండుగేమ్ ల ర్యాపిడ్ రౌండ్ ను నిర్వహించారు.

ర్యాపిడ్ రౌండ్ తొలిగేమ్ లో విజేతగా నిలవడం ద్వారా కార్ల్ సన్ 1-0 ఆధిక్యం సాధించాడు. రెండోగేమ్ ను ప్రఙ్జానంద్ డ్రాతో సరిపెట్టుకోడంతో 1.5- 0.5తో రన్నరప్ గా నిలవాల్సి వచ్చింది.

ప్రపంచ చెస్ లో గత దశాబ్దగకాలంగా తిరుగులేని చాంపియన్ గా నిలుస్తూ వచ్చిన దిగ్గజ ఆటగాడు మాగ్నుస్ కార్ల్ సన్ ప్రపంచకప్ గెలుచుకోడం ఇదే మొదటిసారి. ఈ విజయంతో ట్రోఫీతో పాటు లక్షా 10వేల డాలర్ల ప్రైజ్ మనీని సైతం కార్ల్ సన్ అందుకొన్నాడు.

ప్రఙ్జానంద్ కు కార్ల్ సన్ హ్యాట్సాఫ్!

ప్రస్తుత ప్రపంచకప్ టోర్నీలో తనకు భారత యువఆటగాళ్ల నుంచి గట్టిపోటీ ఎదురయ్యిందని, క్వార్టర్ ఫైనల్లో భారత కుర్రగ్రాండ్ మాస్టర్ గుకేశ్ తనకు దిక్కుతోచని పరిస్థితి కల్పించాడని, క్లాసికల్ గేమ్స్ లో గుకేశ్ ను మించిన ప్రత్యర్థి తనకు మరొకరు కనిపించలేదని ప్రశంసించాడు.

ఇక..టైటిల్ పోరులో మరో యువగ్రాండ్ మాస్టర్ ప్రఙ్జానంద్ తనను మూడురోజులపాటు తీవ్రఒత్తిడికి గురి చేయడం ద్వారా నిలువరించాడని కొనియాడాడు. క్లాసికల్ గేమ్స్ తో పాటు టై బ్రేక్ గేమ్ ల్లోనూ ప్రఙ్జానంద్ పోరాటం అమోఘమంటూ హ్యాట్సాఫ్ చెప్పాడు.

అప్పుడు ఆనంద్..ఇప్పుడు ప్రఙ్జానంద్!

కేవలం 18 సంవత్సరాల చిరుప్రాయంలోనే ప్రపంచకప్ చెస్ ఫైనల్ చేరడం ద్వారా ప్రఙ్జానంద్ ఓ అరుదైన ఘనత సాధించాడు. గతంలో భారత సూపర్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ సాధించిన రికార్డును ఇప్పుడు ప్రఙ్జానంద్ అందుకోగలిగాడు.

ప్రపంచకప్ రన్నరప్ గా నిలవడం ద్వారా 2024 ప్రపంచ క్యాండిడేట్స్ టోర్నీకి ప్రఙ్జానంద్ అర్హత సంపాదించాడు. 2024 ప్రపంచ చెస్ టైటిల్ కోసం..డిఫెండింగ్ చాంపియన్, గ్రాండ్ మాస్టర్ డి లిరెన్ తో తలపడటానికి అర్హతగా ..కెనడాలోని టొరాంటో వేదికగా 2024 ఏప్రిల్ 2 నుంచి 25 వరకూ క్యాండిడేట్స్ టోర్నీ నిర్వహిస్తారు.

మొత్తం ఎనిమిదిమంది ప్రపంచ మేటి గ్రాండ్ మాస్టర్లు ఈ టోర్నీలో పోటీపడతారు. ఈ ఎనిమిదిమందిలో ప్రఙ్జానంద్ సైతం ఉన్నాడు.

ప్రఙ్జానంద్ కు ప్రధాని హ్యాట్సాఫ్!

ప్రస్తుత ప్రపంచకప్ టోర్నీలో ప్రపంచ రెండోర్యాంక్ ప్లేయర్ హికారు నకామురా, 3వ ర్యాంక్ ఆటగాడు ఫాబియో కరునూలపై సంచలన విజయాలు సాధించడం తో పాటు ఫైనల్లో ఐదుసార్లు విశ్వవిజేత మాగ్నుస్ కార్ల్ సన్ ను ముప్పతిప్పలు పెట్టిన ప్రఙ్జానంద్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ జేజేలు పలికారు.

18 సంవత్సరాల చిన్నవయసులోనే గొప్పఘనత, అరుదైన విజయం సాధించిన ప్రఙ్జానంద్ ను చూసి దేశం గర్విస్తోందని ప్రధాని తన సందేశంలో పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News