దిగ్గజాల సమరం బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ!

టెస్టు క్రికెట్ చరిత్రలో వివిధ దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక సిరీస్ ల్లో యాషెస్ సమరాన్ని భారత్- ఆస్ట్ర్రేలియాజట్ల బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీ మించిపోయింది.

Advertisement
Update:2023-02-07 10:12 IST

టెస్టు క్రికెట్ చరిత్రలో వివిధ దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక సిరీస్ ల్లో యాషెస్ సమరాన్ని భారత్- ఆస్ట్ర్రేలియాజట్ల బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీ మించిపోయింది.

2023 బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ కు నాగపూర్ లో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది....

సాంప్రదాయ టెస్టు క్రికెట్లో వివిధ జట్ల మధ్య జరిగే ద్వైపాక్షిక సిరీస్ ల్లో దేని ప్రత్యేకత దానిదే. ఇంగ్లండ్- ఆస్ట్ర్రేలియాజట్ల మధ్య జరిగే యాషెస్ వార్, ఆస్ట్ర్రేలియా- న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే ట్రాన్స్-టాస్మన్ సమరం ఎంత ప్రముఖమైనవో..భారత్- ఆస్ట్ర్రేలియాజట్ల మధ్య జరిగే బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ అంతే ప్రధానమైనది.

సమఉజ్జీల సమరం ఇది....

ఆస్ట్ర్రేలియా, భారత మాజీ కెప్టెన్లు, ఆల్ టైమ్ గ్రేట్ క్రికెటర్లు అలెన్ బోర్డర్, సునీల్ గవాస్కర్ ల పేరుతో రెండుజట్ల ద్వైపాక్షిక టెస్టు సిరీస్ విజేతలకు ఇచ్చే ట్రోఫీకి..బోర్డర్-గవాస్కర్ ట్రోఫీగా నామకరణం చేశారు.

భారతజట్టు ఓ సీజన్లో ఆస్ట్ర్రేలియా పర్యటనకు వెళ్లి అక్కడి ఫాస్ట్, బౌన్సీ పిచ్ లపై నానాపాట్లు పడితే..కంగారూజట్టు భారత్ లోని స్లో, స్పిన్ పిచ్ లపై కకావికలు కావటం

ఈ రెండుజట్ల ద్వైపాక్షిక సిరీస్ ల చరిత్రలో మనకు ప్రధానంగా కనిపిస్తుంది.

ఆస్ట్ర్రేలియాను ఆస్ట్ర్రేలియా గడ్డపై ఓడించి టెస్టు సిరీస్ నెగ్గటం భారత్ కు ఓ బంగారు స్వప్నమైతే...భారత్ ను భారత్ లో కంగు తినిపించి టెస్టు సిరీస్ సాధించడం ఆస్ట్ర్రేలియాకు ఓ తీరని కోరిక.

అయితే..ఈరెండుజట్లూ ఎన్నోసార్లు విఫలమైనా..అతికొద్దిసార్లు మాత్రమే తమతమ లక్ష్యాలను నెరవేర్చుకోగలిగాయి.

అప్పుడు కంగారూజోరు- ఇప్పుడు భారత హోరు!

1970 దశకం వరకూ ఆస్ట్ర్రేలియాతో టెస్టు సిరీస్ ల్లో కనీసం ఒక్కమ్యాచ్ నెగ్గినా చాలు అన్న పరిస్థితి ఉండేది. అత్యంత బలమైన ఆస్ట్ర్రేలియాను ఎదుర్కొనటం భారత్ కు ఆరోజుల్లో కొండను ఓ పసికూన ఢీ కొన్నట్లుగా ఉండేది.

గత ఎనిమిది దశాబ్దాల కాలంలో ఈ రెండుజట్లు పలు టెస్టు సిరీస్ ల్లో భాగంగా 102సార్లు తలపడితే..ఆస్ట్ర్రేలియా 43 విజయాలు, భారత్ 30 విజయాల రికార్డుతో ఉన్నాయి.

28 టెస్టులు డ్రాగా ముగిస్తే..ఓ టెస్టు మ్యాచ్ టైగా రికార్డుల్లో చేరింది.

గత మూడుసిరీస్ ల్లో భారత్ టాప్..

ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా భారత్ ఆడిన గత మూడుసిరీస్ ల్లో అజేయంగా నిలవడం ఓ అసాధారణ ఘనతగా మిగిలిపోతుంది. భారత్ వేదికగా జరిగిన 2016-17 సిరీస్ , ఆస్ట్ర్రేలియా గడ్డపైన జరిగిన 2018- 19 సిరీస్, కంగారూల్యాండ్ వేదికగానే ముగిసిన 2020-21 సిరీస్ ల్లో భారతజట్టే విజేతగా నిలిచింది.

ప్రస్తుత 2023 సిరీస్ ను ఈ రెండుజట్లూ భారత్ వేదికగా ఆడబోతున్నాయి.

ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా ఈనెల 9 నుంచి నాగపూర్ విదర్భ స్టేడియం వేదికగా నాలుగుమ్యాచ్ ల ఈ సూపర్ డూపర్ టెస్టు సిరీస్ ప్రారంభంకానుంది. న్యూఢిల్లీ, ధర్మశాల, అహ్మదాబాద్ వేదికలుగా మిగిలిన మూడుటెస్టుమ్యాచ్ లు జరుగనున్నాయి.

పరుగుల మొనగాడు సచిన్ టెండుల్కర్..

బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ సిరీస్ ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఘనతను మాస్టర్ సచిన్ టెండుల్కర్ దక్కించుకొన్నాడు. సచిన్ మొత్తం 3 వేల 262 పరుగులు సాధించాడు. ఆ తర్వాతి స్థానంలో ఆస్ట్ర్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ నిలిచాడు. రికీ 2వేల 555 పరుగులు సాధించాడు. వీవీఎస్ లక్ష్మణ్ 2434 పరుగులతో మూడోస్థానంలో నిలిచాడు.

అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన మొనగాడిగా కంగారూ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ నిలిచాడు. క్లార్క్ 329 పరుగుల నాటౌట్ స్కోరు సాధిస్తే..వీవీఎస్ లక్ష్మణ్ 281, రికీ పాంటింగ్ 257 పరుగుల స్కోర్లతో ఆ తర్వాతి స్థానాలలో ఉన్నారు.

అత్యధికంగా మాస్టర్ సచిన్ 9 శతకాలు బాదితే..స్టీవ్ స్మిత్ 9, రికీ పాంటింగ్ 8 సెంచరీలు నమోద చేశారు. అత్యధిక అర్థశతకాల రికార్డు సైతం సచిన్ పేరుతోనే ఉంది.

సచిన్ 25, రికీ పాంటింగ్ 20, వీవీఎస్ లక్ష్మణ్ 18 అర్థశతకాలతో మొదటి మూడుస్థానాలలో ఉన్నారు.

వికెట్లవీరుడు అనీల్ కుంబ్లే...

బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ రికార్డు లెగ్ స్పిన్ దిగ్గజం అనీల్ కుంబ్లే పేరుతో ఉంది. కుంబ్లే 111 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.

హర్భజన్ సింగ్ 95, నేథన్ లయన్ 94 వికెట్లతో మొదటి మూడుస్థానాలలో కొనసాగుతున్నారు.

ఒక్కో టెస్టులో 5 వికెట్ల ఘనతను కుంబ్లే 10సార్లు, హర్భజన్ సింగ్ 7, నేథన్ లయన్ 7సార్లు చొప్పున సాధించారు. ఒక్కో టెస్టులో 10 వికెట్ల రికార్డును హర్భజన్ సింగ్ మూడుసార్లు, కుంబ్లే 2సార్లు, క్రెజా ఒక్కసారి సాధించారు.

2000-01 సిరీస్ లో హర్భజన్ సింగ్ అత్యధికంగా 32 వికెట్లు పడగొడితే..2012-13 సిరీస్ లో రవిచంద్రన్ అశ్విన్ 29 వికెట్లు, 2011-12 సిరీస్ లో హిల్ఫెనాస్ 27 వికెట్లు సాధించారు.

ఇరుజట్ల పోరులో భారత్ అత్యధికంగా 7 వికెట్లకు 705 పరుగులు, అత్యల్పంగా 36 పరుగుల స్కోర్లు నమోదు చేస్తే..ఆస్ట్ర్రేలియా 4 వికెట్లకు 659 పరుగుల అత్యధిక, 93 పరుగుల అత్యల్ప స్కోర్ల రికార్డులు మూటగట్టుకొన్నాయి.

అత్యధికంగా ఇశాంత్ శర్మ 12సార్లు డకౌట్లు కాగా..అజిత్ అగార్కర్ 8, జహీర్ ఖాన్ 7సార్లు ఖాత తెరవకుండానే అవుటయ్యారు.

ఈ నెల 9 నుంచి ప్రారంభమయ్యే సరికొత్త సిరీస్ లో రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత్, ఆల్ రౌండర్ యాండీ కమ్మిన్స్ కెప్టెన్సీలోని ఆస్ట్ర్రేలియాజట్లు మరెన్ని సరికొత్త, చిరస్మరణీయ రికార్డులు నెలకొల్పుతాయో ..వేచిచూడాల్సిందే.

Tags:    
Advertisement

Similar News