బంగ్లా ఎంపీగా క్రికెట్ కెప్టెన్ షకీబుల్ హసన్!

మన పొరుగు దేశం బంగ్లాదేశ్ లో సరికొత్త ట్రెండ్ మొదలయ్యింది. క్రికెట్ కెప్టెన్లు అధికార పార్టీ ప్రాపకంతో రాజకీయ నాయకులుగా, పార్లమెంట్ సభ్యులుగా మారిపోతున్నారు.

Advertisement
Update:2024-01-08 11:15 IST

మన పొరుగు దేశం బంగ్లాదేశ్ లో సరికొత్త ట్రెండ్ మొదలయ్యింది. క్రికెట్ కెప్టెన్లు అధికార పార్టీ ప్రాపకంతో రాజకీయ నాయకులుగా, పార్లమెంట్ సభ్యులుగా మారిపోతున్నారు.

రాజకీయచైతన్యం ఎక్కువగా ఉన్న బంగ్లాదేశ్ లో రానురాను క్రికెట్టు, రాజకీయం ఏకమైపోతున్నాయి. మాజీ కెప్టెన్ ముష్రఫే మొర్తాజా, ప్రస్తుత కెప్టెన్ షకీబుల్ హసన్ క్రికెటర్లుగానే కొనసాగుతూ పార్లమెంటు సభ్యులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అధికార పార్టీ ప్రాపకంతో క్రికెట్ క్యాప్ ల స్థానంలో రాజకీయ టోపీలు ధరిస్తున్నారు.

అప్పుడు మొర్తాజా..ఇప్పుడు షకీబుల్ హసన్...

బంగ్లాదేశ్ పార్లమెంట్ కు జరిగిన ఎన్నికల్లో అధికార అవామీలీగ్ పార్టీ తరపున రాజకీయ అరంగేట్రం చేసిన బంగ్లా సూపర్ ఆల్ రౌండర్ కమ్ కెప్టెన్ షకీబుల్ హసన్ ఎంపీగా బంపర్ మెజారిటీతో ఎన్నికయ్యాడు. ఓ వైపు బంగ్లాదేశ్ క్రికెట్ కెప్టెన్ గా కొనసాగుతూనే మరోవైపు పార్లమెంట్ సభ్యుడిగానూ ఇక ద్విపాత్రాభినయం చేయనున్నాడు.

బంగ్లారాజధాని ఢాకా నగరంలో పశ్చిమప్రాంత నియోజక వర్గం ముగురా స్థానం నుంచి షకీబుల్ 1, 50, 000 ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థిని చిత్తు చేశాడు.

షేక్ హసీనా నాయకత్వంలోని అధికారపార్టీ నిరంకుశ విధానాలకు నిరసనగా ప్రతిపక్షపార్టీలు ఎన్నికలను బహిష్కరించిన నేపథ్యంలో షకీబుల్ భారీ మెజారిటీతో విజేత కాగలిగాడు.

అధికార పార్టీకి నామమాత్ర పోటీ...

ప్రధాన ప్రతిపక్షపార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఎన్నికలను బాయ్ కాట్ చేయడంతో అధికారపార్టీ అభ్యర్ధులకు నామమాత్ర పోటీ కూడా లేకుండా పోయింది. అధికార అవామీలీగ్ పార్టీ వరుసగా నాలుగోసారి, మొత్తం మీద ఐదోసారి అధికారం చేపట్టనుంది.

ఈ ఎన్నికలో తనకు పోటీ ఉండబోదని తెలిసినా ఏదో తెలియని ఒత్తిడికి గురైనట్లు షకీబుల్ ప్రకటించాడు. భారత్ వేదికగా ముగిసిన ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో చివరిసారిగా బంగ్లాదేశ్ కు ప్రాతినిథ్యం వహించిన షకీబుల్ ఆ తర్వాత నుంచి క్రికెట్ కు విరామం ఇచ్చి..రాజకీయాలపై దృష్టి పెట్టాడు.

బంగ్లాదేశ్ లో విపరీతమైన అభిమానులున్న ఆటగాడిగా పేరున్న షకీబుల్ తన క్రికెట్ క్రేజ్ ను పూర్తిస్థాయిలో సొమ్ము చేసుకోగలిగాడు. గతంలో బంగ్లాదేశ్ కు కెప్టెన్ గా వ్యవహరించిన ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ ముష్రఫే మొర్తాజా సైతం అధికార పార్టీ అభ్యర్థిగానే పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆ పరంపరను ప్రస్తుత కెప్టెన్ షకీబుల్ సైతం కొనసాగించగలిగాడు.

క్రికెట్ నుంచి రిటైర్ కాలేదు.....

తాను క్రికెట్ నుంచి రిటైర్ కాలేదని, జంట బాధ్యతలు నిర్వర్తించడం ఖాయమని బంగ్లా పార్లమెంట్ కు తొలిసారిగా ఎన్నికైన షకీబుల్ స్పష్టం చేశాడు. ఇటు క్రికెటర్ గానూ, అటు రాజకీయనాయకుడిగానూ కొనసాగటంలో తనకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని తేల్చిచెప్పాడు.

బంగ్లాదేశ్ క్రికెట్ నుంచి అంత్జాతీయ క్రికెట్లోకి దూసుకొచ్చిన అత్యుత్తమ స్పిన్ ఆల్ రౌండర్ గా షకీబుల్ కు పేరుంది. గతేడాది భారత్ వేదికగా ముగిసిన 2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో బంగ్లాజట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన షకీబుల్ 7 మ్యాచ్ లు ఆడి ఓ హాఫ్ సెంచరీతో సహా 186 పరుగులు సాధించడంతో పాటు..బౌలర్ గా 7 వికెట్లు పడగొట్టాడు.

Tags:    
Advertisement

Similar News