ఆస్ట్ర్రేలియన్ ఓపెన్లో భారత ఆటగాడి సంచలనం!

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ లో భారత ఆటగాడు సుమిత్ నగాల్ సంచలనం సృష్టించాడు. తొలిరౌండ్లో 27 సీడెడ్ ప్లేయర్ ను కంగు తినిపించాడు.

Advertisement
Update:2024-01-17 11:48 IST

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ లో భారత ఆటగాడు సుమిత్ నగాల్ సంచలనం సృష్టించాడు. తొలిరౌండ్లో 27 సీడెడ్ ప్లేయర్ ను కంగు తినిపించాడు.

2024 సీజన్ గ్రాండ్ స్లామ్ తొలిటోర్నీ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ లో భారత ఆటగాడు సుమిత్ నగాల్ సంచలన విజయంతో అరుదైన ఘనత సాధించాడు. 1989 తరువాత ఓ సీడెడ్ ఆటగాడిని ఓడించిన భారత ఆటగాడిగా రికార్డుల్లో చేరాడు.

మెయిన్ రౌండ్లోనూ అదేజోరు....

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ మెయిన్ డ్రాలో చోటు కోసం జరిగిన క్వాలిఫైయింగ్ రౌండ్లలో వరుసగా మూడు విజయాలు సాధించిన సుమిత్ నగాల్..ప్రధాన డ్రా తొలిరౌండ్లోనూ అదేజోరు కొనసాగించాడు.

మెల్బోర్న్ రాడ్ లేవర్ ఎరీనా వేదికగా జరిగిన తొలిరౌండ్ పోరులో అన్ సీడెడ్ సుమిత్ నగాల్ మూడుసెట్ల పోరులో కజకిస్థాన్ కు చెందిన 27వ సీడెడ్ ప్లేయర్ అలెగ్జాండర్ బుబ్లిక్ పై సంచలన విజయం సాధించాడు.

నాడు రమేశ్ కృష్ణన్..నేడు సుమిత్ నగాల్...

35 సంవత్సరాల బుబ్లిక్ తో హోరాహోరీగా సాగిన మూడుసెట్ల పోరులో 26 ఏళ్ళ సుమిత్ నగాల్ 6-4, 6-2, 7-6తో వరుస సెట్ల విజయం సాధించాడు. 1989 ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ లో అప్పటి టాప్ సీడ్ ప్లేయర్ మాట్స్ విలాండర్ ను భారత ఆటగాడు రమేశ్ కృష్ణన్ కంగుతినిపిస్తే..ప్రస్తుత 2024 టోర్నీలో సుమిత్ నగాల్ అదేస్థాయి విజయం సాధించాడు.

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ చరిత్రలో 1989 తరువాత ఓ సీడెడ్ ఆటగాడిని ఇంటిదారి పట్టించిన మొనగాడిగా నిలిచాడు.

తొలిరౌండ్ గెలుపుతో భారీ ప్రైజ్ మనీ...

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ తొలిరౌండ్ గెలుపుతో సుమిత్ నగాల్ లక్షా 80వేల ఆస్ట్ర్రేలియన్ డాలర్లు ( 95000 పౌండ్లు ) ప్రైజ్ మనీ ఖాయం చేసుకొన్నాడు. గత సెప్టెంబర్ వరకూ తన బ్యాంకు ఖాతాలో 775 పౌండ్లు మాత్రమే ఉందని, ప్రస్తుత ఈ విజయంతో ఆ మొత్తం 95వేలకు చేరిందని చమత్కరించాడు.

గతంలో 2021 ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ మెయిన్ డ్రాకు అర్హత సాధించినా తొలిరౌండ్ పోరులో లిథువేనియాకు చెందిన రికార్డస్ బెరింకిస్ చేతిలో నగాల్ 2-6, 5-7, 3-6తో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

మహిళల సింగిల్స్ లో సీడెడ్ కు షాక్...

మహిళల సింగిల్స్ లో 6వ సీడ్ స్టార్ ఓన్స్ జబేర్ పై రష్యన్ టీనేజర్ మిర్రా ఆంద్రీవా సంచలన విజయం సాధించింది. 6-0, 6-2తో జబేర్ ను చిత్తు చేసింది. ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ రెండోరౌండ్లోనే పరాజయం పొందటం ఓన్స్ జబేర్ కు వరుసగా ఇది రెండోసారి.

రెండోరౌండ్ పోరులో ప్రపంచ మరో మాజీ చాంపియన్ కారోలిన్ వోజ్నియాకీ కి సైతం తొలిరౌండ్ ఓటమి తప్పలేదు. వోజ్నియాకీని క్వాలిఫైయర్ మారియా టోమీఫీవా ఇంటిదారి పట్టించింది.

3వ రౌండ్లో సిన్నర్, అల్ కరాజ్.....

పురుషుల సింగిల్స్ మూడోరౌండ్ కు టాప్ సీడెడ్ స్టార్లు కార్లోస్ అల్ కరాజ్, యానిక్ సిన్నర్ చేరుకొన్నారు. ప్రపంచ నాలుగోర్యాంక్ ఆటగాడు యానిక్ సిన్నర్ వరుస సెట్లలో డచ్ ఆటగాడు జెస్పర్ డి జోంగ్ ను 6-2, 6-2, 6-2తో చిత్తు చేసి తన కెరియర్ లో మూడోసారి మూడోరౌండ్ కు అర్హత సంపాదించగలిగాడు.

స్పానిష్ యువసంచలనం కార్లోస్ అల్ కరాజ్ సైతం తన ప్రత్యర్థిని అలవోకగా ఓడించాడు.

Tags:    
Advertisement

Similar News