ఆసియాజట్లు అవుట్, ప్రపంచకప్ క్వార్టర్స్ లో బ్రెజిల్, క్రొయేషియా!

2022 ఫిఫా ప్రపంచకప్ ప్రీ-క్వార్టర్స్ లోనే ఆసియాజట్ల పోటీ ముగిసింది. ఐదుసార్లు విజేత బ్రెజిల్, గత టోర్నీ రన్నరప్ క్రొయేషియా క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకొన్నాయి.

Advertisement
Update:2022-12-06 11:28 IST

ఆసియాజట్లు అవుట్, ప్రపంచకప్ క్వార్టర్స్ లో బ్రెజిల్, క్రొయేషియా!

2022 ఫిఫా ప్రపంచకప్ ప్రీ-క్వార్టర్స్ లోనే ఆసియాజట్ల పోటీ ముగిసింది. ఐదుసార్లు విజేత బ్రెజిల్, గత టోర్నీ రన్నరప్ క్రొయేషియా క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకొన్నాయి...

ఖతర్ రాజధాని దోహా వేదికగా జరుగుతున్న 2022 ఫిఫా ప్రపంచకప్ ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ నాకౌట్ రౌండ్ పోటీలు ముగింపు దశకు చేరాయి. ఆసియా దిగ్గజజట్లు జపాన్, దక్షిణ కొరియాజట్ల పోటీ ప్రీ-క్వార్టర్స్ లోనే ముగిసింది. కాగా హాట్ ఫేవరెట్ , ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ బ్రెజిల్, 2018 ప్రపంచకప్ రన్నరప్ క్రొయేషియాజట్లు క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకొన్నాయి.

బ్రెజిల్ జోరు...కొరియా బేజారు..

దోహాలోని స్టేడియం 974 వేదికగా జరిగిన 6వ ప్రీ-క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ టాప్ ర్యాంకర్ బ్రెజిల్ 4-1 గోల్స్ తో దక్షిణ కొరియాను చిత్తు చేసింది. గ్రూప్ లీగ్ ఆఖరిరౌండ్లో కమెరూన్ చేతిలో కంగుతిన్న బ్రెజిల్...నాకౌట్ పోరులో మాత్రం పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగింది.

గాయాల నుంచి కోలుకొన్న నైమర్ లాంటి పలువురు కీలక ఆటగాళ్లు వచ్చి తుదిజట్టులో చేరారు. కొరియాతో పోరు తొలి నిముషం నుంచే సాంబాటీమ్ టాప్ గేర్ లో ఆడింది.

కళాత్మక పాసింగ్ గేమ్ కు చక్కటి సమన్వయాన్ని జోడించి మరీ బ్రెజిల్ జట్టు మెరుపుదాడులు చేసింది. బంతిని అధికభాగం తన అదుపులోనే ఉంచుకొంటూ ప్రత్యర్థిపై పైచేయి సాధించింది.

ఆట మొదటి భాగానికే బ్రెజిల్ జట్టు 3-0తో పైచేయి సాధించడం చూస్తే..ఆధిపత్యం ఏస్థాయిలో చెలాయించిందీ మరి చెప్పాల్సిన పనిలేదు.

బ్రెజిల్ తరపున వినీషియస్ జూనియర్ ఆట మొదటి భాగం 7వ నిముషంలోనే తొలిగోలుతో బోణీ కొట్టాడు.

పీలే సరసన నైమార్...

ఆ తర్వాత లభించిన పెనాల్టీని స్టార్ స్ట్ర్రయికర్ నైమర్ గోల్ గా మలచడం ద్వారా ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. బ్రెజిల్ తరపున నైమర్ కు ఇది 76వ గోల్ కావడం విశేషం. అంతేకాదు...బ్రెజిల్ తరపున అత్యధిక గోల్స్ సాధించిన దిగ్గజ ఆటగాడు పీలే ( 76) రికార్డును నైమర్ సమం చేయగలిగాడు. బ్రెజిల్ తరపున నైమర్ సాధించిన గత ఆరు గోల్స్ స్పాట్ కిక్ ల ద్వారా సాధించినవే కావడం మరో విశేషం.

ఆట మొదటి భాగం ముగియటానికి ముందు రిచార్లీసన్ సాధించిన సూపర్ గోల్ తో బ్రెజిల్ స్కోరు 3-0కు చేరింది.

బ్రెజిల్ నాలుగో గోల్ ను లూకాస్ పిక్వే సాధించాడు. దీంతో ఆట మొదటి భాగం ముగిసే సమయానికే బ్రెజిల్ 4-0తో కళ్లు చెదిరే ఆధిక్యం సంపాదించగలిగింది. 1998 ప్రపంచకప్ తర్వాత..ఓ నాకౌట్ మ్యాచ్ లో బ్రెజిల్ నాలుగు గోల్స్ స్కోరు సాధించడం ఇదే మొదటిసారి.

ఆట ఆఖరి భాగంలో కొరియా సబ్ స్టిట్యూట్ ఆటగాడు పైక్ ..సూపర్ హెడ్డర్ ద్వారా గోల్ సాధించి బ్రెజిల్ ఆధిక్యాన్ని 4-1కి తగ్గించగలిగాడు. ఈ విజయాన్ని తమ దేశంలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న దిగ్గజ ఆటగాడు 82 సంవత్సరాల పీలేకి అంకితమిస్తున్నట్లు బ్రెజిల్ జట్టు ప్రకటించింది.

సెమీఫైనల్లో చోటు కోసం జరిగే క్వార్టర్ ఫైనల్లో గత చాంపియన్షిప్ రన్నరప్ క్రొయేషియాతో బ్రెజిల్ తలపడనుంది.

షూటౌట్ లో జపాన్ అవుట్...

గ్రూపులీగ్ దశలో సంచలన విజయాలతో టాపర్ గా నిలిచిన ఆసియా నంబర్ వన్ టీమ్ జపాన్ పోటీ ప్రీ-క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. 2018 ప్రపంచకప్ రన్నరప్ క్రొయేషియాతో హోరాహోరీగా జరిగిన ప్రీ- క్వార్టర్స్ పోరులో జపాన్ తుదివరకూ పోరాడి ఓడింది.

ఆట నిర్ణితసమయంలో రెండుజట్లూ చెరో గోల్ తో సమఉజ్జీలుగా నిలిచాయి. దీంతో విజేతను నిర్ణయించడానికి పెనాల్టీ షూటౌట్ పాటించారు. షూటౌట్ లో క్రొయేషియా 3-1 గోల్స్ తో విజేతగా నిలవడం ద్వారా వరుసగా రెండోసారి ప్రపంచకప్ క్వార్టర్స్ కు చేరుకోగలిగింది.

ఆట ప్రారంభంలోనే జపాన్ కు డైజెన్ మైడా గోల్ అందించాడు. అయితే రెండో భాగం 55వ నిముషంలో ఇవాన్ పెర్సిచ్ గోల్ తో క్రొయేషియా స్కోరును 1-1తో సమం చేయగలిగింది.

ఆ తర్వాత రెండుజట్లూ మ్యాచ్ విన్నింగ్ గోల్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోడంతో..పెనాల్టీ షూటౌట్ పాటించారు. షూటౌట్ లో క్రొయేషియా గోల్ కీపర్ డోమనిక్ లివకోవిచ్..జపాన్ పెనాల్టీలను అడ్డుకొని తనజట్టుకు క్వార్టర్స్ బెర్త్ ఖాయం చేయగలిగాడు. క్రొయేషియా కంటే జపాన్ మెరుగైనజట్టుగా కనిపించినా..విజయం మాత్రం క్రొయేషియానే వరించింది.

ఇప్పటికే ఫ్రాన్స్, ఇంగ్లండ్, అర్జెంటీనా, నెదర్లాండ్స్, బ్రెజిల్, క్రొయేషియా జట్లు క్వార్టర్స్ కు చేరుకోగా..ఆఖరి ప్రీ- క్వార్టర్ ఫైనల్స్ రెండురౌండ్లలో పోర్చుగల్ తో స్విట్జర్లాండ్, స్పెయిన్ తో ట్యునీసియాజట్లు తలపడాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News