వన్డే ప్రపంచకప్ లో మరో సంచలనం!
ఐసీసీ వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో మరో సంచలనం నమోదయ్యింది. ప్రపంచ 3వ ర్యాంకర్ దక్షిణాఫ్రికాకు పసికూన నెదర్లాండ్స్ షాకిచ్చింది.
ఐసీసీ వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో మరో సంచలనం నమోదయ్యింది. ప్రపంచ 3వ ర్యాంకర్ దక్షిణాఫ్రికాకు పసికూన నెదర్లాండ్స్ షాకిచ్చింది...
2023-ఐసీసీ వన్డే ప్రపంచకప్ రెండోవారం పోటీలలో సంచలనాల పర్వం ప్రారంభమయ్యింది. ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్ ను అప్ఘనిస్థాన్ కంగు తినిపించిన 24 గంటల వ్యవధిలోనే మరో అనూహ్య ఫలితం నమోదయ్యింది.
ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన రౌండ్ రాబిన్ లీగ్ పోరులో నెదర్లాండ్స్ 38 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై అతిపెద్ద విజయం సాధించింది.
సఫారీలజోరుకు డచ్ బ్రేక్....
ప్రస్తుత ప్రపంచకప్ లో వరుస విజయాలతో దూకుడుమీదున్న 3వ ర్యాంకర్ దక్షిణాఫ్రికాకు 10 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ 4వ రౌండ్లోనే ఎదురుదెబ్బ తగిలింది. పసికూన నెదర్లాండ్స్ చేతిలో అనుకోని ఓటమి చవిచూసింది.
వర్షం దెబ్బతో 43 ఓవర్ల మ్యాచ్ గా సాగిన ఈ పోరులో ముందుగా బ్యాటింగ్ కు దిగిన నెదర్లాండ్స్ 8 వికెట్లకు 245 పరుగుల స్కోరు సాధించింది. ప్రత్యర్థి ఎదుట 246 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది.
స్కాట్ ఎడ్వర్డ్స్ కెప్టెన్ ఇన్నింగ్స్.....
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన నెదర్లాండ్స్ ఒకదశలో 140 పరుగులకే 7 టాపార్డర్ వికెట్లు నష్టపోయి ఎదురీత మొదలు పెట్టింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 69 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్సర్ తో 78 పరుగులు సాధించడం ద్వారా మ్యాచ్ ను మలుపు తిప్పాడు. చివరకు డచ్ జట్టు కోలుకొని 8 వికెట్ల నష్టానికి 245 పరుగుల స్కోరు సాధించగలిగింది.
లోయర్ ఆర్డర్ బ్యాటర్లు వాన్ బీక్ 10, వాండెర్ మెర్వీ 29, ఆర్యన్ దత్ 23 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడం ద్వారా తమవంతు పాత్ర నిర్వర్తించారు. దక్షిణాఫ్రికాజట్టు 31 ఎక్స్ ట్రాలు ఇచ్చి చేజేతులా ఓటమి కొనితెచ్చుకొంది.
దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, జాన్సన్, రబడ తలో 2 వికెట్లు, కోట్జే, మహారాజా చెరో వికెట్ పడగొట్టారు.
చేజింగ్ లో తడబడిన దక్షిణాఫ్రికా...
అనూహ్యమైన బౌన్స్ తో స్పిన్ బౌలింగ్ కు అనుకూలంగా ఉన్న పిచ్ పైన 246 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా 42.5 ఓవర్లలో 207 పరుగులకే కుప్పకూలింది.
చేజింగ్ ఒత్తిడికి తట్టుకోలేక సఫారీజట్టు వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. స్టార్ బ్యాటర్లు డీ కాక్ 20, కెప్టెన్ బవుమ 16, డ్యూసెన్ 4, మర్కరమ్ 1, క్లాసెన్ 28 పరుగులకు అవుట్ కాగా..డేవిడ్ మిల్లర్ 43, కేశవ్ మహారాజ్ 40 పరుగుల స్కోర్లతో పోరాడిన ప్రయోజనం లేకుండా పోయింది.
డచ్ బౌలర్లలో వాన్ బీకీ 3 వికెట్లు, మీకెరన్ , మెర్వీ, లీడీ తలో 2 వికెట్లు పడగొట్టారు.
నెదర్లాండ్స్ సంచలన విజయంలో ప్రధానపాత్ర వహించిన కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఇదే అతిపెద్ద గెలుపు....
1996 ప్రపంచకప్ ద్వారా అరంగేట్రం చేసిన నెదర్లాండ్స్ కు..టెస్ట్ హోదా పొందిన ఓ అగ్రశ్రేణి జట్టుపై ఇదే తొలివిజయం. 2011 ప్రపంచకప్ తర్వాత తొలిసారిగా అర్హత సంపాదించిన డచ్ జట్టుకు ఐసీసీ అనుబంధ దేశాలకు చెందిన నమీబియా, స్కాట్లాండ్ జట్లపైన మాత్రమే గతంలో విజయాలున్నాయి.
11 మాసాల క్రితం ముగిసిన టీ-20 ప్రపంచకప్ లో దక్షిణాఫ్రికాను కంగుతినిపించిన నెదర్లాండ్స్ ఇప్పుడు వన్డే ప్రపంచకప్ లో సైతం ఓడించగలగడం విశేషం.
ఫుట్ బాల్ కు అత్యంత జనాదరణ కలిగిన నెదర్లాండ్స్ లో క్రికెట్ ఇప్పుడిప్పుడే అభిమానులకు చేరువకాగలుగుతోంది.
ఎక్కువమంది పార్ట్ టైమ్ ఆటగాళ్లతో కూడిన నెదర్లాండ్స్ జట్టులో స్పిన్ జోడీ కోలిన్ అకెర్ మాన్, రోల్ఫ్ వాన్ డెర్ మెర్వీలతో పాటు పేసర్ పాల్ వాన్ మీక్రెన్ బౌలింగ్ విభాగంలో ప్రధానపాత్ర పోషించారు.
దక్షిణాఫ్రికాజట్టు ఆడిన గత ఐదు వన్డేలలో 338, 416, 315, 428, 311 స్కోర్లతో అలవోక విజయాలు సాధించినా ఆరోమ్యాచ్ లో మాత్రం 207 పరుగులకే చతికిలబడి పోయింది.