ఆల్- ఇన్- వన్ రవిచంద్రన్ అశ్విన్!
భారత స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ లో సరికొత్త చరిత్ర సృష్టించాడు.
భారత స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. వేరెవ్వరికీ సాధ్యంకాని రికార్డును తనపేరుతో లిఖించుకొన్నాడు...
భారత ఎవర్ గ్రీన్ స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కు క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ రికార్డులు నెలకొల్పడం ఏమాత్రం కొత్తకాదు. సాంప్రదాయ టెస్టు క్రికెట్, ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్, 50 ఓవర్ల వన్డే క్రికెట్ ..ఇలా..ఫార్మాట్ ఏదైనా జాదూ స్పిన్నర్ గా, నిర్ణయాత్మక బ్యాటర్ గా ప్రభావం చూపడంలో తనకు తాను మాత్రమే సాటి.
1 నుంచి 10 వరకూ......
ఐపీఎల్ గత 15 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ పంజాబ్ జట్లకు ప్రాతినిథ్యం వహించిన అశ్విన్ ను 2022 సీజన్ వేలంలో జైపూర్ ఫ్రాంచైజీ 5 కోట్ల రూపాయల ధరకు సొంతం చేసుకొంది.
ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక ఆల్ రౌండర్ గా ఉన్న 36 సంవత్సరాల అశ్విన్ ప్రస్తుత 16 వసీజన్ లీగ్ లో ఓ చిత్రమైన, అరుదైన రికార్డు సాధించాడు. బ్యాటింగ్ ఆర్డర్లోని 1 నుంచి 10 స్థానాల వరకూ బ్యాటింగ్ చేసిన తొలి, ఏకైక క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు.
ఐపీఎల్ -16వ సీజన్ రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా పంజాబ్ కింగ్స్ తో గౌహతీలోని అసోం క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో..రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓపెనర్ గా బ్యాటింగ్ కు దిగడం ద్వారా అరుదైన రికార్డు నెలకొల్పాడు.
ఓపెనర్ గా దిగిన అశ్విన్ డకౌట్ గా వెనుదిరిగినా అన్నిస్థానాలలోనూ బ్యాటర్ గా క్రీజులో అడుగుపెట్టిన అసాధారణ రికార్డును సొంతం చేసుకోగలిగాడు.
అశ్విన్ తన ఐపీఎల్ కెరియర్ లో ఒకసారి ఓపెనర్ గా, నాలుగుసార్లు వన్ డౌన్ బ్యాటర్ గా, ఒకసారి రెండోడౌన్ లోనూ, రెండుసార్లు 5వ నంబర్ స్థానంలోనూ, ఆరుసార్లు 6వ డౌన్, 16సార్లు 7వ డౌన్, 32 సార్లు 8వ డౌన్, 11సార్లు 9వ డౌన్ , 10సార్లు 10వ డౌన్ లోనూ బ్యాటింగ్ కు దిగిన ఘనత అశ్విన్ కు ఉంది.
76 ఇన్నింగ్స్ లో 648 పరుగులు...
ప్రస్తుత సీజన్ రెండోరౌండ్ మ్యాచ్ వరకూ తన ఐపీఎల్ కెరియర్ లో బ్యాటర్ గా 76 ఇన్నింగ్స్ ఆడిన అశ్విన్ 648 పరుగులు సాధించాడు. 50 పరుగులు అత్యధిక వ్యక్తిగత స్కోరు కాగా..51 బౌండ్రీలు, 21 సిక్సర్లు సాధించాడు.
అంతేకాదు..ఐపీఎల్ చరిత్రలోనే వ్యూహాత్మక రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగిన బ్యాటర్ రికార్డు సైతం అశ్విన్ పేరుతోనే ఉంది. 2022 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన పోరులో 6వ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన అశ్విన్ 23 బంతులు ఎదుర్కొని 28 పరుగులు చేసిన అనంతరం వ్యూహాత్మక రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు.
టీ-20 చరిత్రలో వ్యూహాత్మక రిటైర్డ్ హర్ట్ గా పెవీలియన్ చేరిన నాలుగో బ్యాటర్ గా నిలిచాడు.
అశ్విన్ కు ముందే..వ్యూహాత్మక రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగి మిగిలిన ముగ్గురు బ్యాటర్లలో షాహీద్ అఫ్రిదీ, సోనమ్ టోబాగ్య, సుంజాముల్ ఇస్లాం ఉన్నారు.
భజ్జీ తర్వాతి స్థానంలో అశ్విన్..
2022 సీజన్ ఐపీఎల్ లో అశ్విన్ 150 వికెట్ల మైలురాయిని చేరుకోడం ద్వారా ఐపీఎల్ చరిత్రలో వందకు పైగా వికెట్లు పడగొట్టిన రెండో ఆఫ్ స్పిన్నర్ గా రికార్డుల్లో చేరాడు.
హర్భజన్ సింగ్ తర్వాత ఈ ఘనత సాధించిన ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ మాత్రమే.
ఐపీఎల్ లో 2023 సీజన్ రెండోరౌండ్ వరకూ 186 మ్యాచ్ లు ఆడిన అశ్విన్ 159 వికెట్లు సాధించాడు. 34 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టడం ద్వారా అత్యుత్తమ గణాంకాలు నమోదు చేయగలిగాడు.
గత సీజన్లో రాజస్థాన్ రాయల్స్ రన్నరప్ గా నిలవడంలో స్పిన్ ఆల్ రౌండర్ గా అశ్విన్ తనవంతు పాత్ర నిర్వర్తించాడు.
మొత్తం మీద మరే బ్యాటర్ కు సాధ్యంకాని రికార్డును అశ్విన్ సాధించగలిగాడు.