అక్షర్ కు గాయం..అశ్విన్ కు వరం!

2023-ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టులో స్పిన్ జాదూ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఆఖరి నిముషంలో చోటు సంపాదించాడు.

Advertisement
Update:2023-09-29 13:00 IST

2023-ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టులో స్పిన్ జాదూ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఆఖరి నిముషంలో చోటు సంపాదించాడు. తన కెరియర్ ఆఖరి అంకంలో ఉన్న అశ్విన్ మూడోసారి ప్రపంచకప్ లో పాల్గొనబోతున్నాడు....

భారత్ వేదికగా నాలుగోసారి జరుగబోతున్న 2023-ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టులో సీనియర్ స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ చోటు సంపాదించి సంచలనం సృష్టించాడు. లెఫ్టామ్ స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ గాయం అశ్విన్ పాలిట వరంగా మారింది.

మూడోసారి వన్డే ప్రపంచకప్ జట్టులో.....

గత 20 మాసాలుగా భారత వన్డే జట్టుకు దూరమైన 36 సంవత్సరాల స్పిన్ జాదూ రవిచంద్రన్ అశ్విన్ కు మ్యాజిక్ చేయడం ఏమాత్రం కొత్తకాదు. ఫీల్డ్ లోకి దిగాడంటే చాలు ..క్యారమ్ బాల్, రివర్స్ క్యారమ్ బాల్, ఆఫ్ బ్రేక్, ఫ్లోటర్ లాంటి విలక్షణ బంతులతో బ్యాటర్లను బోల్తా కొట్టించడంలో మొనగాడుగా పేరుపొందిన అశ్విన్ కు 2011, 2015 వన్డే ప్రపంచకప్ టోర్నీలలో పాల్గొన్న అనుభవం, రికార్డు ఉన్నాయి. అయితే..2017లో విరాట్ కొహ్లీ భారతజట్టు పగ్గాలు చేపట్టిన నాటినుంచి అశ్విన్ ను కేవలం టెస్టు సిరీస్ లకే పరిమితం చేసి..వైట్ బాల్ క్రికెట్ కు దూరంగా ఉంచుతూ వచ్చాడు. అప్పటి నుంచి అశ్విన్ 50 ఓవర్ల వన్డే ఫార్మాట్ కు దూరమైపోయాడు. భారత్ తరపున తన చివరి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ను 20 నెలల క్రితమే ఆడిన అశ్విన్..ఇటీవలే ఆస్ట్ర్రేలియాతో ముగిసిన తీన్మార్ సిరీస్ ద్వారా తిరిగి భారతజట్టులో చేరాడు.

2 మ్యాచ్ ల్లో అశ్విన్ మ్యాజిక్....

ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ ఆస్ట్ర్రేలియాతో మొహాలీ, ఇండోర్ వేదికలుగా జరిగిన మొదటి రెండు వన్డేలలో అశ్విన్ 4 వికెట్లు పడగొట్టడం ద్వారా భారత విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. బౌలర్లకు ఏమాత్రం సహకరించని పిచ్ లపైన 18 ఓవర్లు బౌల్ చేసి 88 పరుగులివ్వడంతో పాటు 4 వికెట్లు పడగొట్టడం ద్వారా సత్తా చాటుకొన్నాడు. 37 సంవత్సరాల లేటు వయసులో తిరిగి భారత సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఆఖరి నిముషంలో భారతజట్టులో చోటు సంపాదించగలిగాడు. పాపం! అక్షర్ పటేల్....

గత రెండేళ్లుగా భారతజట్టుకు క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ విలక్షణ సేవలు అందిస్తూ నిలకడగా రాణిస్తూ వచ్చిన అక్షర్ పటేల్ కు ప్రపంచకప్ కోసం ముందుగా ప్రకటించిన 15మంది సభ్యులజట్టులో చోటు కల్పించారు.

అయితే..శ్రీలంక వేదికగా జరిగిన ఆసియాకప్ టోర్నీలో ఆడుతున్న సమయంలో అక్షర్ పటేల్ తొడకండరానికి గాయమయ్యింది. ఎడమచేతి వాటం స్పిన్ ఆల్ రౌండర్ గా పేరున్న అక్షర్ ను గాయం రూపంలో దురదృష్టం వెంటాడింది.

అక్షర్ పటేల్ సకాలంలో కోలుకొని పూర్తిస్థాయి ఫిట్ నెస్ ను సాధించలేకపోడంతో..తమిళనాడు ఆఫ్ స్పిన్నర్ల జోడీ అశ్విన్, వాషింగ్టన్ సుందర్ లకు టీమ్ మేనేజ్ మెంట్..

ఆస్ట్ర్రేలియాతో సిరీస్ ద్వారా అవకాశాలు కల్పించింది. అందివచ్చిన అవకాశాన్ని సీనియర్ స్పిన్నర్ అశ్విన్ పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని..అక్షర్ కు బదులుగా 15 మంది సభ్యుల జట్టులో తిరిగి చోటు సంపాదించగలిగాడు.

115 వన్డేలు- 155 వికెట్లు....

క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ భారతజట్టుకు అసమాన సేవలు అందిస్తూ వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ కు రెండు ప్రపంచకప్ టోర్నీలలో పాల్గొన్న అపారఅనుభవంతో పాటు..

ప్రస్తుత ఆస్ట్ర్రేలియా సిరీస్ లోని మొదటి రెండువన్డేల వరకూ భారత్ తరపున ఆడిన 115 వన్డేలలో 155 వికెట్లు పడగొట్టిన రికార్డు సైతం ఉంది. 33.2 సగటుతో 4.94 స్ట్ర్రయిక్ రేట్ సైతం ఉంది.

ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా అక్టోబర్ 8న చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్ర్రేలియాతో జరిగే ప్రారంభమ్యాచ్ ద్వారా అశ్విన్ మరోసారి తన మ్యాజిక్ ను మొదలు పెట్టనున్నాడు.

అశ్విన్ చేరికతో ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టులోని స్పిన్ ఆల్ రౌండర్ల సంఖ్య రెండుకు చేరింది. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టులో స్పెషలిస్ట్ బ్యాటర్లుగా శుభ్ మన్ గిల్, విరాట్ కొహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, వికెట్ కీపర్ బ్యాటర్లుగా కెఎల్ రాహుల్, సీమ్ ఆల్ రౌండర్లుగా హార్థిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్, స్పిన్ ఆల్ రౌండర్లుగా రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్, స్పెషలిస్ట్ సీమర్లుగా జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ఉన్నారు.

అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకూ భారత్ లోని 10 వేదికల్లో జరిగే వన్డే ప్రపంచకప్ లో 10 అగ్రశ్రేణిజట్లు తలపడబోతున్నాయి. తొలిదశ రౌండ్ రాబిన్ లీగ్ లో..తొమ్మిది ప్రత్యర్థి (ఆస్ట్ర్రేలియా, పాకిస్థాన్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్థాన్) జట్లతో భారత్ తలపడనుంది.

1983, 2011 వన్డే ప్రపంచకప్ టోర్నీలలో విజేతగా నిలిచిన భారత్ మరో ప్రపంచ టైటిల్ కోసం గత పుష్కరకాలంగా ఎదురుచూస్తోంది.

Tags:    
Advertisement

Similar News