ఏడేళ్ల తర్వాత...నేటినుంచే జాతీయక్రీడలు!

జాతీయ క్రీడలకు ఏడేళ్ల క్రితం పట్టిన గ్రహణం ఎట్టకేలకు వీడింది. 36వ జాతీయక్రీడలు నేటినుంచే రెండువారాలపాటు గుజరాత్ వేదికగా జరుగనున్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన మొత్తం 8వేల మంది క్రీడాకారులు 36 రకాల క్రీడాంశాలలో తలపడబోతున్నారు.

Advertisement
Update:2022-09-27 09:03 IST

జాతీయ క్రీడలకు ఏడేళ్ల క్రితం పట్టిన గ్రహణం ఎట్టకేలకు వీడింది. 36వ జాతీయక్రీడలు నేటినుంచే రెండువారాలపాటు గుజరాత్ వేదికగా జరుగనున్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన మొత్తం 8వేల మంది క్రీడాకారులు 36 రకాల క్రీడాంశాలలో తలపడబోతున్నారు.

జాతీయ క్రీడాభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 36వ జాతీయ క్రీడోత్సవాలకు ఎట్టకేలకు గుజరాత్ వేదికగా ఈరోజు ప్రారంభంకానున్నాయి. ఏడేళ్ల క్రితం జరగాల్సిన ఈ క్రీడలు కరోనా మహమ్మారితో సహా పలు రకాల కారణాలతో వాయిదా పడుతూ వచ్చాయి. అయితే గుజరాత్ ప్రభుత్వం, భారత ఒలింపిక్ సంఘం చొరవ, పూనికతో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ప్రధానవేదికగా ప్రారంభమయ్యాయి.

ఆరు నగరాలలో,36 క్రీడాంశాలలో...

సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 10 వరకూ..రెండువారాలపాటు జరిగే ఈ క్రీడాసంరంభంలో 28 రాష్ట్ర్రాలు, సర్వీసెస్ లాంటి వ్యవస్థలకు చెందిన 8వేలమంది క్రీడాకారులు తలపడబోతున్నారు.

అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, వడోదర, రాజ్ కోట్, భావ్ నగర్ వేదికలుగా మొత్తం 36 రకాల క్రీడాంశాలలో పోటీలు నిర్వహిస్తున్నారు. సైక్లింగ్ ట్రాక్ పోటీలను మాత్రమే ఢిల్లీలోని వెలోడ్రోమ్ లో నిర్వహించనున్నారు.

2015లో చివరిసారిగా కేరళ వేదికగా 35వ జాతీయక్రీడలు ముగిసిన ఏడు సంవత్సరాల విరామం తర్వాత జరుగుతున్నఈ పోటీలలో భాగంగా విలువిద్య, ఖో-ఖో, మల్కంబ్, రగ్బీ సెవెన్స్, పురుషుల ఫుట్ బాల్, మహిళల ఫుట్ బాల్, కబడ్డీ, యోగాసన, రోయింగ్, కనోయింగ్, స్కేట్ బోర్డింగ్, ఆర్టిస్టిక్ స్కేటింగ్, ఇన్ లైన్ స్కేటింగ్, స్పీడ్ స్కేటింగ్,టెన్నిస్, సాఫ్ట్ టెన్నిస్, లాన్ బౌల్స్, గోల్ఫ్, షూటింగ్ (షాట్ గన్ ), సైక్లింగ్( రోడ్), వెయిట్ లిఫ్టింగ్, జూడో, ఫెన్సింగ్, ఉషు, బాక్సింగ్, కుస్తీ, ట్రయాథ్లాన్, స్క్వాష్, టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్, బీచ్ హ్యాండ్ బాల్, బీచ్ వాలీబాల్, బ్యాడ్మింటన్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్ బాల్, అక్వాటిక్స్, హాకీ, నెట్ బాల్, బాస్కెట్ బాల్, వాలీబాల్, ట్రాక్ సైక్లింగ్ క్రీడలు నిర్వహిస్తున్నారు.


ఆతిథ్య రాష్ట్రాలదే అగ్రస్థానం...

1924 నుంచి ఇండియన్ ఒలింపిక్స్, 1940 నుంచి నేషనల్ గేమ్స్ పేరుతో జరుగుతున్న ఈ క్రీడాసంరంభంలో ఆతిథ్య ప్రాంతం లేదా రాష్ట్ర్రాలజట్లే పతకాల పట్టిక మొదటి ఐదు స్థానాలలో చోటు దక్కించుకొంటూ వస్తున్నాయి.

1987 జాతీయ క్రీడలకు ఆతిథ్యమిచ్చిన కేరళజట్టే ఓవరాల్ చాంపియన్ గా నిలవడం విశేషం. 1997 క్రీడలు నిర్వహించిన కర్నాటక అత్యధిక పతకాలు గెలుచుకొంది.

1997 క్రీడల పతకాల పట్టిక 9వ స్థానంలో నిలిచిన మణిపూర్..1999 క్రీడలకు ఆతిథ్యమిచ్చిన సమయంలో ఏకంగా ఓవరాల్ చాంపియన్ గా నిలిచింది.

2001 క్రీడలకు వేదికగా నిలిచిన పంజాబ్, 2002 జాతీయ క్రీడలకు ఆతిథ్యమిచ్చిన ఆంధ్రప్రదేశ్ ఓవరాల్ చాంపియన్ ట్రోఫీలు అందుకొన్నాయి.

2001 జాతీయక్రీడల పతకాల పట్టికలో ఒకే ఒక్క స్వర్ణం సాధించిన అసోం 2007 జాతీయ క్రీడల్లో అత్యధిక పతకాలు సంపాదించగలిగింది.

ఆతిథ్య రాష్ట్ర్రాలకు తమకు నచ్చిన అత్యధిక క్రీడాంశాలు నిర్వహించుకొనే వెసలుబాటుతో పాటు..అత్యధికమంది క్రీడాకారులను బరిలో నిలిపే అవకాశం ఉండటమే దీనికి కారణంగా కనిపిస్తోంది.

తెలుగు రాష్ట్రాలు దొందూ దొందే!

2002 జాతీయక్రీడలు నిర్వహించిన సమయంలో ఆతిథ్య ఆంధ్రప్రదేశ్ రికార్డుస్థాయిలో 94 బంగారు పతకాలతో ఓవరాల్ చాంపియన్ గా నిలిచింది. అయితే..కేరళ వేదికగా ముగిసిన 2015 జాతీయ క్రీడల పతకాల పట్టికలో ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలోనూ, తెలంగాణా 33 పతకాలతో 12వ స్థానంలోనూ నిలవడం విశేషం.

జనాభా, వైశాల్యం పరంగా చిన్నరాష్ట్ర్రాలైన కేరళ, హర్యానా, మణిపూర్, పంజాబ్, ఢిల్లీ అత్యధిక పతకాలతో సత్తాచాటుకొంటూ ఉంటే ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ లాంటి పెద్దరాష్ట్ర్రాలు వెలవెలాబోతున్నాయి.

ప్రస్తుత 2022 జాతీయ క్రీడల్లో తెలంగాణా 302 మంది సభ్యుల భారీబృందంతో 26 క్రీడాంశాలలో పోటీకి దిగుతోంది. మొత్తం 230 అథ్లెట్లలో 104 మంది పురుషులు, 126 మంది మహిళలు ఉన్నారు. 72 మంది శిక్షకులు బృందం వెంట ఉంటారు. తెలంగాణా అథ్లెట్ల శిక్షణ, సన్నాహాల కోసం 61 లక్షల రూపాయలు వ్యయం చేశారు.

టెన్నిస్ , స్విమ్మింగ్, రైఫిల్ షూటింగ్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, రోయింగ్, ట్రాక్ అండ్ ఫీల్డ్, బాక్సింగ్ అంశాలలో తెలంగాణా అథ్లెట్లు అత్యధిక పతకాలు సాధించే అవకాశం ఉంది.

170 మంది అథ్లెట్లతో ఆంధ్రప్రదేశ్...

2015 జాతీయ క్రీడల్లో మొత్తం 16 పతకాలతో పతకాల పట్టిక 18వ స్థానంలో నిలిచిన ఆంధప్రదేశ్ ప్రస్తుత క్రీడల్లో 170మంది అథ్లెట్ల బృందంతో 36 క్రీడాంశాలలో తన అదృష్టం పరీక్షించుకొంటోంది. అథ్లెట్ల శిక్షణ, సన్నాహాల కోసం 23 లక్షల 91 వేల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. బ్యాడ్మింటన్, వెయిట్ లిఫ్టింగ్, కబడ్డీ, ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాలలో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్లు రాణించే అవకాశం ఉంది.

పోటీలకు ఆతిథ్యమిస్తున్న మొత్తం 36 క్రీడాంశాలలోనూ భారీబృందంతో పోటీకి దిగుతున్న కారణంగా అత్యధిక పతకాలతో ..పతకాల పట్టిక మొదటి ఐదుస్థానాలలో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    
Advertisement

Similar News