ప్రపంచకప్ లో సెంచరీల తుపాను!

2023-ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో సెంచరీల తుపాను మొదలయ్యింది. మొదటి వారం రోజుల మ్యాచ్ ల్లోనే రికార్డు స్థాయిలో శతకాలు నమోదయ్యాయి..

Advertisement
Update:2023-10-13 07:45 IST

ప్రపంచకప్ లో సెంచరీల తుపాను!

2023-ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో సెంచరీల తుపాను మొదలయ్యింది. మొదటి వారం రోజుల మ్యాచ్ ల్లోనే రికార్డు స్థాయిలో శతకాలు నమోదయ్యాయి..

భారత్ వేదికగా నాలుగోసారి జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీపరుగులహోరు, సెంచరీల హోరుతో సాగిపోతోంది. 10 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ మొదటి వారం రోజుల పోటీల్లోనే సెంచరీలు వెల్లువెత్తాయి.

10 మ్యాచ్ ల్లో 12 శతకాలు!

అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్- న్యూజిలాండ్ జట్ల నడుమ జరిగిన టోర్నీ ప్రారంభ మ్యాచ్ నుంచి లక్నో లోని అటల్ బిహారీ వాజ్ పేయి స్టేడియం వేదికగా ఆస్ట్ర్రేలియా- దక్షిణాఫ్రికాజట్ల మధ్య ముగిసిన 10వ మ్యాచ్ వరకూ 12 సెంచరీలు నమోదు కావడం ప్రపంచకప్ చరిత్రలోనే సరికొత్త రికార్డుగా మిగిలిపోతుంది. 7 జట్లకు చెందిన 11 మంది ఆటగాళ్ళు మూడంకెల స్కోర్లు సాధించడం విశేషం.

దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డి కాక్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో టాపర్ గా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్లో 17 శతకాలు సాధించిన తరువాత కానీ డి కాక్..ప్రపంచకప్ లో తన తొలిశతకం నమోదు చేయలేకపోయాడు.

దక్షిణాఫ్రికా టాప్ గేర్...

ప్రస్తుత ప్రపంచకప్ మొదటి వారం రోజుల్లో మూడుమ్యాచ్ లు ఆడిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఏకంగా నాలుగు సెంచరీలు నమోదు చేశారు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ఓపెనర్లు క్వింటన్ డి కాక్, రాసే వాన్ డెర్ డ్యూసెన్, ఎడెన్ మర్కరం శతకాలు బాది సంచలనం సృష్టించారు.

డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన టోర్నీ ప్రారంభమ్యాచ్ లో న్యూజిలాండ్ ఓపెనర్ డేవన్ కాన్వే, వన్ డౌన్ రచన్ రవీంద్ర శతకాలు బాదారు.

గత 13 ప్రపంచకప్ టోర్నీలలో....

ప్రస్తుత ప్రపంచకప్ లో 5వవంతు మ్యాచ్ లు మాత్రమే ముగిసే సమయానికే 12 శతకాలు నమోదయ్యాయి. గత 13 ప్రపంచకప్ టోర్నీల చరిత్రలో ఇదే అత్యుత్తమ రికార్డు. 1975 ప్రారంభ ప్రపంచకప్ లో ( 6), 1979 ప్రపంచకప్ లో (2 ), 1983లో (8), 1987 ప్రపంచకప్ లో ( 11), 1992లో ( 6), 199 ప్రపంచకప్ లో ( 11) సెంచరీల రికార్డు మాత్రమే ఉంది.

పరుగుల గనులు గా ఢిల్లీ, హైదరాబాద్!

ప్రస్తుత ప్రపంచకప్ కు దేశంలోని 10 వేర్వేర్వు నగరాలు ఆతిథ్యమిస్తుంటే..మొదటి 10రోజుల పోటీలలో మాత్రం న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం, హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం మాత్రమే బ్యాటర్ల పాలిట స్వర్గంగా నిలిచాయి. భారీస్కోర్లకు, శతకాలకు చిరునామాగా మిగిలాయి.

న్యూఢిల్లీలో శ్రీలంకపైన దక్షిణాఫ్రికా బ్యాటర్లు 3 శతకాలు సాధిస్తే..హైదరాబాద్ వేదికగా శ్రీలంక- పాక్ జట్ల నడుమ జరిగిన మ్యాచ్ లో ఏకంగా 750 కి పైగా పరుగులు, నాలుగు సెంచరీలు నమోదయ్యాయి.

పాకిస్థాన్ బ్యాటర్లు అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్ శ్రీలంకపై మెరుపు శతకాలు బాదడంతో ప్రపంచకప్ చరిత్రలోనే రికార్డు చేజింగ్ విజయం సాధించగలిగింది.

100 బంతుల లోపే 11 శతకాలు..

వన్డే ప్రపంచకప్ లో శతకాలు బాదటానికి ఎక్కువ బంతులు ఎదుర్కొనాల్సిన అవసరం లేదని బ్యాటర్లు, ప్రధానంగా ఓపెనర్లు చెప్పకనే చెబుతున్నారు. మొదటి 10 రోజుల మ్యాచ్ ల్లో నమోదైన 12 శతకాలలో 11 శతకాలు 100 బంతుల లోపే నమోదు కావడం ఓ రికార్డు.

సఫారీ మిడిలార్డర్ బ్యాటర్ ఎడెన్ మర్కరం కేవలం 49 బంతుల్లోనే రికార్డు శతకంతో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ 63 బంతుల్లోనూ, శ్రీలంక బ్యాటర్ కుశల్ మెండిస్ 65 బంతుల్లోనే మెరుపు శతకాలు సాధించారు.

న్యూజిలాండ్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర 82 బంతుల్లోనూ, ఓపెనర్ డేవన్ కాన్వే 83 బంతుల్లోను మూడంకెల స్కోర్లు నమోదు చేశారు.

2023 ప్రపంచకప్ మొదటి వారం రోజులు..10 మ్యాచ్ ల్లోనే 12 శతకాలు సాధిస్తే..రానున్న వారం రోజుల మ్యాచ్ ల్లో మరెన్ని శతకాలు వచ్చి చేరుతాయో మరి.!

Tags:    
Advertisement

Similar News