భారతజట్టులో హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ కు చోటు!

హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కు భారత టీ-20 జట్టులో చోటు దక్కింది.

Advertisement
Update:2022-09-30 11:26 IST

హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కు భారత టీ-20 జట్టులో చోటు దక్కింది. బుమ్రా గాయంతో సిరాజ్ కు అవకాశం చిక్కింది. దక్షిణాఫ్రికాతో జరిగే ఆఖరి రెండు టీ-20 మ్యాచ్ ల్లో సిరాజ్ పాల్గోనున్నాడు...

భారత్ స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా గాయం..హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ పాలిట వరంగా మారింది. ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా ప్రపంచ మూడో ర్యాంకర్ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లోని ఆఖరి రెండుమ్యాచ్ ల్లో తలపడే భారతజట్టులో సిరాజ్ కు చోటు దక్కింది.

ఆస్ట్ర్రేలియాతో ముగిసిన సిరీస్ లోని ఆఖరి రెండు టీ-20 మ్యాచ్ లు ఆడి...వెన్నెముక గాయంతో బుమ్రా జట్టుకు దూరం కావడంతో...బీసీసీఐ ఎంపిక సంఘం హైదరాబాదీ పేసర్ సిరాజ్ కు అవకాశమిచ్చింది.

ఆ ముగ్గురికి బదులుగా....

దక్షిణాఫ్రికాతో మూడుమ్యాచ్ ల సిరీస్ లో పాల్గొంటున్న భారతజట్టులో శ్రేయస్ అయ్యర్, షాబాజ్ ఖాన్, మహ్మద్ సిరాజ్ ఆఖరినిముషంలో చోటు సంపాదించారు.

కరోనాతో షమీ జట్టుకు దూరం కావడంతో ఉమేశ్ యాదవ్ కు చోటు కల్పించారు. ఆల్ రౌండర్ దీపక్ హుడాకు బదులుగా శ్రేయస్ అయ్యర్, ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యాకు విశ్రాంతి నివ్వడంతో అతని స్థానంలో బెంగాల్ ఆల్ రౌండర్ షాబాజ్ అహ్మద్ ను చేర్చుకొన్నారు.

దక్షిణాఫ్రికాతో తొలి టీ-20 మ్యాచ్ ప్రారంభానికి ముందే వెన్నెముక గాయంతో బుమ్రా తప్పుకోడంతో మహ్మద్ సిరాజ్ కు స్థానం కల్పించారు.

ఎనిమిదిమాసాల తర్వాత అవకాశం...

భారత టీ-20 జట్టులో సభ్యుడిగా గత ఫిబ్రవరిలో శ్రీలంకతో తన ఆఖరిమ్యాచ్ ఆడిన మహ్మద్ సిరాజ్ ఎనిమిదిమాసాల విరామం తర్వాత తిరిగి చేరాడు. ప్రస్తుతం ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్లో వార్విక్ షైర్ తరపున ఆడుతున్న సిరాజ్ తన కెరియర్ లో ఇప్పటి వరకూ భారత్ తరపున ఐదు టీ-20 మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. ఐదుమ్యాచ్ ల్లో 5 వికెట్లు పడగొట్టడంతో పాటు 10. 45 ఎకానమీ నమోదు చేశాడు.

2020 ఐపీఎల్ సీజన్ నుంచి బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టులో కీలక బౌలర్ గా కొనసాగుతున్న సిరాజ్ కు భారతజట్టులో మాత్రమే అడదడపా అవకాశాలు దక్కుతున్నాయి.

ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడుమ్యాచ్ ల సిరీస్ లోని రెండో టీ-20 మ్యాచ్ కు గౌహతీలోని బార్సపారా స్టేడియం ఆతిథ్యమిస్తోంది. సెప్టెంబర్ 4న జరిగే ఆఖరి టీ-20 మ్యాచ్ ను ఇండోర్ లోని హోల్కార్ స్టేడియం వేదికగా నిర్వహించనున్నారు.

ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ లో శిఖర్ ధావన్ నాయకత్వంలోని భారతజట్టు పోటీపడనుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారతజట్టు సభ్యులు ప్రపంచకప్ కు ముందు బ్రిస్బేన్ లో నిర్వహించే శిక్షణశిబిరంలో పాల్గోనున్నారు.

Tags:    
Advertisement

Similar News