ఫ్రెంచ్ ఓపెన్లో 5 గంటల 26 నిముషాల పోరాటం!

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ లో ఎడతెగని పోరాటాలకు మరోపేరైన ఫ్రెంచ్ ఓపెన్లో మరో అరుదైన రికార్డు నమోదయ్యింది. టాప్ సీడ్ అల్ కరాజ్, 3వ సీడ్ నొవాక్ జోకోవిచ్ సైతం నాలుగోరౌండ్ కు చేరుకోగలిగారు.

Advertisement
Update:2023-06-04 16:17 IST

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ లో ఎడతెగని పోరాటాలకు మరోపేరైన ఫ్రెంచ్ ఓపెన్లో మరో అరుదైన రికార్డు నమోదయ్యింది. టాప్ సీడ్ అల్ కరాజ్, 3వ సీడ్ నొవాక్ జోకోవిచ్ సైతం నాలుగోరౌండ్ కు చేరుకోగలిగారు...

2023 గ్రాండ్ స్లామ్ సీజన్ రెండో టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్.. రికార్డుల మోతతో సాగిపోతోంది. సుదీర్ఘర్యాలీలు, గంటల తరబడి సాగిపోయే మ్యాచ్ లతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసే ఈ ఎర్రమట్టి కోర్టుల పోరులో మరో మారథాన్ మ్యాచ్ వచ్చి రికార్డుల్లో చేరింది.

పారిస్ లోని రోలాండ్ గారోస్ కాంప్లెక్స్..సుజానే లెంగ్లిన్ కోర్టు వేదికగా జరిగిన మూడోరౌండ్ పోరులో జర్మన్ ఆటగాడు డేనియల్ అల్ట్ మేయర్, ఇటాలియన్ ప్లేయర్ యానిక్ సిన్నర్..5 గంటల 26 నిముషాలపాటు తమ తమనేర్పు, ఓర్పులను పరీక్షించుకోడంతో పాటు...తమ మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమానుల సహనానికీ పరీక్ష పెట్టారు.

సుదీర్ఘర్యాలీలతోసాగిన మహాసమరం...

గంటకాదు..రెండు గంటలు కాదు..ఏకంగా 5 గంటల 26 నిముషాలపాటు సాగిన ఈ మారథాన్ సమరంలో జర్మన్ ప్లేయర్ డేనియల్ అల్ట్ మేయర్ విజేతగా నిలిచాడు.

నువ్వానేనా అన్నట్లుగా చాంతాడుబారు లాంటి ర్యాలీలతో సాగిన 5 సెట్ల సమరంలో డేనియల్ 6-7, 7-6, 1-6, 7-6, 7-5తో విజేతగా నిలిచాడు.

ఇటు డేనియర్, అట్టు సిన్నర్ షాటుకు షాటు, డ్రాపుకు డ్రాపు అన్నట్లుగా పోరాడారు.

సిన్నర్ తొలి సెట్ ను 7-6తో టైబ్రేక్ లో నెగ్గడం ద్వారా 1-0 ఆధిక్యం సాధించాడు. డేనియల్ సైతం రెండోసెట్ ను టై బ్రేక్ లోని 7-6తో నెగ్గడం ద్వారా 1-1తో సమఉజ్జీగా నిలిచాడు.

తిరిగి మూడోసెట్ ను సిన్నర్ 6-1తో అలవోకగా నెగ్గి మ్యాచ్ లో విజేతగా నిలిచేలా కనిపించాడు. అయితే కీలక నాలుగోసెట్ ను డేనియర్ 7-6తో టైబ్రేక్ లో నెగ్గి 2-2 సెట్లతో మరోసారి సమఉజ్జీలా నిలిచాడు.

విజేతను నిర్ణయించే ఆఖరిసెట్ సైతం12 గేమ్ ల పాటు సాగింది. అప్పటికే 300 నిముషాలపాటు కోర్టులో పోరాడిన ఇద్దరు ఆటగాళ్లు డస్సిపోయారు. అడుగుతీసి అడుగువేయలేని పరిస్థితికి వచ్చారు.

చివరిసెట్లో 79వ ర్యాంకర్ డేనియల్ రెండుమ్యాచ్ పాయింట్లు కాపాడుకోటమే కాదు..ఐదోమ్యాచ్ పాయింటుతో విజేతగా నిలవడం ద్వారా 8వ సీడన్ సిన్నర్ పై సంచలన విజయం సాధించాడు.

సెట్, మ్యాచ్ పాయింట్ సాధించిన అనంతరం డేనియల్ ఆనందం పట్టలేక కన్నీరుమున్నీరయ్యాడు. నాలుగోరౌండ్ పోరులో బల్గేరియా స్టార్ గ్రిగోర్ దిమిత్రోవ్ తో డేనియల్ తలపడనున్నాడు.

ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ చరిత్రలో అత్యంత సుదీర్ఘంగా సాగిన ఐదోమ్యాచ్ గా ఈ 5 గంటల 26 నిముషాలపోరు రికార్డుల్లో చోటు సంపాదించింది.

ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన మ్యాచ్ గా..2004లో ప్యాబ్రిక్ సాంటోరో- ఆర్నాడ్ క్లెమెంట్ ల నడుమ 6 గంటల 33 నిముషాలపాటు సాగిన పోరుగా నిలిచిపోయింది.

వరుసగా 13వసారి 4వ రౌండ్లో జోకోవిచ్...

మరోవైపు...పురుషుల సింగిల్స్ లో సీడెడ్ స్టార్లు, టైటిల్ ఫేవరెట్లు టాప్ సీడ్ అల్ కరాజ్, 3వ సీడ్ నొవాక్ జోకోవిచ్ 4వ రౌండ్ కు అర్హత సాధించగలిగారు.

3వ రౌండ్ మ్యాచ్ లో మాజీ చాంపియన్ జోకోవిచ్ గట్టి పోటీ ఎదుర్కొని 7-6, 7-76-2తో 29వ సీడ్ డేవిడోవిచ్ ఫోకినాను ఓడించాడు.

ఈ విజయంతో గత 13 సంవత్సరాల కాలంలో వరుసగా 13వసారి నాలుగోరౌండ్ చేరిన ఘనతను జోకోవిచ్ దక్కించుకోగలిగాడు.

గతేడాది రన్నర్ కాస్పర్ రూడ్ మూడోరౌండ్ పోరులో గిలియో జిప్పెరీని 4 సెట్ల పోరులో అధిగమించి 4వరౌండ్ కు చేరుకోగలిగాడు. నాలుగోరౌండ్లో చైనా సంచలనం జాంగ్ జీ జెన్ తో రూడ్ పోటీపడతాడు. 1937 తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ మూడోరౌండ్ చేరిన చైనా తొలిప్లేయర్ గా జాంగ్ రికార్డు నెలకొల్పాడు.

మహిళల సింగిల్స్ లో టీనేజర్ సంచలనం..

మహిళల సింగిల్స్ మూడో రౌండ్ చేరడం ద్వారా 16 సంవత్సరాల ఆంద్రీవా సంచలనం సృష్టించింది. గత 30 సంవత్సరాల కాలంలో ఈ ఘనత సాధించిన ఐదో మహిళగా నిలిచింది.

17 సంవత్సరాల వయసుకు ముందే గతంలో ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ లో రెండోరౌండ్ విజయాలు సాధించిన ప్లేయర్లలో సెరెనా విలియమ్స్, మార్టీనా హింగిస్ లాంటి దిగ్గజ ప్లేయర్లు ఉన్నారు.

రెండోరౌండ్ పోరులో ఆంద్రీవా 6-1, 6-2తో ఫ్రెంచ్ ప్లేయర్ డియానే పెర్రీని చిత్తు చేసింది. 143వ ర్యాంకర్ ఆంద్రీవా తొలిసారిగా ఫ్రెంచ్ ఓపెన్ మెయిన్ డ్రాకు... క్వాలిఫైయింగ్ రౌండ్ల ద్వారా అర్హత సంపాదించింది. మూడోరౌండ్ పోరులో అమెరికన్ స్టార్ ప్లేయర్ కోకో గాఫ్ తో తలపడాల్సి ఉంది.

ప్రపంచ 4వ ర్యాంకర్, వింబుల్డన్ విన్నర్ ఎలెనా రిబకినా 6-3, 6-3తో చెక్ టీనేజర్ లిండా నాస్కోవాపై విజయం సాధించింది. ప్రస్తుత సీజన్లో రిబకినాకు ఇది 30వ గెలుపు కావడం విశేషం.

Tags:    
Advertisement

Similar News