ఆ ముగ్గురు దిగ్గజాలు లేకుండా ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్!

2024- గ్రాండ్ స్లామ్ సీజన్లో ఫ్రెంచ్ ఓపెన్లో ఓ అరుదైన ఘట్టానికి రంగం సిద్ధమయ్యింది. ముగ్గురు దిగ్గజాలు లేకుండా టైటిల్ పోరు జరుగనుంది.

Advertisement
Update:2024-06-07 16:33 IST

2024- గ్రాండ్ స్లామ్ సీజన్లో ఫ్రెంచ్ ఓపెన్లో ఓ అరుదైన ఘట్టానికి రంగం సిద్ధమయ్యింది. ముగ్గురు దిగ్గజాలు లేకుండా టైటిల్ పోరు జరుగనుంది.

ప్రపంచ పురుషుల టెన్నిస్ ను గత మూడు దశాబ్దాలుగా శాసించిన ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు లేకుండా ప్రస్తుత సీజన్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సమరానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.

పారిస్ లోని రోలాండ్ గారోస్ వేదికగా జరుగుతున్న 2024 గ్రాండ్ స్లామ్ సీజన్ రెండో టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్లో నలుగురు నవతరం ఆటగాళ్లు తలపడనుండడంతో...గత రెండుదశాబ్దాల కాలంలో ఫెదరర్, నడాల్, జోకోవిచ్ లలో కనీసం ఒక్కరైనా లేకుండా టైటిల్ పోరు జరగడం ఖాయమయ్యింది.

గత 20 సంవత్సరాలలో ఇదే తొలిసారి....

ప్రపంచ పురుషుల టెన్నిస్,ప్రధానంగా గ్రాండ్ స్లామ్ టోర్నీలు అనగానే గత రెండుదశాబ్దాలుగా ఫెదరర్, నడాల్, జోకోవిచ్ పేర్లు మాత్రమే వినిపించాయి. ఈ ముగ్గురు మొనగాళ్లే గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను పంచుకొంటూ వచ్చారు. అయితే..స్విస్ వండర్ రోజర్ ఫెదరర్ ముందుగా రిటైర్మెంట్ ప్రకటించడంతో నడాల్, జోకోవిచ్ మాత్రమే బరిలో మిగిలారు.

ఫ్రెంచ్ ఓపెన్ కే చిరునామాగా, అత్యధిక టైటిల్స్ లో గ్రాండ్ రికార్డు నెలకొల్పిన స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్ సైతం గాయాలు, వయసు మీద పడటం లాంటి కారణాలతో గత ఏడాదిగా టెన్నిస్ కు దూరమయ్యాడు. ప్రస్తుత సీజన్ ఫ్రెంచ్ ఓపెన్ బరిలో దిగటం ద్వారా రీ-ఎంట్రీ చేసినా...తొలిరౌండ్లోనే అలెగ్జాండర్ జ్వరేవ్ చేతిలో పరాజయంతో టోర్నీ నుంచి నిష్క్ర్రమించాడు.

అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విన్నర్ నొవాక్ జోకోవిచ్ మోకాలి గాయంతో ప్రస్తుత ఫ్రెంచ్ ఓపెన్ నుంచి నిష్క్ర్రమించడంతో..నలుగురు నవతరం ఆటగాళ్లు చివరకు టైటిల్ రేస్ లో మిగిలారు.

2009 లో నడాల్, జోకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరకున్నా...రోజర్ ఫెదరర్ టైటిల్ పోరులో రాబర్ట్ సోడర్లింగ్ తో తలపడ్డాడు. 2024 ఫ్రెంచ్ ఓపెన్లో సైతం ఇటు నడాల్, అటు జోకోవిచ్ విఫలం కావడంతో టైటిల్ పోరు..ప్రస్తుత తరం ఆటగాళ్ల నడుమ జరగటానికి రంగం సిద్ధమయ్యింది.

 

ఎవరా నలుగురు...?

దిగ్గజ ఆటగాళ్లు ప్రారంభ రౌండ్లలోనే ఇంటిదారి పట్టడంతో స్పానిష్ యంగ్ గన్ కార్లోస్ అల్ కరాజ్, ఇటాలియన్ సంచలనం యానిక్ సిన్నర్, నార్వే థండర్ కాస్పర్ రూడ్, అలెగ్జాండర్ జ్వెరేవ్ సెమీస్ రేస్ లో మిగిలారు.

ఫైనల్లో చోటు కోసం జరిగే తొలి సెమీఫైనల్లో 2వ సీడ్ యానిక్ సిన్నర్ తో 3వ సీడ్ కార్లోస్ అల్ కరాజ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. ఈ ఇద్దరూ తమ కెరియర్ లో తొమ్మిదోసారి ఢీ కొనబోతున్నారు.

21 సంవత్సరాల అల్ కరాజ్ తన కెరియర్ లో సిన్నర్ నుంచి అతిపెద్ద పోటీ ఎదుర్కొనబోతున్నాడు. సిన్నర్ ప్రత్యర్థిగా పోటీకి దిగటం కత్తిమీద సవాలేనని, మారథాన్ పరుగులో పాల్గొన్నట్లుగా ఉంటుందని అల్ కరాజ్ చెప్పడం చూస్తే..ఈ ఇద్దరి పోరు ఐదుసెట్ల హోరాహోరీ సమరంలా సాగనుంది.

22 ఏళ్ల సిన్నర్ వచ్చేవారమే ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ను కైవసం చేసుకోన్నాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఫ్రెంచ్ ఓపెన్ తొలి సెమీఫైనల్లో భారీ అంచనాల నడుమ పోటికి దిగుతున్నాడు.

రెండో సెమీఫైనల్లో 4వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరేవ్ తో 7వ సీడ్ కాస్పర్ రూడ్ పోటీ పడనున్నాడు. ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీ సెమీఫైనల్లో ఈ ఇద్దరూ తలపడనుండటం ఇదే మొదటిసారి కానుంది.

జ్వెరేవ్ తన మూడు, నాలుగు రౌండ్ల మ్యాచ్ లను ఐదుసెట్ల పోరులో నెగ్గడంతో పాటు..క్వార్టర్ ఫైనల్లో అలెక్స్ డి మినోర్ ను సునాయాసంగా ఓడించడంతో పాటు సెమీస్ బెర్త్ సాధించాడు.

జర్మన్ ఆటగాడు జ్వెరేవ్ ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్ చేరడం ఇది నాలుగోసారి కావడం విశేషం.

Tags:    
Advertisement

Similar News