ఐపీఎల్ వేలం బరిలో 165 మంది ప్లేయర్లు!

2024 సీజన్ మహిళా ఐపీఎల్ వేలానికి ముంబైలో రంగం సిద్ధమయ్యింది. మొత్తం 165 మంది ప్లేయర్ల జాబితాను ఐపీఎల్ బోర్డు విడుదల చేసింది.

Advertisement
Update:2023-12-05 08:53 IST

2024 సీజన్ మహిళా ఐపీఎల్ వేలానికి ముంబైలో రంగం సిద్ధమయ్యింది. మొత్తం 165 మంది ప్లేయర్ల జాబితాను ఐపీఎల్ బోర్డు విడుదల చేసింది....

మహిళా ఐపిఎల్ రెండో (2024 ) సీజన్ వేలానికి ఐపీఎల్ పాలకమండలి సన్నాహాలు మొదలు పెట్టింది. 2024 ఫిబ్రవరి- మార్చి మాసాలలో జరిగే మహిళా ఐపీఎల్ లో మొత్తం ఐదు ఫ్రాంచైజీలకు చెందిన జట్లు తలపడనున్నాయి.

30 స్థానాల భర్తీ కోసం వేలం....

ముంబై వేదికగా డిసెంబర్ 9న వేలం కార్యక్రమాన్ని నిర్వహించడానికి బోర్డు రంగం సిద్ధం చేసింది. మొత్తం 104 మంది భారత ప్లేయర్లతో సహా 165 మంది వేలం బరిలో నిలిచారు.

ఐదు ఫ్రాంచైజీల యాజమాన్యాలు తమతమ జట్లలోని 30 ఖాళీల భర్తీ కోసమే వేలం కార్యక్రమంలో పాల్గొనబోతున్నాయి. 61 మంది విదేశీ క్రికెటర్లు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఐసీసీ అనుబంధ దేశాలకు చెందిన 15 మంది ప్లేయర్లతో పాటు..అంతర్జాతీయ మ్యాచ్ ల అనుభవం లేని 56 మంది అన్ కాప్డ్ ప్లేయర్లను జాబితాలో ఉంచారు.

కనీస వేలం ధర 40 లక్షలు...

ఐదు జట్లలోనూ కలిపి విదేశీ ప్లేయర్ల కోటాలో 9 స్థానాలు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ప్రారంభ సీజన్లో వెస్టిండీస్ ఆల్ రౌండర్ దేవేంద్ర డోటిన్ ను 60 లక్షల రూపాయల ధరకు వేలం ద్వారా దక్కించుకొన్న గుజరాత్ టైటాన్స్ ఆ తరువాత ఫిట్ నెస్ కారణాలతో జట్టు నుంచి తప్పించి..ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ కిమ్ గార్త్ ను 50 లక్షల రూపాయలకు జట్టులో చేర్చుకొంది.

కంగారూ ఆల్ రౌండర్లు అన్నాబెల్ సదర్లాండ్, జార్జియా వార్ హామ్, ఇంగ్లండ్ వికెట్ కీపర్ యామీ జోన్స్, సౌతాఫ్రికా పేసర్ షబ్నం ఇస్మాయిల్ ల కనీస వేలం ధరను 40 లక్షలుగా నిర్ణయించారు.

లీగ్ లో తలపడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీలు...ప్రారంభ సీజన్లో తమతమ జట్లకు ఆడిన 21 మంది విదేశీ ప్లేయర్లను కొనసాగించాలని నిర్ణయించాయి.

2కోట్ల 25 లక్షలతో గుజరాత్ జెయింట్స్....

మొత్తం 5 ప్రాంచైజీలలో గుజరాత్ జెయింట్స్ మాత్రమే అత్యధికంగా 2 కోట్ల 25 లక్షల రూపాయల మొత్తంతో వేలం బరిలోకి దిగుతోంది. మొత్తం 10 స్థానాలను గుజరాత్ భర్తీ చేసుకోనుంది.

డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ 2 కోట్ల 10 లక్షల రూపాయలతో 5 ఖాళీలను, బెంగళూరు 3 కోట్ల 35 లక్షల రూపాయలతో ఏడుగురు ప్లేయర్లను, యూపీ వారియర్స్ 4 కోట్లతో ఐదుగురు ప్లేయర్లను కొనుగోలు చేయాల్సి ఉంది.

శ్రీలంక వెటరన్ బ్యాటర్ చమరీ అటపట్టుకు భారీగా ధర దక్కే అవకాశం ఉంది. థాయ్ లాండ్ ఓపెనర్ నత్తకాన్ చంతామ్, అమెరికా పేసర్ తారా నోరిస్ కు సైతం మంచి ధర దక్కే అవకాశం ఉంది.

నెదర్లాండ్స్, స్కాట్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, హాంకాంగ్ దేశాలకు చెందిన క్రికెటర్లు సైతం వేలంబరిలో ఉన్నారు.

2023 సీజన్లో తొలిసారిగా ప్రారంభించిన మహిళా ఐపీఎల్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించడం ద్వారా ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచింది.

ప్రారంభ సీజన్ వేలంలో అత్యధిక ధర దక్కించుకొన్న ప్లేయర్లలో స్మృతి మంధాన, ఎల్సీ పెర్రీ, సోఫీ డివైన్, మేగాన్ స్కుట్, హీథర్ నైట్ ఉన్నారు. హేమాహేమీల్లాంటి ప్లేయర్లతో కూడిన జట్టుతో పోటీలోకి దిగిన బెంగళూరు నాలుగోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

2024 సీజన్ లీగ్ ను ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాలు వేదికలుగా నిర్వహించనున్నారు.

Tags:    
Advertisement

Similar News