ఒక్కరోజులో 15 పతకాలు, ఏషియాడ్ లో భారత్ రికార్డు!
హాంగ్జు ఆసియాక్రీడల 8వ రోజు పోటీలలో భారత అథ్లెట్లు పతకాల మోత మోగించారు. ఒక్కరోజులో 15 పతకాలు నెగ్గి సరికొత్త రికార్డు నెలకొల్పారు.
హాంగ్జు ఆసియాక్రీడల 8వ రోజు పోటీలలో భారత అథ్లెట్లు పతకాల మోత మోగించారు. ఒక్కరోజులో 15 పతకాలు నెగ్గి సరికొత్త రికార్డు నెలకొల్పారు.
చైనాలోని హాంగ్జు వేదికగా జరుగుతున్న 19వ ఆసియాక్రీడల్లో భారత్ పతకాల సాధన టాప్ గేర్ కు చేరుకొంది. పోటీల 7వ రోజు వరకూ షూటర్లు బంగారు పంట పండిస్తే..
8వరోజు పోటీలలో అథ్లెట్లు జంట స్వర్ణాలు సాధించారు.
ట్రాక్ అండ్ ఫీల్డ్ పురుషుల 3వేల మీటర్ల స్టీపిల్ చేజ్ లో అవినాశ్ సాబ్లే, షాట్ పుట్ లో తేజిందర్ పాల్ తూర్ బంగారు పతకాలు గెలుచుకొన్నారు. మహిళల 100 మీటర్ల హర్డల్స్ లో తెలుగుతేజం, విశాఖ రన్నర్ జ్యోతి యర్రాజీ రజత పతకం అందుకొంది.
బ్యాడ్మింటన్ పురుషుల టీమ్ విభాగంలో తొలిసారిగా ఫైనల్స్ చేరిన భారత్ చివరకు రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
8వరోజున 3 స్వర్ణాలు....
క్రీడల మొదటి ఏడురోజుల పోటీలు ముగిసే సమయానికి 48 పతకాలతో నిలిచిన భారత్ కు 8వ రోజుపోటీలలో పతకాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. 3 స్వర్ణ, 7 రజత, 5 కాంస్యాలతో సహా మొత్తం 15 పతకాలు సాధించడంతో..భారత పతకాల సంఖ్య 53కు పెరిగిపోయింది.
ఆసియాక్రీడల చరిత్రలోనే భారత్ ఒక్కరోజులో 15 పతకాలు గెలుచుకోడం ఇదే మొదటిసారి.
2018 జకార్తా క్రీడల్లో అత్యుత్తమంగా ఒక్కరోజులో 9 పతకాలు, 2014 ఇంచెన్ గేమ్స్ లో 10 పతకాలు, 2010 గాంగ్జు క్రీడల్లో 11 పతకాల రికార్డులను భారత అథ్లెట్లు ప్రస్తుత గేమ్స్ లో 15 పతకాలు నెగ్గడం ద్వారా తెరమరుగు చేశారు.
స్టీపుల్ చేజ్ లో సాబ్లే సంచలనం...
పురుషుల 3 వేలమీటర్ల స్టీపుల్ చేజ్ పరుగులో భారత అథ్లెట్ అవినాశ్ సాబ్లే సరికొత్త గేమ్స్ రికార్డుతో బంగారు పతకం అందుకొన్నాడు. పురుషుల షాట్ పుట్ విభాగంలో తేజిందర్ పాల్ మరోసారి స్వర్ణ విజేతగా నిలిచాడు.
మహిళల డిస్కస్ త్రో విభాగంలో సీమ పూనియా, హెప్టాథ్లాన్ లో నందిని అగసరా కాంస్య పతకాలు గెలుచుకొన్నారు.
తెలుగు రన్నర్ జ్యోతికి రజతం..
మహిళల 100 మీటర్ల హర్డల్స్ రేస్ లో తెలుగు రన్నర్ జ్యోతి యర్రాజీ రజత పతకం సాధించింది. వాస్తవానికి జ్యోతికి కాంస్య పతకం మాత్రమే వచ్చింది. అయితే..రజత విజేతగా నిలిచిన చైనా రన్నర్ వు యాన్నీ రేస్ ప్రారంభంలో ఫౌల్ చేయడంతో అనర్హురాలిగా ప్రకటించి..కాంస్యం నెగ్గిన జ్యోతిని రజత విజేతగా ప్రకటించారు.
మహిళల 1500 మీటర్ల పరుగులో హార్మిలాన్ బెయిన్స్, పురుషుల లాంగ్ జంప్ లో మురళీ శ్రీశంకర రజత పతకాలు సాధించారు. పురుషుల 1500 మీటర్ల పరుగులో అజయ్ కుమార్ సరోజ్ కు రజత, జిన్సన్ జాన్సన్ కు కాంస్య పతకాలు లభించాయి.
గోల్ఫ్ మహిళల వ్యక్తిగత విభాగంలో ఆదితి అశోక్ రజత పతకం సాధించింది. స్వర్ణం అంచుల వరకూ వచ్చి అనవసర తప్పిదాలతో రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
బ్యాడ్మింటన్ లో తొలి రజతం...
భారత బ్యాడ్మింటన్ పురుషులజట్టు క్రీడల చరిత్రలోనే తొలిసారిగా ఫైనల్స్ చేరడంతో పాటు రజత పతకం అందుకొంది. స్వర్ణం కోసం జరిగిన పోరులో ఆతిథ్య చైనాకు భారత్ గట్టిపోటీ ఇచ్చి 2-3తో పరాజయం చవిచూసింది. సింగిల్స్ లో కీలక ప్లేయర్ ప్రణయ్ గాయంతో అందుబాటులో లేకపోడం భారత్ ను దెబ్బతీసింది. స్వర్ణ పతకం గెలుచుకొనే అవకాశాన్ని చేజార్చుకొంది.
ఆసియాక్రీడల బ్యాడ్మింటన్ వ్యక్తిగత విభాగంలో సింధు 2018 గేమ్స్ సింగిల్స్ లో రజత పతకం నెగ్గిన తరువాత పురుషులజట్టు టీమ్ విభాగంలో సాధించిన రజతమే అతిపెద్ద విజయం కావడం విశేషం.
కాంస్యంతో ముగిసిన నిఖత్ జరీన్ పోరు...
మహిళల 50 కిలోల విభాగంలో భారత్ కు గోల్డ్ మెడల్ సాధించి పెట్టగలదనుకొన్న తెలంగాణా బాక్సర్ నిఖత్ జరీన్ సెమీస్ పోరులో విఫలమయ్యింది. థాయ్ బాక్సర్ చేతిలో 2-3తో ఓటమి పొందడం ద్వారా కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రపంచ విజేతగా ఉన్న నిఖత్ చివరకు ఆసియాక్రీడల్లో మాత్రం కంచు పతకం స్థాయికి పరిమితమయ్యింది.
మహిళల హాకీ గ్రూప్ లీగ్ లో కొరియాను 1-1తో నిలువరించడం ద్వారా భారతజట్టు సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్ కు మరింత చేరువయ్యింది.
భారత షూటర్ల పతకాల మోత...
ప్రస్తుత ఆసియాక్రీడల్లో భారత్ అత్యధిక పతకాలను షూటింగ్ అంశాలలో సాధించింది. భారత షూటర్లు గతంలో ఎన్నడూలేని విధంగా మొత్తం 22 పతకాలు అందించడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పారు.
2006 దోహా ఆసియాక్రీడల్లో భారత షూటర్లు అత్యధికంగా 14 పతకాలు సాధించారు. ఆ రికార్డును ప్రస్తుత 2022 గేమ్స్ లో భారత షూటర్లు అధిగమించగలిగారు.
2018 జకార్తా ఆసియాక్రీడల్లో భారత షూటర్లు రెండు స్వర్ణాలతో సహా మొత్తం తొమ్మిది పతకాలు మాత్రమే సాధించగలిగారు.