ఫుట్ బాల్ స్టేడియంలో తొక్కిసలాట..127 మంది మృతి

ఇండోనీసియాలోని ఓ స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 127మంది మృతి చెందారు, మరో 180 మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు చెబుతున్నారు.

Advertisement
Update:2022-10-02 09:28 IST

ప్రపంచ నంబర్ వన్ గేమ్ ఫుట్ బాల్ చరిత్రలో మరో అతిపెద్ద విషాదం చోటు చేసుకొంది. ఇండోనీసియాలోని ఓ స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 127మంది మృతి చెందారు, మరో 180 మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు చెబుతున్నారు...

ప్రపంచంలో అత్యంత జనాదరణ పొందుతున్న క్రీడ ఫుట్ బాల్ లో మరో అతిపెద్ద విషాదం చోటు చేసుకొంది. ప్రపంచ వ్యాప్తంగా వారం వారం వివిధస్థాయిలో కొన్నివేల ఫుట్ బాల్ మ్యాచ్ లు నిర్వహిస్తూ ఉంటారు. పటిష్టమైన జాగ్రత్తలు తీసుకొన్నా అడపాదడపా అభిమానుల విధ్వంసం, తొక్కిసలాటలు జరుగుతూనే ఉంటాయి. ఆ కోవలోనే..

ఇండోనీసియాలోని తూర్పు జావాలో మరో విషాదం చోటు చేసుకొంది.

అదుపుతప్పిన అభిమానం...

ఇండోనీసియా క్లబ్ ఫుట్ బాల్ లీగ్ లో భాగంగా తూర్పుజావాలోని మలాంగ్- కుంజురుహాన్ స్టేడియం వేదికగా అరెమా, పెర్సిబయా సూరబయా క్లబ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సమయంలో ఈ విషాదం చోటు చేసుకొంది.

తమ అభిమానజట్టు 2-3 గోల్స్ తో ఓటమి చెందడంతో భరించలేకపోయిన అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. స్టేడియం స్టాండ్స్ లో నుంచి వేలాదిమందిగా గ్రౌండ్ లోకి చొచ్చుకు రావడంతో ఘర్షణవాతావరణం, తొక్కిసలాట చోటు చేసుకొన్నాయి. అదుపు చేయటానికి పోలీసులు భాష్పవాయువు ప్రయోగించినా ప్రయోజనం లేకపోయింది.


పోలీసుల జోక్యంతో పరిస్థితి మరింతగా అదుపుతప్పింది. తొక్కిసలాటలో 127 మంది మృతి చెందినట్లు, మరో 180 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు ప్రకటించారు.

మృతుల్లో 34 మంది స్టేడియంలోను, మిగిలినవారు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారని తెలిపారు.

ఆగ్రహం కట్టలు తెంచుకొన్న అభిమానులు పోలీసు వాహనాలను ధ్వంసం చేసి..స్టేడియం ఆస్తులకు భారీస్థాయిలో నష్టకలిగించినట్లు పోలీసులు ప్రకటించారు.

ఇండోనీసియా, ఆసియా ఫుట్ బాల్ చరిత్రలోనే ఇంత భారీసంఖ్యలో సాకర్ అభిమానులు మృతి చెందటం ఇదే మొదటిసారి.



Tags:    
Advertisement

Similar News