12 ఏళ్ల ముంబై ప్రయాణం ఓ కలలా ఉంది-రోహిత్
ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా పుష్కరకాల ప్రయాణం తనకు ఓ కలలా ఉందంటూ రోహిత్ శర్మ మురిసిపోతున్నాడు.
ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా పుష్కరకాల ప్రయాణం తనకు ఓ కలలా ఉందంటూ రోహిత్ శర్మ మురిసిపోతున్నాడు. ఒకేజట్టుకు సుదీర్ఘకాలం నాయకుడిగా వ్యవహరించిన రెండో క్రికెటర్ గా అరుదైన రికార్డు నెలకొల్పాడు....
ప్రపంచ క్రికెట్ లీగ్ లలోనే అత్యంత జనాదరణ పొందుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15 సీజన్ల చరిత్రలో ..12 సంవత్సరాలపాటు ఒకే జట్టుకు కెప్టెన్ గా ఉండటం..అదీ ఐదుసార్లు విజేతగా నిలపడం అంటే మాటలా మరి.
అలాంటి అరుదైన ఘనతను ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మ దక్కించుకొన్నాడు. ముంబై సారథిగా అప్పడే పుష్కరకాలం గడచిపోయిందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు. ముంబై ఫ్రాంచైజీతో తన అలుపెరుగని ప్రయాణాన్ని, డాషింగ్ ఓపెనర్ గా, సమర్థుడైన కెప్టెన్ గా తన పాత్రను రోహిత్ ఓసారి మననం చేసుకొన్నాడు.
2011 టు 2023
2011 ఐపీఎల్ వేలంలో 9 కోట్ల 20 లక్షల రూపాయల ధరకు 23 సంవత్సరాల రోహిత్ శర్మను ముంబై ఫ్రాంచైజీ దక్కించుకొంది. అప్పటి నుంచి ముంబై ఫ్యామిలీలో కీలక సభ్యుడిగా, నాయకుడిగా రోహిత్ తన జైత్రయాత్రను, విజయపరంపరను కొనసాగించాడు.
ఒకేజట్టుకు 12 సంవత్సరాలపాటు నాయకత్వం వహించడం, ఐదుసార్లు విజేతగా నిలపడం లాంటి అరుదైన రికార్డులను సొంతం చేసుకొన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత సుదీర్ఘకాలం ఒకేజట్టుకు నాయకత్వం వహించిన మొనగాడిగా నిలిచాడు.
182 మ్యాచ్ లు- 4709 పరుగులు..
ముంబై ఇండియన్స్ జట్టులో మాస్టర్ సచిన్ టెండుల్కర్, కిరాన్ పోలార్డ్, సూర్యకుమార్ యాదవ్, జస్ ప్రీత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా , ఇషాన్ కిషన్ లాంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఎందరో ఉన్నా...రోహిత్ శర్మ ఓపెనర్ గా, కెప్టెన్ గా తనవంతు పాత్ర నిర్వర్తించడమే కాదు..జట్టును ముందుండి నడిపించే ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు.
2011 సీజన్ నుంచి 2022 సీజన్ వరకూ ముంబై తరపున రోహిత్ మొత్తం 182 మ్యాచ్ లు ఆడి 109 పరుగుల నాటౌట్ అత్యధిక స్కోరుతో 4వేల 709 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, 32 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ముంబై ఇండియన్స్ సారథిగా 2023 జనవరి 8న రోహిత్ 12 సంవత్సరాల కాలం పూర్తి చేశాడు. ముంబై ఇండియన్స్ తో అప్పుడే తాను 12 సంవత్సరాలపాటు ప్రయాణం చేశానంటే నమ్మబుద్దికావడం లేదని, పలువురు దిగ్గజ ఆటగాళ్లతో పాటు ..ప్రతిభావంతులైన నవతరం క్రికెటర్లతో కలసి ఆడటం తన అదృష్టమని, వారందిరి తోడ్పాటు, సహకారంతోనే తమజట్టు ఎంతో సాధించగలిగిందని, ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా ఐదుసార్లు విజేతగా నిలవడం అపూర్వ, అనిర్వచనీయం అంటూ పొంగిపోతున్నాడు.
ముంబై ఇండియన్స్ తరపున రెండు చాంపియన్స్ లీగ్ ట్రోఫీలు సాధించిన ఘనత కూడా రోహిత్ కు ఉంది.
ముంబై శిఖరం రోహిత్ శర్మ..
ముంబై ఇండియన్స్ తరపున రోహిత్ శర్మకు అరడజనుకు పైగా రికార్డులు ఉన్నాయి. అత్యధికంగా 182 మ్యాచ్ లు, అత్యధికంగా 32 శతకాలు బాదడంతో పాటు..అత్యధిక బౌండ్రీలు సాధించిన ఆటగాడి రికార్డులు రోహిత్ పేరుతోనే ఉన్నాయి. అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుల రికార్డు సైతం రోహిత్ కే దక్కింది.
కెప్టెన్ గా మొత్తం 143 మ్యాచ్ ల్లో 81 విజయాలు అందించిన మొనగాడు రోహిత్ శర్మ మాత్రమే కావడం విశేషం.
గత సీజన్ లీగ్ లో దారుణంగా విఫలమైన ముంబై ఏకంగా 10వ స్థానానికి దిగజారిపోయింది. దారి తప్పిన ముంబైని ప్రస్తుత 2023 సీజన్లో తిరిగి గాడిలో పెట్టడమే తన లక్ష్యమని రోహిత్ చెబుతున్నాడు.
భారత్ వేదికగా ఈ ఏడాది జరిగే 2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో జాతీయజట్టుకు కెప్టెన్ గా కూడా రోహిత్ వ్యవహరించబోతున్నాడు.