చాట్‌లోనే ప్రొఫైల్ ఇన్ఫో.. వాట్సాప్ కొత్త ఫీచర్!

తాజాగా ప్రొఫైల్ ఇన్ఫోకు సంబంధించిన కొత్త అప్‌డేట్ వాట్సాప్ బీటాలో కనిపించింది.

Advertisement
Update:2023-11-27 16:15 IST

ప్రపంచంలో ఎక్కువ మంది వాడుతున్న యాప్స్‌లో వాట్సాప్‌ ఒకటి. ఈ రోజుల్లో వాట్సాప్ లేని ఫోన్‌ను ఊహించడమే కష్టం. అందుకే మెటా సంస్థ కూడా యూజర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకొస్తుంటుంది. తాజాగా ప్రొఫైల్ ఇన్ఫోకు సంబంధించిన కొత్త అప్‌డేట్ వాట్సాప్ బీటాలో కనిపించింది. ఇదెలా ఉంటుందంటే..

వాట్సాప్‌లో ఎవరితోనైనా చాట్ చేసేటప్పుడు స్క్రీన్ పైన కేవలం వారి నెంబర్ లేదా పేరు, చిన్న సర్కిల్‌లో వాళ్ల డీపీ మాత్రమే కనిపిస్తాయి. వాళ్ల ప్రొఫైల్ వివరాలు తెలుసుకోవాలంటే పేరు/నెంబర్‌‌పై క్లిక్ చేసి ఇన్ఫో స్క్రీన్‌కు వెళ్లాలి. అయితే అలా కాకుండా చాటింగ్ చేస్తూనే అవతలి వారి ఫ్రొఫైల్ వివరాల్ని తెలుసుకునే విధంగా వాట్సాప్ కొత్త అప్‌డేట్ తీసుకురానుంది.

వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం త్వరలో రాబోయే యాప్ అప్‌డేట్‌తో వాట్సాప్‌లో ఈ కొత్త మార్పు కనిపించనుంది. యూజర్లు చాట్ చేస్తూనే అవతలి వాళ్ల పేరు, స్టేటస్, ప్రొఫైల్ పిక్చర్, లాస్ట్ సీన్ వంటివి చూడొచ్చు. ప్రొఫైల్ వివరాల కోసం ప్రతిసారీ ఇన్ఫో స్క్రీన్‌ను ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. అయితే యూజర్ల ప్రైవసీ సెట్టింగ్స్‌ను బట్టి ఏయే వివరాలు పబ్లిక్ లేదా ఫ్రెండ్స్‌కు అందుబాటులో ఉంచారో అవి మాత్రమే కనిపిస్తాయి. ఒకవేళ ప్రొఫైల్ వివరాలు హైడ్ చేసి ఉంచితే కనిపించవు.

ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. ఇక దీంతోపాటు ఆల్టర్నేటివ్ ప్రొఫైల్ అనే మరో ఫీచర్, సస్పెండ్ చేసిన ఛానెల్స్‌కు రివ్యూ కోరుకునే అవకాశం, మరికొన్ని ప్రైవసీ మార్పుల వంటి వాటిపై కూడా వాట్సాప్ పనిచేస్తోంది.


Tags:    
Advertisement

Similar News