చైనా నిషేధిత యాప్‌లన్నీ మళ్లీ గూగుల్ ప్లే స్టోర్‌లో
యాప్‌ల పేర్లు, వెర్షన్లు మార్చి మళ్లీ విడుదల
దేశీయ భద్రత, డేటా గోప్యతపై ఆందోళన కారణంగా నిషేధించిన చైనా యాప్‌లు తిరిగి భారత్‌లోకి వచ్చేశాయి. యాప్‌ల పేర్లు, వెర్షన్లు మార్చి మళ్లీ విడుదలయ్యాయి. ఆ యాప్‌లలో కొన్నింటికి యాజమాన్య హక్కులు మారగా.. మరికొన్ని చైనా కంపెనీలుగానే కొనసాగుతున్నట్లు సమాచారం.
భద్రతా సమస్యల కారణంగా 2020లో సుమారు 267 చైనా యాప్‌లపై భారత్ నిషేధం విధించిన విషయం విదితమే. సరిహద్దులోని గల్వాన్ వద్ద భీకర ఘర్షణ తర్వాత దేశంలో చైనా తీరుపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో భారత్ ఈ చర్యలు తీసుకున్నది. అయితే ఇప్పుడు ఆ యాప్‌ల పేర్ల, వెర్షన్లు మార్చి తిరిగి భారత్‌లో విడుదలయ్యాయి. గతంలో నిషేధించిన యాప్‌లలో 36 అప్లికేషన్లు తిరిగి భారత్‌లోకి వచ్చాయి. వాటిలో కొన్ని బ్రాండింగ్, లోగోల్లో చిన్న మార్పులు చేసి తీసుకొచ్చారు. వీటిలో ఫైల్-షేరింగ్ సర్వీస్ Xender, స్ట్రిమింగ్ ప్లాట్‌ఫామ్ మ్యాంగో టీవీ, షాపింగ్ యాప్ టావోబావో, డేటింగ్ యాప్ టాన్‌టాన్, షాపింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, ఫైల్ షేరింగ్, కంటెంట్ క్రియేటషన్‌కు చెందిన అప్లికేషన్లు ఉన్నాయి. ఈ యాప్‌లన్నీ ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి.