బీఎస్‌ఎన్‌ఎల్‌లో మరోసారి వీఆర్‌ఎస్!
35 శాతం ఉద్యోగులను ఇంటికి పంపించాలని యోచిస్తున్నట్లు ఇంగ్లీష్ మీడియాలో కథనాలు
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తన శ్రామిక శక్తిని తగ్గించి, బ్యాలెన్స్ షీట్‌ను మెరుగుపరిచేందుకు సిద్ధమౌతున్నది. దీనికోసం మరోసారి స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్‌ఎస్) అమలు చేయాలని ఆలోచిస్తున్నది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదాన్ని కోరే యోచనలో ఉన్నట్లు సమాచారం. తద్వారా 35 శాతం శ్రామికశక్తిని తగ్గించుకోవాలని ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
బ్యాలెన్స్ షీట్‌ను మెరుగుపరచడానికి వీఆర్‌ఎస్ ద్వారా టెల్కోలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని డాట్‌కు బీఎస్‌ఎన్‌ఎల్ బోర్డు ప్రతిపాదన పంపినట్లు తెలుస్తోంది. దీనికోసం వీఆర్‌ఎస్ అమలుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి రూ. 15 వేల కోట్లను డాట్ కోరినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ టెలికాం సంస్థకు వచ్చే ఆదాయంలో రూ.7,500 కోట్లు అంటే సుమారు 38 శాతం ఉద్యోగుల జీతాల కోసం కేటాయిస్తున్నది. ఈ వ్యయాన్ని రూ. 5,000 కోట్లకు తగ్గించాలని కంపెనీ ఆలోచిస్తున్నది. ఆర్థిక మంత్రిత్వశాఖతోపాటు కేబినెట్ ఆమోదం అనంతరం వీఆర్‌ఎస్ ప్రక్రియ చేపట్టనున్నారు.
ప్రస్తుతానికి వీఆర్‌ఎస్ ప్లాన్ ఇంకా అంతర్గత చర్చల్లో ఉందని, ఈ అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సంస్థ కు చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. అయితే ఈ విషయంపై టెలికాం అధికారిక ప్రకటన చేయలేదు. 2019 బీఎస్‌ఎన్‌ఎల్, మహానగర్ టెలికాం నిగమ్ లిమిటెడ్‌కు (ఎంటీఎన్‌ఎల్) రూ. 69 వేల కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీకి కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందులో ముందస్తు పదవీ విరమణ అంశమూ ఇమిడి ఉన్నది. ఈ సమయంలో ఈ రెండు టెలికాం సంస్థలకు చెందిన 93 వేల మంది ఉద్యోగులు వీఆర్‌ఎస్‌ను ఎంచుకున్నారు. 2022లో రెండో విడతగా రూ. 1.64 లక్షల కోట్లను కేంద్రం పునరుద్ధరణ ప్యాకేజీ కింద కేటాయించింది. ఢిల్లీ, ముంబయి నగరాల్లో ఎంటీఎన్‌ఎల్ కార్యకలాపాలు నిర్వహిస్తుండగా.. ఈ రెండు నగరాలు మినహా దేశమంతా బీఎస్‌ఎన్‌ఎల్ సేవలు అందిస్తున్నది.