USB-C Charging Port | స్మార్ట్ ఫోన్.. టాబ్లెట్ ఏదైనా ఒకే చార్జింగ్ పోర్ట్ వాడాల్సిందే.. ఈయూ బాటలో కేంద్రం..!
USB-C Charging Port: స్మార్ట్ ఫోన్ ఒక చార్జర్‌తో బ్యాటరీ చార్జింగ్ అయితే.. టాబ్లెట్ బ్యాటరీ మరో చార్జర్‌తో చార్జింగ్ అవుతుంది. దీనివల్ల ప్రతి ఒక్కరి వద్ద ఒకటి కంటే ఎక్కువ చార్జర్లు ఉండాల్సి వస్తోంది.
USB-C Charging Port | ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు మొదలు ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్లు, లాప్‌టాప్‌లు, టాబ్లెట్లు ఉండాల్సిందే. ఇవన్నీ బ్యాటరీ చార్జింగ్‌తో పని చేస్తుంటాయి. స్మార్ట్ ఫోన్ ఒక చార్జర్‌తో బ్యాటరీ చార్జింగ్ అయితే.. టాబ్లెట్ బ్యాటరీ మరో చార్జర్‌తో చార్జింగ్ అవుతుంది. దీనివల్ల ప్రతి ఒక్కరి వద్ద ఒకటి కంటే ఎక్కువ చార్జర్లు ఉండాల్సి వస్తోంది. ఒక్కోసారి ఇది ఇబ్బందికరంగా మారుతుంది. ఇదే పరిస్థితి తలెత్తడంతో రెండేండ్ల క్రితం 2022లో స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ల చార్జింగ్‌కు ఉమ్మడి యూఎస్బీ చార్జింగ్ పోర్ట్ మాత్రమే ఇవ్వాలని టెక్నాలజీ సంస్థలను ఆదేశిస్తూ యూరోపియన్ యూనియన్ (ఈయూ) నిబంధనలు ఖరారు చేసింది. అదే బాటలో కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో విక్రయించే స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ల చార్జింగ్ పోర్టులుగా `యూఎస్బీ టైప్-సీ పోర్టు`లను ప్రామాణికంగా వాడాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దేశంలో అమ్మే అన్ని రకాల టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లకు ఉమ్మడి చార్జింగ్ పోర్ట్ వాడటమే తప్పనిసరి లక్ష్యంగా కేంద్రం నిర్ధారణకు వచ్చినట్లు ప్రముఖ ఆంగ్ల వెబ్‌సైట్ ఓ వార్తా కథనం ప్రచురించింది. ఈ నిబంధన వచ్చే ఏడాది జూన్ నాటికి అమల్లోకి రానున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇదే నిబంధన లాప్‌టాప్‌లకూ వర్తింప జేసే అవకాశాలు ఉన్నాయి.
భారత్‌లో విక్రయించే స్మార్ట్ ఫోన్ల చార్జింగ్ పోర్టులను ప్రమాణీకరించాలని ఆయా ఫోన్ల ఉత్పత్తిదారులను కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ సూచించనున్నది. ఇదే నిబంధన లాప్‌టాప్‌లకూ వర్తింపజేయాలన్నా 2026 నాటికి అమలు చేస్తారని తెలుస్తోంది. అన్ని స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు.. తర్వాత లాప్‌టాప్‌లకు యూఎస్బీ టైప్-సీ కనెక్టర్ చార్జింగ్ పోర్ట్ తప్పనిసరి చేసే ఆలోచనలో కేంద్రం ఉంది. దీనికి మరో కారణం కూడా ఉంది. వేర్వేరు కేబుల్స్, అడాప్టర్ల వాడకంతో పెరుగుతున్న ఈ-వేస్ట్ తగ్గించడమే కేంద్రం నిర్ణయం వెనుక ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ప్రస్తుతం అత్యధిక ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లు యూఎస్బీ టైప్ సీ కనెక్టర్ వాడుతున్నారు. కొన్ని టాబ్లెట్లు, ఇతర విడి భాగాలు, వస్తువుల చార్జింగ్ కోసం మైక్రో యూఎస్బీ చార్జర్ వాడుతున్నారు. గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐ-ఫోన్ 15 సిరీస్ ఫోన్ల నుంచి న్యూ ఐపాడ్స్ వరకూ టైప్-సీ చార్జర్ వాడుతుండగా, మాక్‌బుక్‌కు మ్యాగ్ సేఫ్ చార్జింగ్ వినియోగిస్తున్నారు. కొన్ని మ్యాక్ బుక్స్ చార్జింగ్‌కు టైప్-సీ పోర్ట్‌కు మళ్లించారు. 2022 నుంచి మార్కెట్‌లోకి వస్తున్న అన్ని ఆపిల్ డివైజ్‌లకు యూఎస్బీ టైప్ సీ పోర్ట్ చార్జర్లను తప్పనిసరి వాడాల్సిందేనని ఈయూ తేల్చి చెప్పింది.
కేంద్రం కూడా భారత్‌లో అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలకు (స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు) యూఎస్బీ టైప్ సీ చార్జింగ్ పోర్ట్ తప్పనిసరి చేసే విషయమై 2022 నవంబర్‌లోనే కేంద్ర ప్రభుత్వం తొలిసారి చర్చించింది. ఇండస్ట్రీ అసోసియేషన్లు, విద్యా సంస్థలు, శాంసంగ్, ఆపిల్ వంటి ప్రముఖ బాండ్ల ప్రతినిధులు, వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖల ప్రతినిధులతో ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది. ఆపిల్, శాంసంగ్ కూడా ప్రమాణికంగా ఒకే చార్జింగ్ పోర్ట్ తెచ్చే యోచన చేస్తున్నాయి. రీ ఇంట్రడ్యూస్ చేసిన పాత ఐ-ఫోన్లకూ యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఏర్పాటు చేయాలని ఆపిల్ యాజమాన్యాన్ని కోరింది కేంద్రం.