ఫోన్‌పేలో చిన్న మొత్తాల పేమెంట్స్ ఇక చాలా ఈజీ.. అందుకు ఏం చేయాలంటే..!
యూపీఐ లైట్ ఫీచర్ యాక్టివేట్ చేసుకుంటే కేవలం సింగిల్ క్లిక్‌తోనే పిన్ నమోదు చేయకుండానే పేమెంట్స్ పూర్తి చేయొచ్చు. కానీ, ఫోన్‌పే వాలెట్‌లో కొంత మొత్తం జత చేయాలి.
ఇప్పుడంతా డిజిజల్‌మయం. అంతా ఆన్‌లైన్ సేవలే.. యుటిలిటీ సేవలు మొదలు చెల్లింపుల వరకు అంతా ఆన్‌లైన్‌లోనే సాగుతున్నాయి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, భారత్ పే చెల్లింపులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అన్ని రకాల సేవలకు యూపీఐ పేమెంట్స్ చార్జీల చెల్లింపులు సర్వ సాధారణం అయ్యాయి. చిన్న వస్తువు కొనుగోలు చేసినా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సరి.. సదరు మర్చంట్‌కు క్షణాల్లో చెల్లింపులు పూర్తవుతాయి. అయితే యూపీఐ పేమెంట్ చేయాలంటే.. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి.. మనం చెల్లించాల్సిన మొత్తం నమోదు చేసి పేమెంట్ ఆప్షన్ నొక్కేస్తే.. అటుపై పిన్ నమోదు చేయాలి.. అలా పిన్ ఎంటర్ చేస్తేనే యూపీఐ పేమెంట్స్ పూర్తవుతాయి.. కానీ ఇప్పుడు యూపీఐ పిన్ నమోదు చేయనవసరం లేకుండానే తేలిగ్గా పేమెంట్స్ జరుపవచ్చు. ఇందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సౌకర్యవంతమైన ఫీచర్ తెచ్చింది. అదే `యూపీఐ లైట్`. గత ఏడాది సెప్టెంబర్‌లోనే ఎన్పీసీఐ ప్రారంభించిన `యూపీఐ లైట్` ఫీచర్.. పేటీఎం తన యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. అదే బాటలో ఇప్పుడు ఫోన్ పే కూడా ప్రయాణిస్తోంది.
చిన్న మొత్తంలో డిజిటల్ పేమెంట్స్‌కు తెచ్చిన ఫీచరే యూపీఐ లైట్. డిజిటల్ పేమెంట్స్‌కు యూపీఐ పిన్ తప్పనిసరిగా నమోదు చేయాల్సిందే. కానీ యూపీఐ లైట్ ఫీచర్ యాక్టివేట్ చేసుకుంటే కేవలం సింగిల్ క్లిక్‌తోనే పిన్ నమోదు చేయకుండానే పేమెంట్స్ పూర్తి చేయొచ్చు. కానీ, ఫోన్‌పే వాలెట్‌లో కొంత మొత్తం జత చేయాలి. ఒకేసారి రూ.2000 వరకు గరిష్టంగా జత చేయవవచ్చు. అటుపై రూ.200 వరకు చెల్లింపులు సింగిల్ క్లిక్‌తోనే పూర్తి చేసేయొచ్చు. బ్యాంకింగ్ లావాదేవీల్లో అంతరాయం ఏర్పడినా పేమెంట్స్ చేసేయవచ్చు.
ఈ ఫీచర్ పొందాలని భావించే వారు ముందు ఫోన్‌పే యాప్ లేటెస్ట్ వర్షన్ వాడుతుండాలి. అందుకు ఫోన్ పే యాప్ తెరిచిన తర్వాత హోం స్క్రీన్ మీద వచ్చే `యూపీఐ లైట్` ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. అప్పుడు యూపీఐ లైట్ ఖాతాలో డిపాజిట్ చేయాలనుకున్న మొత్తం నమోదు చేసి బ్యాంక్ అకౌంట్ ఎంచుకోవాలి. అటుపై యూపీఐ పిన్ నమోదు చేసిన వెంటనే మీ `యూపీఐ లైట్` అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. తర్వాత ఏ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా పేమెంట్ పూర్తి చేసేయవచ్చు.