సాధారణ పలకరింపుల నుంచి సీక్రెట్స్ వరకూ ప్రతి చిన్న సమాచారం వాట్సాప్‌లోనే షేర్ చేస్తుంటారు చాలామంది. ఫొటో, వీడియో, ఆడియో, టెక్ట్స్ ఇలా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వాట్సాప్‌లో రకరకాల మెసేజ్‌లు షేర్ అవుతూ ఉంటాయి. అయితే వాట్సాప్‌లో ప్రతీ విషయాన్ని షేర్ చేయకూడదని, అలా చేస్తే చట్టపరంగా నేరంగా పరిగణిస్తారని మీకు తెలుసా? వాట్సాప్ గైడ్‌లైన్స్ ప్రకారం ఎలాంటి కంటెంట్‌ను షేర్ చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
వాట్సాప్ వాడే చాలామంది తమకు వచ్చే రకరకాల మెసేజ్‌లను పూర్తిగా చదవకుండా ఫార్వార్డ్ చేసేస్తుంటారు. వాటిలో మాల్‌వేర్ లేదా విద్వేషపూరితమైన సమాచారం ఉంటే, వాట్సాప్ గైడ్‌లైన్స్ ప్రకారం మీరు చిక్కుల్లో పడ్డట్లే. వాట్సాప్‌లో ఫార్వార్డ్ అయ్యే సమాచారం ద్వారా సైబర్ మోసాలకు, నకిలీ సమాచారానికి చెక్ పెట్టేందుకు వాట్సాప్ కొన్ని రూల్స్ పెట్టింది. కొన్ని కేటగిరీలకు చెందిన కంటెంట్‌ను ఇతరులతో షేర్ చేయకూడదని, అలా చేస్తే చట్టపరమై చర్యలు తీసుకునే అవకాశముందని పేర్కొంది.
అవేంటంటే..
పర్సనల్ ప్రైవసీ
ఇతరులకు తెలియకుండా వారి ఫొటోలు, వీడియోలు తీసి వాటిని వాట్సాప్‌లో షేర్ చేయడం ద్వారా సదరు వ్యక్తి ప్రైవసీని దెబ్బ తింటుంది. అందుకే ఇలాంటి మెసేజ్‌లను షేర్ చేయడం లేదా ఫార్వార్డ్ చేయడం లాంటివి చేయకూడదు. అలాగే సోషల్ మీడియాల్లో పోస్ట్ చేసే ఫొటో, వీడియోలను కూడా యూజర్ అనుమతి లేకుండా సేకరించడం నేరం. కాబట్టి ఎదుటి వాటి ప్రైవసీని దెబ్బ తీసే ఎలాంటి కంటెంట్‌ను వాట్సాప్‌లో షేర్ చేయకుండా జాగ్రత్తపడడం అవసరం.
అడల్ట్ కంటెంట్
వాట్సాప్ చాట్ లేదా గ్రూపుల్లో అడల్ట్ కంటెంట్‌ను షేర్ చేయడం కూడా చట్ట రీత్యా నేరమే. అలాంటి కంటెంట్ గురించి ఎవరైనా ఫిర్యాదు చేస్తే పోస్ట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అలాంటి సమాచారం వాట్సాప్‌లో ఎవరు షేర్ చేసినా వెంటనే దాన్ని డిలీట్ చేయాలి.
కాపీరైట్
కాపీరైట్ ఉన్న కంటెంట్‌ను వాట్సాప్‌లో షేర్ చేస్తే.. చిక్కుల్లో పడే ప్రమాదముంది. చదివేందుకు లేదా చూసేందుకు బావున్నాయని, వాటిని స్నేహితులకు ఫార్వార్డ్ చేస్తే సదరు వ్యక్తి లేదా సంస్థ మీకు కాపీరైట్ ఉల్లంఘన నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. అందుకే కాపీరైట్ కంటెంట్ జోలికి వెళ్లకపోవడమే మంచిది.
ఇవికూడా
ఇకపోతే హ్యాకింగ్, టెర్రరిజం, డార్క్ వెబ్, అసాంఘిక చర్యలకు సంబంధించిన కంటెంట్‌ను షేర్ చేసినా లేదా అలాంటి భావాలను ప్రోత్సహించేలా ఉండే కంటెంట్‌ను వాట్సాప్‌లో షేర్ చేయడం నేరం. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇలాంటి మెసేజ్‌లను గమనిస్తూ ఉంటుంది. అందుకే ఇలాంటి మెసేజ్‌లు వస్తే వాట్సాప్‌కు ఫిర్యాదు చేయాలి.