కొత్త స్మార్ట్‌ఫోన్ కొనడానికి ఇదే మంచి టైం! ఎందుకంటే..

ఈ ఏడాది జూన్‌ తర్వాత నుంచి స్మార్ట్‌ఫోన్ల ధరలుపెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Advertisement
Update:2024-02-09 15:07 IST

కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవాళ్లు వీలైనంత త్వరగా కొనడం బెస్ట్ అంటున్నారు నిపుణులు. ఎందుకంటే రానున్న రోజుల్లో స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరగబోతున్నాయట. మరిన్ని వివరాల్లోకి వెళ్తే.

ఈ ఏడాది జూన్‌ తర్వాత నుంచి స్మార్ట్‌ఫోన్ల ధరలుపెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకపక్క చైనా కరెన్సీ రేటుపెరగడంతోపాటు ప్రాసెసర్లు, మెమరీ చిప్‌సెట్ల రేట్లు కూడా పెరగనున్నాయట. రాబోయే కాలంలో ఫోన్ల రేట్లు ఎంత మేరకు పెరగొచ్చంటే.

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో లీడింగ్‌లో ఉన్న రెడ్‌మీ, వన్‌ప్లస్, వివో, ఒప్పో, రియల్‌మీ, ఐకూ, పోకో, మోటొరోలా వంటి బ్రాండ్స్ అన్నీ చైనాకు చెందినవే కావడంతో చైనీస్ ఎకానమీ ప్రభావం ఇక్కడి మొబైల్ రేట్లపై పడనుంది. కొన్ని రిపోర్ట్‌ల ప్రకారం రానున్న మూడు నాలుగు నెలల్లో మొబైల్ ఫోన్ల ధరలు 10 నుంచి 15 శాతం వరకూ పెరగొచ్చు.

మెమరీ చిప్స్‌ను తయారుచేసే శాంసంగ్, మైక్రాన్ సంస్థలు మార్చి నెలలో ధరలను 15 నుంచి 20శాతం పెంచాలని చూస్తున్నాయని తద్వారా అన్ని స్మార్ట్‌ఫోన్ల ధరలు 15 శాతం మేర పెరిగేందుకు అవకాశం ఉందని ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ ‘ట్రెండ్‌ఫోర్స్‌’ రిపోర్ట్‌లో వెల్లడైంది. మొబైళ్లతో పాటు స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్ ధరల్లో కూడా మార్పులుండొచ్చు. ఇదిలా ఉంటే చైనీస్ కరెన్సీ అయిన యువాన్ గతంలో కంటే మెరుగైన స్థానానికి పెరుగుతున్న కారణంగా కూడా ఈ ఏడాది జూన్ నుంచి దేశంలో స్మార్ట్‌ఫోన్ ధరలు పెరగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇకపోతే రీసెంట్‌గా ప్రభుత్వం స్మార్ట్ ఫోన్స్ విడి భాగాల దిగుమతిపై సుంకాన్ని తగ్గించింది. దాంతో కెమెరా లెన్స్, బ్యాక్ ప్యానెళ్లు, యాంటెన్నా, సిమ్ సాకెట్ల వంటి వాటి ధరలు కాస్త తగ్గనున్నాయి. దీనివల్ల మనదేశంలో తయారవుతున్న రెడ్‌మీ, లావా, శాంసంగ్, మోటొరోలా వంటి పలు బ్రాండ్ల ధరల పెరుగుదలలో కొంత మార్పు ఉంటుంది. అలాగే మొబైల్ రేట్లు పెంచడానికి బదులుగా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు గతంలో కంటే తక్కువ మెమరీ, స్టోరేజ్‌ ఆప్షన్స్ అందించే అవకాశం కూడా ఉంది. కాబట్టి కొత్తగా మొబైల్ కొనాలనుకునే వాళ్లు జూన్ నెలలోగా తీసుకోవడం మంచిదని నిపుణుల సలహా.

Tags:    
Advertisement

Similar News