OpenAI-Sam Altman | సంక్షోభంలో ఓపెన్ఏఐ.. ఆల్టమన్ ఉద్వాసనపై భగ్గుమన్న ఎగ్జిక్యూటివ్‌లు .. మాకుమ్మడి రాజీనామాలకు సై..!
OpenAI-Sam Altman | సరిగ్గా ఏడాది క్రితం కృత్రిమ మేధ ఆధారిత చాట్‌బోట్ చాట్‌జీపీటీ (ChatGPT) ఆవిష్కరణతో టెక్నాలజీ రంగంలో సంచలనాలకు కేంద్ర బిందువైన స్టార్టప్ ఓపెన్ ఏఐ (OpenAI).. ఇప్పుడు సంక్షోభంలో చిక్కుకుందా..? ఓపెన్ ఏఐ ఉద్యోగులంతా నిష్క్రమించనున్నారా.. ? అంటే అవుననే అంటున్నాయి సిలికాన్ వ్యాలీ వర్గాలు.
OpenAI-Sam Altman | సరిగ్గా ఏడాది క్రితం కృత్రిమ మేధ ఆధారిత చాట్‌బోట్ చాట్‌జీపీటీ (ChatGPT) ఆవిష్కరణతో టెక్నాలజీ రంగంలో సంచలనాలకు కేంద్ర బిందువైన స్టార్టప్ ఓపెన్ ఏఐ (OpenAI).. ఇప్పుడు సంక్షోభంలో చిక్కుకుందా..? ఓపెన్ ఏఐ ఉద్యోగులంతా నిష్క్రమించనున్నారా.. ? అంటే అవుననే అంటున్నాయి సిలికాన్ వ్యాలీ వర్గాలు. గతవారం ఉద్వాసనకు గురైన మాజీ సీఈఓ శామ్ ఆల్టమన్.. ఓపెన్ ఏఐ బిగ్ ఇన్వెస్టర్ `మైక్రోసాఫ్ట్ (Microsoft)`లో పని చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో దాదాపు ఓపెన్ ఏఐ ఉద్యోగులంతా వైదొలుగుతామని హెచ్చరించారు. శామ్ ఆల్టమన్ బాటలో ప్రయాణిస్తామని ప్రమాద ఘంటికలు మోగించారు. ప్రస్తుత బోర్డు సభ్యులందరూ రాజీనామా చేయకుంటే తామూ వైదొలగక తప్పదని కుండబద్ధలు కొట్టారు. దీంతో భారీ అంచనాలతో టెక్నాలజీ ప్రపంచంలోకి దూసుకొచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ఓపెన్ ఏఐ భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి.
ప్రస్తుతం ఓపెన్ ఏఐలో దాదాపు 770 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వారిలో 700 మందికి పైగా ఉద్యోగులు సంతకాలు చేసిన లేఖ.. ఓపెన్ ఏఐ బోర్డుకు సమర్పించారు. పోటీతత్వం లేని వ్యక్తులు, నిర్దేశిత లక్ష్యసాధన కోసం పని చేస్తున్న ఉద్యోగుల పట్ల శ్రద్ధ వహించని వారితో కలిసి పని చేయలేం అని ఆ లేఖలో పేర్కొన్నారు. మొత్తం బోర్డు సభ్యులు రాజీనామా చేయాలని, ఆల్టమన్‌ను తిరిగి సీఈఓగా నియమించాలని, లేని పక్షంలో ఉద్యోగులంతా మైక్రోసాఫ్ట్‌లో చేరిపోతారని లేఖలో స్పష్టం చేశారు. ఓపెన్ ఏఐ ఉద్యోగులందరికీ మంచి అవకాశాలు కల్పిస్తామని మాకు మైక్రోసాఫ్ట్ హామీ ఇచ్చింది అని కూడా తేల్చి చెప్పారు.
గతవారం సంస్థ సీఈఓ శామ్ ఆల్టమన్‌ను, బోర్డుతోపాటు సంస్థ అధ్యక్షుడిగా ఉన్న గ్రేగ్ బ్రాక్‌మన్‌ను బోర్డు నుంచి తప్పించి ఆల్టమన్‌కు ఉద్వాసన పలికింది ఓపెన్ ఏఐ. తొలుత ఆల్టమన్‌ను పునః నియమించాలని ఇన్వెస్టర్లు, టాప్ ఎగ్జిక్యూటివ్‌ల నుంచి వస్తున్న విజ్ఞప్తులు, ఒత్తిళ్లను ఓపెన్ ఏఐ నిర్లక్ష్యం చేయడంతో సంస్థ నుంచి మూకుమ్మడి వలస ముప్పు పొంచి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేసి, సొమ్ము చేసుకోవాలన్న శామ్ ఆల్టమన్ ప్రతిపాదనలతో విభేదించినందు వల్లే ఆయన్ను సీఈఓగా ఓపెన్ ఏఐ తొలగించినట్లు తెలుస్తున్నది.
శామ్ ఆల్టమన్ స్థానంలో తొలుత తాత్కాలిక సీఈఓగా నియమితులైన మీరా మురాటీ, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బ్రాడ్ లైట్‌క్యాప్, చీఫ్ స్ట్రాటర్జీ ఆఫీసర్ జాసోన్ క్యోన్ సహా టాప్ ఎగ్జిక్యూటివ్‌లు అంతా బోర్డుతో సంప్రదింపులు జరిపారు. ఆదివారం రాత్రి వరకూ ఆల్టమన్‌ను తిరిగి కంపెనీలోకి తేవడానికి శత విధాల ప్రయత్నించారు. కానీ, ఆచరణలో ఓపెన్ ఏఐ బోర్డు.. కంపెనీ తాత్కాలిక సీఈఓగా మాజీ ట్విచ్ సీఈఓ ఎమ్మెట్ షేర్‌ను నియమించింది. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అలర్టైంది. శామ్ ఆల్టమన్, ఓపెన్ ఏఐ కో-ఫౌండర్ గ్రేగ్ బ్రాక్‌మన్‌ను తమ కొత్త ఏఐ టీంకు సారథులుగా నియమించుకున్నది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచానికి కొత్త నిర్వచనం ఇస్తుందన్న అంచనాలు పెట్టుకున్న ఓపెన్ ఏఐ అంతర్గత సమస్యలు ఆందోళనకరంగా మారాయి. ఏడాది క్రితం చాట్‌బోట్ చాట్‌జీపీటీ ఆవిష్కరణతో ఓపెన్ఏఐ, శామ్ ఆల్టమన్ అందరి దృష్టిని ఆకర్షించారు. వ్యాపారాలు, కస్టమర్ల లావాదేవీల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ విభాగాన్ని నియమించుకోవాలన్న టెక్నాలజీ పరిశ్రమ ప్రయత్నాలకు ఓపెన్ ఏఐ కేంద్రమైంది. ఈ టెక్నాలజీకి రక్షణ కవచాల కల్పన, రెగ్యులేటర్ల అనుమతుల సాధనపైనా టెక్నాలజీ ప్రపంచం దృష్టి పెట్టింది. కానీ ఓపెన్ ఏఐలో ఉద్రిక్తతలు ఒక ఏఐ ఆధారిత స్టార్టప్‌లు సమతుల్యత పాటిస్తాయా? అన్న అనుమానాలకు తావిస్తోంది.
ఓపెన్ ఏఐలో సంక్షోభాన్ని ఇతర టెక్ కంపెనీలు సొమ్ము చేసుకోవడానికి సిద్ధం అయ్యాయి. అత్యంత పోటీతత్వంతో కూడిన ఏఐ ప్రతిభాపాటవాలు గల ఎగ్జిక్యూటివ్‌లకు ఆఫర్లు వస్తున్నాయి. రాజీనామాలు చేసిన ఓపెన్ ఏఐ ఎగ్జిక్యూటివ్‌లకు సేల్స్ పోర్స్ సీఈఓ మార్క్ బెనీయాఫ్ ఉద్యోగాలు ఆఫర్ చేశారు. ఓపెన్ ఏఐని వీడిన ఎగ్జిక్యూటివ్‌కు అదే వేతన ప్యాకేజీ కల్పిస్తామని `ఎక్స్ (ట్విట్టర్)`లో పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే బోర్డు నిర్ణయాల్లో భాగస్వామినైనందుకు విచారం వ్యక్తం చేస్తున్నానంటూ సంస్థ చీఫ్ సైంటిస్ట్, కో-ఫౌండర్ ఐల్యా సుట్‌స్కేవర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఏఐ టూల్ నిర్మాణంలో భాగస్వాములందరినీ ప్రేమిస్తున్నా, ఓపెన్ ఏఐకి ముప్పు తేవాలని ఏనాడు భావించలేదు. కంపెనీ రీ యూనైట్ చేయడానికి చేయాల్సిందంతా చేస్తా అని సుట్‌స్కేవర్ పోస్ట్ చేశారు.