వాయేజర్‌-2‌‍ మళ్ళీ దారికొచ్చింది

అనంత విశ్వంలో దాగి ఉన్న రహస్యాల గుట్టు విప్పడమే లక్ష్యంగా 1977లోనే అమెరికా వాయేజర్-1, వాయేజర్-2 అనే రెండు అంతరిక్ష నౌకలను అమెరికా ప్రయోగించింది.

Advertisement
Update:2023-08-02 11:18 IST

అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) నాలుగు దశాబ్దాల క్రితం ప్రయోగించిన అద్భుత వ్యోమనౌక వాయేజర్‌. భూమి నుంచి వందల కోట్ల కిలోమీటర్ల దూరంలో సౌర కుటుంబం అవతల పయనిస్తున్న అమెరికా వ్యోమనౌక వాయేజర్‌-2‌‍ నుంచి తిరిగి సంకేతాలు రావడం మొదల‌య్యాయి. రెండు వారాల క్రితం రాంగ్ కమాండ్స్‌ వల్ల ఈ వ్యోమనౌక యాంటెన భూమి దిశగా కాకుండా వేరే వైపునకు మళ్లింది. దీంతో భూకేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. అయితే ఇప్పుడు అంతా సర్దుకుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(NASA) ప్రకటించింది.

రోదసి పరిశోధనల్లో అన్ని దేశాలను వెనక్కి నెట్టి ముందున్న దేశం అమెరికా. ఖగోళ రహస్యాల ఆవిష్కరణల్లో అగ్రగామి ఇక్కడి అంతరిక్ష పరిశోధన సంస్థ. అనంత విశ్వంలో దాగి ఉన్న రహస్యాల గుట్టు విప్పడమే లక్ష్యంగా 1977లోనే అమెరికా వాయేజర్-1, వాయేజర్-2 అనే రెండు అంతరిక్ష నౌకలను ప్రయోగించింది. ప్రయోగించి నాలుగు దశాబ్దాలు అయిన అవి ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నాయి. అయితే రెండు వారాల క్రితం వాయేజర్-2 నౌకకు అధికారులు పొరపాటున తప్పుడు ఆదేశం ఇచ్చారు. ఫలితంగా దీని యాంటెన భూమి దిశగా కాకుండా వేరే వైపున‌కు తిరిగిపోయింది. దీంతో భూ కేంద్రంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అయితే నాసాకు ప్రపంచంలో పలు చోట్ల భారీ రేడియో యాంటెనాలు ఉన్నాయి. వాటికి తాజాగా వాయేజర్‌-2 నుంచి సంకేతం అందింది. దీంతో 46 ఏళ్ల నాటి ఆ వ్యోమనౌక ఇంకా పనిచేస్తోందని స్పష్టమవుతున్నట్లు నాసా పేర్కొంది. ఇప్పుడు ఆ వ్యోమనౌక యాంటెనాను తిరిగి భూమి వైపునకు తిప్పడానికి ప్రయత్నిస్తామని తెలిపింది.



వాయేజర్ మిష‌న్‌ను ప్రాథమికంగా బాహ్య గ్రహాల అధ్యయనం కోసం నాసా చేపట్టింది. గురు, శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాల చుట్టూ ఉన్న వలయాలను వాయేజర్-1, 2 జంట నౌకలు అన్వేషించాయి. వాయేజర్-2 నౌక ఇప్పటికీ అంతరిక్షంలో ప్రయాణిస్తూనే ఉంది. ఈ స్పేస్ క్రాఫ్ట్ సూర్యుడ్ని కూడా దాటిపోయింది. మన సౌర వ్యవస్థ ప్రభావం ఏమాత్రం లేని శూన్యంలో ప్రయాణిస్తోంది. వాయేజర్‌-2 ప్రస్తుతం 19.9 బిలియన్‌ కిలోమీటర్ల దూరంలో ఉంది. అది పంపే సంకేతాలు భూమికి చేరడానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. భూమి నుంచి ఏదైనా సిగ్నల్ పంపితే, ఈ నౌకను చేరుకోవడానికి ఒకటిన్నర రోజు సమయం పడుతోంది.

ఇక వాయేజర్- 1నౌక ప్రస్తుతం భూమి నుంచి 24 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. భూమి నుంచి అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించిన వ్యోమ నౌక ఇది. ఇది 2012 ఆగస్టులోనే సౌర వ్యవస్థను దాటింది. ఇప్పటికీ పని చేస్తూనే ఉంది. ఒక మానవ నిర్మిత అంతరిక్ష సాధనం తొలిసారిగా సౌర వ్యవస్థను దాటి రెండు నక్షత్రాల మధ్య ప్రాంతంలోకి ప్రవేశించడం వాయేజర్- 1తోనే సాధ్యం అయ్యింది.

Tags:    
Advertisement

Similar News