ఎలన్‌మస్క్ ట్విట్టర్‌కు షాక్.. `థ్రెడ్స్`ప్రారంభించిన మెటా..
మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ అధినేత ఎలన్‌మస్క్‌కు ఫేస్‌బుక్ మాతృ సంస్థ `మెటా` గట్టి షాక్ ఇచ్చింది.
మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ అధినేత ఎలన్‌మస్క్‌కు ఫేస్‌బుక్ మాతృ సంస్థ `మెటా` గట్టి షాక్ ఇచ్చింది. ట్విట్టర్‌కు పోటీగా మెటా `థ్రెడ్స్` యాప్ తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్, ఐఎఓస్ వర్షన్లలో గురువారం 100 దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. మార్కెట్లోకి ఆవిష్కరించిన రెండు గంటల్లోనే 20 లక్షల మందికి పైగా యూజర్లు సబ్‌స్క్రైబర్లు అయ్యారు. తొలి నాలుగు గంటల్లో 50 లక్షలకు పెరిగిందని మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. టెక్ట్స్ ఆధారిత యాప్ `థ్రెడ్స్` .. మెటా అనుబంధ `ఇన్‌స్టాగ్రామ్` తెచ్చింది. `థ్రెడ్స్ ఒక న్యూ యాప్. దీన్ని ఇన్‌స్టాగ్రామ్ టీం రూపొందించింది. ప్రజల చర్చల్లో భాగస్వామ్యానికి, టెస్ట్ అప్‌డేట్ షేర్ చేయడానికి ఈ యాప్ ఉపకరిస్తుంది` అని బుధవారం మెటా తన బ్లాగ్ పోస్ట్‌లో రాసింది. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాతోనే `థ్రెడ్స్` యాప్ ఖాతాలో లాగిన్ కావచ్చు. లింక్స్, ఫొటోలతోపాటు 500 క్యారక్టర్ల వరకు టెక్ట్స్ మెసేజ్, 5 నిమిషాల నిడివి గల వీడియోలు అప్‌లోడ్ చేయొచ్చు.
`మీ మనస్సుల్లో ఉన్న ఆలోచనలపై చర్చించడానికి, టెక్స్ట్ ద్వారా సమాచారం, ఐడియాలు షేర్ చేసుకోవాలన్న విజన్‌కి అనుగుణంగా ఇన్‌స్టాగ్రామ్ కొత్త యాప్ పని చేస్తుంది. ప్రపంచానికి స్నేహపూర్వక సమాజం కావాలి. థ్రెడ్స్‌లో భాగస్వాములైన మీ అందరికీ ధన్యవాదాలు` అని మెటా ఫౌండర్, సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు.
వంద కోట్ల మంది యూజర్లతో ఒక పబ్లిక్ కన్జర్వేషన్ యాప్ ఉండాలన్నారు. ట్విట్టర్‌కు ఆ అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేదని జుకర్‌బర్గ్ తెలిపారు. తాము ఈ ఘనత సాధిస్తామని విశ్వసిస్తున్నామని అన్నారు. ట్విట్టర్‌ను థ్రెడ్స్ మించి పోవడానికి కొంత టైం పట్టొచ్చునని వ్యాఖ్యానించారు.
ఇన్‌స్టాగ్రామ్ మాదిరిగానే.. ఇన్‌స్టా, థ్రెడ్స్ యూజర్లు కూడా స్నేహితులతో ఫాలో అవుతూ కనెక్ట్ కావచ్చు. వారి ఆలోచనలు, ప్రయోజనాల గురించి షేర్ చేసుకోవచ్చు. 16 ఏండ్లలోపు (భారత్ వంటి దేశాల్లో 18 ఏండ్ల లోపు యువకులు) పిల్లలకు థ్రెడ్స్‌లో ఖాతా తెరవడానికి అనుమతి లేదు. థ్రెడ్స్‌లో యూజర్లు తాము ప్రస్తావించిన అంశాలపై కంట్రోల్ కలిగి ఉండొచ్చు. థ్రెడ్స్ పరిధిలోనే సమాధానం ఇవ్వవచ్చు. థ్రెడ్స్ యూజర్లు తమకు నచ్చని వారిని అన్‌ఫాలో చేయొచ్చు. బ్లాక్ చేయవచ్చు. ఆంక్షలు పెట్టొచ్చు. మూడు డాట్‌ల మెనూ టైప్ చేస్తే చాలు ఇతరుల ఖాతాలు ఆటోమేటిక్‌గా బ్లాక్ అవుతాయి. ఇదిలా ఉంటే యూరప్ దేశాల్లో రెగ్యులేటరీ నిబంధనల వల్ల ఆయా దేశాల్లో థ్రెడ్స్ యాప్ ప్రారంభించడం లేదని తెలుస్తోంది.