సరికొత్త ఛార్జర్ స్కామ్.. కేబుల్‌తో డేటా చోరీ! జాగ్రత్తలు ఇలా..

జ్యూస్ జాకింగ్ బారిన పడకుండా ఉండాలంటే ఎప్పుడూ మీ సొంత చార్జర్‌‌నే ఉపయోగించాలి. బహిరంగ ప్రదేశాల్లోని ఛార్జింగ్ పోర్ట్‌లకు మీ మొబైల్ కనెక్ట్ చేయొద్దు.

Advertisement
Update:2024-04-02 07:16 IST

సైబర్ స్కామ్‌ల్లో రోజుకో కొత్త రకం పుట్టుకొస్తుంది. ఆన్‌లైన్ ద్వారానే కాకుండా ఆఫ్‌లైన్ ద్వారా కూడా డేటా చోరీలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం ఛార్జర్ స్కామ్ అనే కొత్తరకం మోసం వెలుగులోకి వచ్చింది. ఇదెలా ఉంటుందంటే..

ఆన్‌లైన్ ద్వారా డేటా చోరీ చేయడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈసారి నేరగాళ్లు ఓ విన్నూత్నమైన స్కామ్‌కు తెరలేపారు. ఛార్జింగ్ పెట్టుకునే డేటా కేబుల్ ద్వారా డేటాను దొంగిలించే కొత్త విధానాన్ని కనుగొన్నారు. దీనికోసం కేబుల్స్, ఛార్జర్స్‌లో ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్స్ అమర్చి మోసం చేస్తున్నారు.

మొబైల్ వాడేవాళ్లకు ఛార్జింగ్ అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణాలు చేసేవాళ్లు ఫోన్‌లో బ్యాటరీ అయినప్పుడు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్స్ వంటి ప్రాంతాల్లో ఛార్జింగ్ పెట్టుకుంటుంటారు. దీన్ని అదనుగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా స్కామ్ అమలు చేస్తున్నారు. పబ్లిక్ ప్లేసుల్లోని ఛార్జింగ్ పాయింట్స్‌లో ముందుగానే హ్యాకింగ్ సాఫ్ట్‌వేర్స్ అమర్చిన ఛార్జర్స్, కేబుల్స్ పెట్టి వదిలేస్తున్నారు. ఎవరైనా బద్ధకించి సొంత ఛార్జర్‌‌కు బదులుగా వాటితో ఛార్జింగ్ పెట్టుకుంటే ఇక అంతే. ఆ డేటా కేబుల్ ద్వారా మొబైల్‌లోని డేటా అంతా హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతుంది. దీన్నే ‘జ్యూస్ జాకింగ్’ అని కూడా అంటారు.

ఇలా జ్యూస్ జాకింగ్ ద్వారా డేటాని దొంగలించి ఆ తర్వాత డబ్బులు ఇవ్వాలని బెదిరించడం లేదా బ్యాంకింగ్ డీటెయిల్స్ హ్యాక్ చేయడం వంటివి చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఈ తరహా కేసులు ఎక్కువైనట్టు సైబర్ పోలీసులు చెప్తున్నారు. ఇలాంటి మోసాల బారిన పడకుండా జాగ్రత్తపడాలని సూచిస్తున్నారు.

జ్యూస్ జాకింగ్ బారిన పడకుండా ఉండాలంటే ఎప్పుడూ మీ సొంత చార్జర్‌‌నే ఉపయోగించాలి. బహిరంగ ప్రదేశాల్లోని ఛార్జింగ్ పోర్ట్‌లకు మీ మొబైల్ కనెక్ట్ చేయొద్దు. పవర్ బ్యాంక్‌ల వంటివి వాడితే ఇంకా సేఫ్‌గా ఉండొచ్చు. ఒకవేళ మీ మొబైల్ హ్యాక్‌కు గురైనా, సైబర్ మోసాల బారిన పడినా వెంటనే సైబర్ క్రైమ్ పోర్టల్(cybercrime.gov.in)లో కంప్లెయింట్ చేయాలి.

Tags:    
Advertisement

Similar News