మీరు ఎంతసేపు ఫోన్ వాడుతున్నారో ఇలా చెక్ చేసుకోవచ్చు!
రోజుకు మూడు గంటలకు మించి మొబైల్ వాడితే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని డాక్టర్లు చెప్తున్నారు.
ఎంత వద్దనుకున్నా మొబైల్‌కు దూరంగా ఉండడం ఇప్పటిరోజుల్లో అసాధ్యం అనే చెప్పాలి. అయితే ఇప్పుడిది మితిమీరి మొబైల్ అడిక్షన్‌లా మారిపోతోంది. రోజుకు మూడు గంటలకు మించి మొబైల్ వాడితే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని డాక్టర్లు చెప్తున్నారు. మరి మీరు రోజుకు ఎంత సేపు మొబైల్ వాడుతున్నారో ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా?
ఫ్రెండ్స్, ఫ్యామిలీతో మాట్లాడడం.. వార్తలు, సినిమాలు చూడడం.. సోషల్ మీడియా, పేమెంట్స్.. ఇలా రకరకాల పనులకు మొబైల్ ఉపయోగించక తప్పదు. అయితే దీనికోసం స్పెండ్ చేస్తున్న టైం ఎంత అనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది. రోజుకి మూడు గంటలకు మించి మొబైల్ వాడేవాళ్లు క్రమంగా డిజిటల్ డీటాక్స్‌ను అలవాటు చేసుకోవాలని డాక్టర్లు చెప్తున్నారు. డిజిటల్ డీటాక్స్ మొదలుపెట్టాలంటే ముందుగా మొబైల్‌లో ఏరోజుకారోజు స్క్రీన్ టైంను చెక్ చెసుకుంటూ ఉండాలి.
స్క్రీన్ టైం తెలుసుకోవడం కోసం ముందుగా మొబైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. అక్కడ ‘డిజిటల్ వెల్‌బీయింగ్ అండ్ పేరెంటల్ కంట్రోల్స్’ ఆప్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ మీ టోటల్ స్క్రీన్ టైంతో పాటు ఏ యాప్‌కు ఎంత సమయం కేటాయిస్తున్నారో కూడా తెలుస్తోంది.
ఆ ఛార్ట్‌పై క్లిక్ చేస్తే.. పూర్తి డ్యాష్ బోర్డ్ కనిపిస్తుంది. ఏరోజు ఎంత సమయం మొబైల్‌లో గడిపారో కూడా చూపిస్తుందో.. యావరేజ్‌న రోజుకు నాలుగైదు గంటల స్క్రీన్ టైం ఉన్నవాళ్లు.. స్క్రీన్ టైంను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. దీనికోసం ‘సెట్ టైం ఫర్ యాప్స్’ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. డ్యాష్ బోర్డ్ కింద ఉండే ఆ ఆప్షన్‌ను ఎంచుకుని ఒక్కో యాప్‌కు ఎంత సమయం కేటాయించాలనుకుంటున్నారో టైం సెట్ చేస్తే.. అంత సమయం పూర్తవ్వగానే మొబైల్ నోటిఫికేషన్ ఇస్తుంది. ఉదాహరణకు.. మెసేజ్ చదువుదామని ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి.. రీల్స్ చూస్తూ గంటల కొద్దీ అందులో లీనమైపోతుంటారు చాలామంది. ఇలాంటివాళ్లు ఇన్‌స్టాగ్రామ్‌కు కొంత టైం సెట్ చేసుకుంటే ఆ టైం అవ్వగానే రిమైండర్ పొందొచ్చు. ఇలా సెట్టింగ్స్ సాయంతో డిజిటల్ డీటాక్స్‌ను మొదలుపెట్టొచ్చు.