మీకు స్మార్ట్‌ఫోన్ అడిక్షన్ ఉందా? ఇలా చెక్ చేసుకోండి!
ఈ దశాబ్దపు అతిపెద్ద వ్యసనాల్లో స్మార్ట్ ఫోన్ వ్యసనం ముందుందని స్టడీలు చెప్తున్నాయి.
ఈ దశాబ్దపు అతిపెద్ద వ్యసనాల్లో స్మార్ట్ ఫోన్ వ్యసనం ముందుందని స్టడీలు చెప్తున్నాయి. టీనేజీ పిల్లల నుంచి యూత్ వరకూ రోజుకి గంటల తరబడి మొబైల్‌లో మునిగిపోతున్నారు. దీనివల్ల యాంగ్జైటీ, యాంగర్ ఇష్యూస్‌తో పాటు ప్రొడక్టివిటీ, రిలేషన్స్ వంటివి దెబ్బతింటున్నాయి.
స్మార్ట్‌ఫోన్‌ను మీరు వాడుకుంటే పర్వాలేదు. కానీ అది మిమ్మల్ని వాడుకుంటే నష్టపోక తప్పదు. అయితే ఎవరు ఏ మేరకు ఫోన్‌కు అడిక్ట్ అయ్యారన్ని విషయాన్ని కొద్దిపాటి సెల్ఫ్ చెక్‌తో తెలుసుకోవచ్చు. ఎలాగంటే..
సెల్ఫ్ చెక్ ఇలా..
కాసేపు ఫోన్ కనిపించకపోతే ఒత్తిడికి లోనవ్వడం, కంగారు పడడం లాంటి లక్షణాలు మీలో ఉంటే మీరు ఫోన్‌కు బానిస అయినట్టు గుర్తించాలి.
అవసరం ఉన్నాలేకపోయినా ఐదు నిమిషాలకోసారి ఫోన్ చెక్ చేసుకోవడం. ఫోన్‌లో వచ్చే ప్రతి నోటిఫికేషన్‌ను చదవడం, తరచూ మెసేజ్‌లు చెక్ చేయడం వంటివి కూడా అడిక్షన్ లక్షణాలే.
వీటితోపాటు అదేపనిగా సోషల్ మీడియాలో గడపడం, పోస్టులు పెట్టడం, కామెంట్లు చదవడం, రీల్స్ స్క్రోల్ చేస్తూ టైం మర్చిపోవడం, మిడ్ నైట్ వరకూ మేల్కొని ఉండడం, లేవగానే ఫోన్ చెక్ చేసుకోవడం.. ఇలాంటి లక్షణాలు ఉంటే మీరు ఫోన్‌కు బానిస అయ్యారని తెలుసుకోవాలి.
నష్టాలివీ..
ఈ తరహా అడిక్షన్ వల్ల ఏకాగ్రత పూర్తిగా తగ్గిపోతుంది. ఏ పని మీదా ఫోకస్ కుదరదు. అనుకున్నది జరగకపోతే వెంటనే కోపం, డిప్రెషన్ వంటివి వస్తాయి. బయట వ్యక్తులతో సరిగా కమ్యూనికేట్ చేయలేరు. ‘నా ప్రపంచం వేరు.. నా ఆలోచనలు వేరు’ అన్నట్టు తయారవుతారు. ఈ ధోరణి క్రమంగా మానసిక కుంగుబాటుకి దారి తీస్తుంది. దీంతోపాటు సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ ఉండడం ఇంటర్నెట్ ఎక్కువగా వాడడం ద్వారా పర్సనల్ ప్రైవసీకి ముప్పు ఏర్పడ్డం ఖాయం. సైబర్ మోసాల బారిన పడుతున్నవాళ్లలో సోషల్ మీడియాను అతిగా వాడతున్న వాళ్లే ఎక్కువ.
చెక్ పెట్టండిలా..
ముందుగా రోజుకి కొంత టైం మొబైల్ లేకుండా గడపడం అలవాటు చేసుకోవాలి. దీన్నే ‘డిజిటల్ డీటాక్స్’ అంటారు. ముందు గంటతో మొదలుపెట్టి ఆ సమయాన్ని పెంచుకుంటూ పోవాలి.
ఏమీ తోచనప్పుడు అవుట్‌డోర్ గేమ్స్ ఆడడం, పుస్తకాలు చదవడం, బయటకు వెళ్లడం, వంట చేయడం.. ఇతర హాబీస్ ఏవైనా ట్రై చేయొచ్చు.
మొబైల్‌లో అవసరం లేని యాప్స్, గేమ్స్, సోషల్ మీడియా యాప్స్ డిలీట్ చేయాలి. అలర్ట్‌లు, నోటిఫికేషన్లు డిజేబుల్ చేయాలి. మీకు కావాలనుకున్నప్పుడు మొబైల్ చూడాలే తప్ప మొబైల్ మిమ్మల్ని పిలవకుండా చూసుకోవాలి.
సోషల్ మీడియా కోసం యాప్స్‌కు బదులు నేరుగా వెబ్‌సైట్స్ యూజ్ చేయాలి. తద్వారా రోజులో కొంత టైం మాత్రమే వాటిని చూసే వీలుంటుంది.
ఉదయాన్నే లేచిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ చూడకూడదు. అలాగే భోజనం చేసేటప్పుడు, నిద్రకు ముందు కూడా మొబైల్‌ను పక్కన పెట్టేయడం అలవాటు చేసుకోవాలి.
స్క్రీన్ టైం యాప్స్ ద్వారా రోజుకు ఎంత టైం ఫోన్ వాడుతున్నారో టైం ట్రాక్ చేసుకోవాలి. క్రమంగా దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. రోజుకి మూడు గంటల లోపు స్క్రీన్ టైం ఉంటే మంచిదని నిపుణుల సలహా.