నేడు చంద్రుని కక్ష్యలోకి..
అంతా సజావుగా సాగితే ఆగస్టు 23న సాయంత్రం 5 గంటల 47 నిమిషాలకు చంద్రుడిపై ల్యాండర్ అడుగుపెట్టనుంది.
జాబిల్లి దక్షిణ ధ్రువంపై పరిశోధనలకు ఇస్రో పంపిన చంద్రయాన్-3 మరో కీలక ఘట్టానికి చేరువైంది. భూమి చుట్టూ పలుమార్లు తిరిగి ప్రస్తుతం ట్రాన్స్ లూనార్ మార్గంలో పయనిస్తున్న చంద్రయాన్-3 నేడు జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించనుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను రాత్రి 7 గంటల సమయంలో ఇస్రో చేపట్టనుంది. ఈ నెల 23వ తేదీ సాయంత్రం జాబిల్లిపై ల్యాండర్ అడుగుపెట్టనుంది. అందులోంచి రోవర్ బయటకు వచ్చి చంద్రునిపై పరిశోధనలు చేయనుంది.
చంద్రుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన చంద్రయాన్-3 మిషన్.. మరో కీలక ఘట్టానికి చేరువైంది. ఇప్పటికే భూమి చుట్టూ కక్ష్యలను పూర్తిచేసుకుని జాబిల్లి వైపు దూసుకెళ్తోన్న ఈ వ్యౌమనౌక.. నేడు చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. చంద్రయాన్-3ని చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు ఇవాళ రాత్రి 7 గంటల సమయంలో చేపట్టనున్నారు. ఈ వ్యోమనౌక తన ప్రయాణంలో మూడింట రెండొంతులకుపైగా పూర్తి చేసుకున్నట్లు ఇస్రో వెల్లడించింది.
చంద్రయాన్-3ని జులై 14న ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్ ద్వారా విజయవంతంగా భూకక్ష్యలో ఇస్రో ప్రవేశపెట్టింది. మరుసటిరోజు తొలిసారిగా దీని కక్ష్యను పెంచారు. ఇలా 18 రోజుల వ్యవధిలో దశలవారీగా అయిదుసార్లు కక్ష్యను పెంచారు. అయిదో భూకక్ష్య పూర్తయిన అనంతరం.. ఆగస్టు 1న ట్రాన్స్ లూనార్ మార్గంలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఈ వ్యోమనౌక ప్రస్తుతం చంద్రుడి దిశగా ప్రయాణిస్తోంది. ఈ క్రమంలోనే నేడు చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. అంతా సజావుగా సాగితే ఆగస్టు 23న సాయంత్రం 5 గంటల 47 నిమిషాలకు చంద్రుడిపై ల్యాండర్ అడుగుపెట్టనుంది.
చంద్రయాన్-2 ప్రయోగంలో జాబిల్లిపై ల్యాండర్‌ను మృదువుగా దించడంతో ఇస్రో వైఫల్యం చవిచూసింది. ఆ పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుని చంద్రయాన్-3ని ఇస్రో ప్రయోగించింది. చందమామ ఉపరితలంపై సురక్షితంగా, మృదువుగా ల్యాండ్ అయ్యే సామర్థ్యం భారత్‌కు ఉందని చాటడం, జాబిల్లిపై రోవర్‌ను నడపగలమని రుజువు చేయడం, చంద్రయాన్-3లోని పరికరాల ద్వారా.. చంద్రుడి ఉపరితలంపై అక్కడికక్కడే శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించడం ఇస్రో లక్ష్యాలుగా ఉన్నాయి. ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన దేశంగా అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ నిలవనుంది.