విదేశాల నుంచి ఐఫోన్స్ తెప్పించుకునే వాళ్లు ఇవి తెలుసుకోండి!
యాపిల్ ఫోన్ వాడాలని చాలామందికి కోరిక ఉంటుంది. అయితే ఇండియాలో ఐఫోన్ కొనాలంటే లక్షలు పోయాల్సిందే. అందుకే ధర తగ్గుంతుందన్న ఉద్దేశంతో చాలామంది అమెరికా నుంచి ఐఫోన్స్ తెప్పించుకుంటుంటారు.
యాపిల్ ఫోన్ వాడాలని చాలామందికి కోరిక ఉంటుంది. అయితే ఇండియాలో ఐఫోన్ కొనాలంటే లక్షలు పోయాల్సిందే. అందుకే ధర తగ్గుంతుందన్న ఉద్దేశంతో చాలామంది అమెరికా నుంచి ఐఫోన్స్ తెప్పించుకుంటుంటారు. అయితే ఐఫోన్ 15 సిరీస్ విషయంలో అమెరికన్ ఫోన్స్‌తో కొన్ని ఇబ్బందులున్నాయి. అవేంటంటే..
ఐఫోన్ 15 ప్రో ధర భారత్‌లో రూ. 1,34,900 ఉంది. అదే ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ అయితే రూ. 1,59,900 ఉంది. అందుకే చాలామంది అమెరికా, దుబాయ్‌లో ఉన్న బంధువుల, స్నేహితులతో ఐఫోన్ తెప్పించుకోవాలనుకుంటారు. అయితే విదేశాల్లో లభించే ఐఫోన్‌లతో ఇక్కడ కొన్ని సమస్యలున్నాయి. ముఖ్యంగా అబ్రాడ్‌లో దొరికే ఐఫోన్స్‌లో ఫిజికల్ సిమ్ స్లాట్ ఉండదు. అమెరికాలో యాపిల్ కంపెనీ ఫిజికల్ స్లిమ్ స్లాట్‌ను ఆపేసింది. కాబట్టి లేటెస్ట్ యాపిల్ ఐఫోన్ 15, ఐఫోన్ 15ప్రోలలో ఇ–సిమ్ మాత్రమే ఉంటుంది. అలాగే యూరప్, దుబాయ్ వంటి దేశాల్లో లభించే ఫోన్లకు సింగిల్ సిమ్ స్లాట్ మాత్రమే ఉంటుంది. విదేశాల నుంచి ఐఫోన్లు తెప్పించుకునేముందు ఈ విషయాలు గమనించుకోవాలి. మనదేశంలో దొరికే ఐఫోన్‌లో ఒక ఫిజికల్ సిమ్, ఒక ఇ–సిమ్ ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ రెండు ఫిజికల్ సిమ్ స్లాట్లు కావాలంటే హాంకాంగ్ నుంచి ఐఫోన్ తెప్పించుకోవచ్చు.
ఇకపోతే విదేశాల నుంచి తెప్పించుకున్న ఐఫోన్‌లకు ఇంటర్నేషనల్ వారెంటీ ఉందో లేదో చూసుకోవాలి. వారెంటీ లేకపోతే.. ఫోన్‌లో సమస్య వచ్చినప్పుడు చాలా ఖర్చు పెట్టి సర్వీస్ చేయించుకోవాల్సి వస్తుంది. అలాగే విదేశాల నుంచి మొబైల్స్ తెప్పించుకునే ముందు ఫ్యాక్టరీ లాక్ లేని మొబైల్స్‌ను తీసుకోమని బంధువులకు చెప్పాలి. విదేశాల్లో అచ్చం ఐఫోన్‌లా కనిపించే ఫేక్ మోడల్స్ కూడా అమ్ముతుంటారు. కాబట్టి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని సరైన ప్రొడక్ట్ తీసుకోవాలి.
ఇదిలా ఉంటే లేటెస్ట్ ఐఫోన్ 15 మోడల్స్‌లో రకరకాల సమస్యలు వస్తున్నట్టు ఐఫోన్ యూజర్లు ఎక్స్(ట్విటర్)లో పోస్టులు చేస్తున్నారు. గేమ్స్ ఆడుతున్నప్పుడు, వీడియో కాల్ చేస్తున్నప్పుడు, ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఫోన్ వెనుక భాగం విపరీతంగా వేడెక్కుతుందని కంప్లెయింట్ చేస్తున్నారు. కాబట్టి ఫోన్ హీట్ అయిన సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో స్పష్టంగా తెలుసుకుని మొబైల్ వాడడం మంచిది.