ఈ అలవాట్లు మీ పేగుల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి.. కాస్త జాగ్రత్తగా ఉండండి

ప్రతీ రోజు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా మంచిది. అలాగే నిద్రపోయే ముందు కొద్దిగా త్రిఫల చూర్ణాన్ని నీటిలో వేసుకొని తాగితే పేగులు శుభ్రమవుతాయి.

Advertisement
Update:2022-10-06 07:11 IST

గట్ హెల్త్ (పేగుల ఆరోగ్యం) మనకు చాలా కీలకం. మనం తిన్న ఆహారం అరిగి.. అందులోని శక్తి రక్తంలో కలిసేది పేగుల ద్వారానే. అందుకే పొట్ట, పేగుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మన పొట్టకు ఏ మాత్రం అసౌకర్యం కలిగినా అది మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పేగులు శుభ్రంగా లేక ఇన్‌ఫెక్షన్‌కు గురైతే తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాదు. మన ఆహారపు అలవాట్లు, జీవిన శైలి, వ్యసనాల కారణంగా గట్ హెల్త్ పాడవుతుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఆరోగ్యకరమైన జీవన శైలి అవసరమని.. సీజనల్ ఫ్రూట్స్, కూరగాయలు తినడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కూడా పేగుల ఆరోగ్యం మెరుగవుతుంది.

మనం తినే ఆహారం జీర్ణం చేసి, పోషకాలను శోషించి.. వ్యర్థాలను బయటకు పంపడంలో పేగులదే కీలక పాత్ర. శరీరానికి సరిపడని ఆహారం తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు, పొత్తి కడుపు నొప్పి, అజీర్తి, పుల్లని తేన్పులు వచ్చి కడుపు అసౌకర్యంగా ఉంటుంది. కొన్ని లక్షణాలు, అలవాట్ల కారణంగా గట్ హెల్త్ పాడవుతుంది. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం.

ఆల్కహాల్ : మద్యం సేవించడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. మద్యం ఎక్కువగా సేవించడం కారణంగా పొట్ట లోపలి పొర దెబ్బతింటుంది. దాని ప్రభావం పేగులపై కూడా పడుతుంది. ఇది అంతిమంగా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఆహారం సరిగా జీర్ణం కాక.. మన శరీరం పూర్తిగా కృషించి పోతుంది. అందుకే సాధ్యమైనంత వరకు ఆల్కహాల్‌ను దూరం పెట్టడం మంచిది.

నిద్రలేమి : సరైన నిద్ర లేకపోవడం వల్ల శరీరంపై ఒత్తిడి పెరుగుతుంది. దీని కారణంగా జీర్ణ క్రియ సరిగా జరగదు. ఇది పేగులను సమస్యల్లోకి నెడుతుంది. కాబట్టి కంటినిండా, సరైన సమయంలో నిద్రపోవడం ఆరోగ్యానికి, గట్ హెల్త్‌కు మంచింది.

ఒత్తిడి : తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు గట్‌లో అభివృద్ధి చెందే మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి కాకుండా పోతుంది. ఇది జీర్ణక్రియపై ప్రభావం చూపిస్తుంది. పేగులు అనారోగ్యం బారిన పడతాయి. అందుకే ఒత్తిడిని జయించే ధ్యానం వంటి వాటిపై ఫోకస్ చేయడం మంచిది.

వ్యాయామం : క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే కడుపుపై ప్రభావం చూపిస్తుంది. కడుపు చుట్టూ పేరుకొని పోయే కొవ్వును కరిగించుకోవడం చాలా మంచిది. ఇది గట్ హెల్త్‌ను పెంచుతుంది.

ప్రతీ రోజు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా మంచిది. అలాగే నిద్రపోయే ముందు కొద్దిగా త్రిఫల చూర్ణాన్ని నీటిలో వేసుకొని తాగితే పేగులు శుభ్రమవుతాయి. జీలకర్ర, యాలకులు, త్రిఫల చూర్ణం తరచూ తీసుకుంటే పేగులకు ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు రాదు. అంతే కాకుండా ఆహారాన్ని పూర్తిగా నమిలి మింగడం కూడా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News