సీఎం కేజ్రీవాల్ కు బిగ్ రిలీఫ్..కానీ..!

లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది.

Advertisement
Update: 2024-09-13 06:54 GMT

లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. సీబీఐ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. రెండు వేర్వేరు పిటిషన్లను ఆయన దాఖలు చేశారు. వీటిపై ఇటీవల విచారణ జరిపిన కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ శుక్రవారం తీర్పునిచ్చింది. దీంతో ఆయన తీహార్ జైలు నుంచి 6 నెలల తర్వాత విడుదల కానున్నారు.

రూ.10 లక్షల పూచీకత్తు, ఇద్దరు షూరిటీ సంతకాలు చేయాలని షరతుల్లో పేర్కింది. ఈ కేసు గురించి బహిరంగంగా మాట్లాడకూడదని ఆదేశించింది. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా అనుమతి లేకుండా ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లకూడదని, అధికారికి ఫైళ్లపై సంతకాలు చేయకూడదని స్పష్టం చేసింది. బెయిల్ తీర్పు సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ సుదీర్ఘంగా కారాగారంలో నిర్బంధించడమంటే వ్యక్తి స్వేచ్ఛను హరించినట్లే. ఈ కేసులో అరెస్టు సరైందే అయినా.. చేసిన సమయం అనేక సందేహాలు, ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈడీ కేసులో బెయిల్‌ వచ్చిన వెంటనే కేజ్రీవాల్ ను సీబీఐ అరెస్టు చేయడం సమంజసం కాదు’ అని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రతీ వ్యక్తికి ‘బెయిల్ అనేది నిబంధన.. జైలు మినహాయింపు’గా ఉండాలి అని వెల్లడించింది.

మద్యం పాలసీకి చెందిన కేసులో ఈ ఏడాది మార్చి 21న ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. దాంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో జూన్‌ 2న తిరిగి లొంగిపోయారు. తర్వాత జూన్‌ 20న రౌస్‌ అవెన్యూ కోర్టు ఢిల్లీ సీఎంకు సాధారణ బెయిల్‌ మంజూరు చేసింది. కానీ, ఆ బెయిల్ పై ఈడీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో మరుసటి రోజే దిల్లీ హైకోర్టు బెయిల్‌ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది. అనంతరం జూన్‌ 25న బెయిల్‌పై స్టే విధిస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. దీనిపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. జులైలో ఆయనకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. అయితే, ఈడీ కేసులో రౌస్‌ అవెన్యూ కోర్టు నుంచి బెయిల్‌ వచ్చిన వెంటనే సీబీఐ ఆయనను అరెస్టు చేసింది. దీంతో ఈడీ కేసులో ఊరట లభించినా.. సీబీఐ జ్యుడీషియల్‌ కస్టడీలో భాగంగా కేజ్రీవాల్ తిహార్ జైల్ లో ఉన్నారు. తాజాగా ఆయనకు సీబీఐ కేసులోనూ బెయిల్ రావడంతో ఆప్ నేతలు, పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తంచేస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News