కొత్త ట్రెండ్ : దర్శకులే హీరోలై హిట్లు కొట్టేస్తున్నారు

సినిమా బాగుంటే భాషలతో సంబంధం లేకుండా డబ్బింగ్ సినిమా అయినా ఆదరిస్తున్నారు. ఈ తరుణంలో పలువురు దర్శకులే హీరోలుగా మారి హిట్లు కొట్టేస్తున్నారు.

Advertisement
Update:2022-11-28 07:50 IST

ప్రస్తుతం సినిమా ట్రెండ్ మారిపోయింది. సినిమా బాగుంటేనే థియేటర్ వరకు వస్తున్నారు. బాగాలేకుంటే అగ్ర హీరోలు నటించే సినిమాలైనా రిజెక్ట్ చేస్తున్నారు. సినిమా బాగుంటే భాషలతో సంబంధం లేకుండా డబ్బింగ్ సినిమా అయినా ఆదరిస్తున్నారు. ఈ తరుణంలో పలువురు దర్శకులే హీరోలుగా మారి హిట్లు కొట్టేస్తున్నారు.

ఇటీవల దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన సినిమా కాంతారా. ఈ సినిమాకు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించగా అతడే హీరోగా కూడా నటించాడు. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. సంస్కృతి, సాంప్రదాయాల‌ను గుర్తుచేస్తూ రూపొందించిన ఈ సినిమాలో స్టార్ హీరో లేకపోయినా సూపర్ హిట్ అయింది.

ఇక తాజా సంచలనం లవ్ టుడే మూవీ. ఈ సినిమాకు ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించాడు. అంతేకాదు హీరోగా కూడా అతడే నటించాడు. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా తమిళనాడులో రూ.70 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. తెలుగులో ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.

సినిమా బాగుందని మౌత్ టాక్ రావడంతో ఈ శని, ఆదివారాలు మంచి కలెక్షన్లు తెచ్చుకుంది. మంచి ప్రేమ కథతో పాటు కామెడీ కూడా ఉండటంతో ఈ సినిమాను ప్రేక్షకులు పాస్ చేశారు. అలా దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ ఇద్దరు దర్శకులు తామే హీరోలుగా మారి రూపొందించిన సినిమాలు భారీ విజయం సాధించడంతో హీరోలుగా సెటిల్ అయ్యారు.

గతంలో డ్యాన్స్ మాస్టర్ కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ కూడా స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించి విజయాలు అందుకున్నాడు. ఇక ప్రస్తుతం తెలుగు యువ హీరోలైన అడివి శేష్, రాజ్ తరుణ్, కిరణ్ అబ్బవరం, విశ్వక్ సేన్ వంటి వారు తాము హీరోలుగా నటించే సినిమాలకు కథ కూడా అందిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News