అర్ధరాత్రి ఉద్రిక్తత.. రెజ్లర్లకు గాయాలు
జంతర్ మంతర్ వద్ద జరిగిన ఘటనపై రెజ్లర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించకపోగా, తిరిగి తమపైనే పోలీసుల్ని దాడులకు ఉసిగొల్పుతున్నారని అన్నారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ రాజీనామా డిమాండ్ చేస్తూ భారత రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. రెజ్లర్ల కోసం ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతి.. కొన్ని మడత మంచాలు తీసుకొచ్చారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు, అనుమతి లేదని చెప్పారు. సోమ్ నాథ్ భారతిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడ తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పోలీసుల అత్యుత్సాహంతో కొంతమంది రెజ్లర్లకు కూడా గాయాలయ్యాయి. పోలీసులతో జరిగిన ఘర్షణలో తన సోదరుడు దుష్యంత్ ఫోగట్ గాయపడ్డాడని రెజ్లర్ గీతా ఫోగట్ ఆరోపించారు, మరో రెజ్లర్ కి కూడా గాయమైందని చెప్పారు. ఈ ఘటన సిగ్గుచేటు అని ఆమె అన్నారు.
రెజ్లర్ల నిరసన శిబిరం వద్దకు అర్ధరాత్రి పోలీసులు రావడంతో ఘర్షణ జరిగింది. పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం జరిగింది. తమపై పోలీసులు దాడి చేశారని రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. ఈ ఘర్షణలో కొందరికి గాయాలయ్యాయి. దీంతో జంతర్ మంతర్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఈ గొడవ తర్వాత రెజ్లర్లు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు దురదృష్టకరం అన్నారు. ఇందుకోసమేనా తాము భారత్ కోసం మెడల్స్ గెలిచింది అని ప్రశ్నించారు.
ఈ మెడల్స్ మాకొద్దు..
జంతర్ మంతర్ వద్ద జరిగిన ఘటనపై రెజ్లర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించకపోగా, తిరిగి తమపైనే పోలీసుల్ని దాడులకు ఉసిగొల్పుతున్నారని అన్నారు. తాము గెల్చుకున్న పతకాలను తిరిగి ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేశారు రెజ్లర్ భజరంగ్ పూనియా. వాటి బదులు తమకు ప్రశాంతమైన జీవితాన్నివ్వాలని కోరారు.
ప్రతిపక్షాల విమర్శలు..
జంతర్ మంతర్ వద్ద అర్ధరాత్రి జరిగిన ఘటన తీవ్ర విమర్శలకు కారణమైంది. రెజ్లర్ల కోసం ఆప్ ఎమ్మెల్యే మంచాలు తీసుకెళ్లి ఇవ్వడం తప్పా అని ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు. భారత్ కోసం పతకాలు తెచ్చిన రెజ్లర్లను కేంద్ర ప్రభుత్వం అవమానిస్తోందని అంటున్నారు. పరిష్కారం చూపెట్టడానికి బదులు, వారిపై దాడులు చేస్తారా అంటూ నిలదీస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. జంతర్ మంతర్ వద్ద ఆంక్షలు విధించారు. ఎవరూ నిరసన జరుగుతున్న చోటుకు రావద్దని హెచ్చరించారు.