ట్రీట్మెంట్ చేస్తున్న వైద్యురాలిని పొడిచి చంపిన పేషెంట్.. కేరళ సీఎం దిగ్భ్రాంతి

ఆస్పత్రిలో విధుల్లో ఉన్న 23 ఏళ్ల డాక్టర్ వందనా దాస్ సందీప్ కాలిగాయానికి కట్టు కట్టడం ప్రారంభించింది. అయితే సందీప్ ఊహించని విధంగా ఆపరేషన్ థియేటర్లో ఉన్న కత్తెర, సర్జిక‌ల్ బ్లేడుతో డాక్టర్ పై దాడి చేశాడు.

Advertisement
Update:2023-05-10 18:56 IST

కేరళ రాష్ట్రం కొల్లంలో దారుణం జరిగింది. ట్రీట్మెంట్ చేస్తున్న వైద్యురాలిపై పేషెంట్ దాడి చేశాడు. కత్తెర్లు, సర్జికల్ బ్లేడుతో పొడవడంతో ఆమె మృతి చెందింది. తనపై కుటుంబ సభ్యులు దాడి చేశారని, తనను కాపాడాలని సస్పెన్షన్ లో ఉన్న ఉపాధ్యాయుడు సందీప్ బుధవారం ఉదయం కొట్టారక్కర పోలీసులకు ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు హుటాహుటిన అతడి ఇంటి వద్దకు చేరుకున్నారు. కుటుంబ సభ్యులు జరిపిన దాడిలో సందీప్ కాలికి గాయాలైనట్లు గుర్తించి అతడిని చికిత్స కోసం స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆస్ప‌తికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతడు మద్యం మత్తులో ఉన్నాడు.

ఆస్పత్రిలో విధుల్లో ఉన్న 23 ఏళ్ల డాక్టర్ వందనా దాస్ సందీప్ కాలిగాయానికి కట్టు కట్టడం ప్రారంభించింది. అయితే సందీప్ ఊహించని విధంగా ఆపరేషన్ థియేటర్లో ఉన్న కత్తెర, సర్జిక‌ల్ బ్లేడుతో డాక్టర్ పై దాడి చేశాడు. ఆమె భయంతో కేకలు పెడుతూ గదిలో నుంచి బయటికి పరుగులు తీసింది. ఆమెను సందీప్ వెంటాడుతూ బయటికి వచ్చాడు. గది బయట ఉన్న పోలీసులు సందీప్ ను పట్టుకునే ప్రయత్నం చేయగా వారిపై కూడా అతడు దాడి చేశాడు.

అనంతరం డాక్టర్ వందనపై సర్జిక‌ల్ బ్లేడు, కత్తెరతో పలుమార్లు పొడిచాడు. చివరికి పోలీసులు ఎలాగోలా అతడిని పట్టుకొని తీవ్రగాయాలైన వందనను తిరువనంతపురంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. విధుల్లో ఉన్న వైద్యురాలిని పొడిచి చంపడం కేరళ రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. ప్రాణాలు కాపాడే వైద్యులకు ప్రాణాలకే రక్షణ లేకపోతే ఎలా..? అంటూ రాష్ట్రవ్యాప్తంగా డాక్టర్లు ధర్నా నిర్వహించారు. కేరళ సీఎం పిన‌ర‌యి విజయన్, గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆస్పత్రి వద్దకు వచ్చి బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

వైద్యురాలు మృతిచెందడంపై కేరళ ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉన్న డాక్ట‌ర్‌పై దాడి చేయడం దారుణ‌మ‌న్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని, వైద్యురాలు వంద‌న‌పై దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కాగా, గాయానికి కట్టు కడుతున్న డాక్టర్ పై సందీప్ ఎందుకు దాడి చేశాడో తెలియడంలేదని పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో ఉన్నందువల్లే ఆ విధంగా ప్రవర్తించాడా..? లేకపోతే అతడి మానసిక స్థితి సరిగ్గా లేదా..?అన్న కోణంలో కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు చెప్పారు.

Tags:    
Advertisement

Similar News