14 అబార్షన్లు.. ఆత్మహత్య
ఎనిమిదేళ్లలో 14 అబార్షన్లు చేయించుకున్న ఆమె చివరికి అతను పెళ్లికి నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకుంది.
ఇక అబార్షన్లు చేయించుకోలేనంటూ ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఆగ్నేయ ఢిల్లీలోని జైత్ పూర్ లో ఈ ఘటన జరిగింది. 33 ఏళ్ల వయసున్న ఆ మహిళ ఎనిమిదేళ్లుగా ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోంది. పెళ్లి చేసుకుంటానని మభ్యపెడుతూ వచ్చిన ఆ వ్యక్తి ఆమెకు వరుసగా అబార్షన్లు చేయిస్తూ వచ్చాడు. ఆమెకు ఇష్టం లేకపోయినా అబార్షన్ చేయించుకోమని అతను బలవంత పెడుతూ వచ్చాడు. అలా ఎనిమిదేళ్లలో 14 అబార్షన్లు చేయించుకున్న ఆమె చివరికి అతను పెళ్లికి నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకుంది.
ఆత్మహత్యకు ముందు ఆమెరాసిన లేఖ ద్వారా ఈ వివరాలు తెలిశాయి. వివాహిత అయిన ఆమె కొన్నేళ్లుగా భర్తకు దూరంగా ఉంటోంది. మహిళతో సహజీవనం చేస్తున్న వ్యక్తి నోయిడాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. మృతురాలి ఇంటినుండి ఆమె ఫోన్ ని స్వాధీనం చేసుకున్నట్టుగా పోలీసులు తెలిపారు. మహిళ తల్లిదండ్రులు బీహార్ లో ఉంటారని, పోస్ట్‌మార్టం అనంతరం ఆమె బాడీని వారికి అప్పగించామని వారు వెల్లడించారు. ఆత్మహత్యకు ప్రేరేపించడం, అత్యాచారం, మహిళకు ఇష్టం లేకుండా బలవంతంగా అబార్షన్ చేయించడం అనే నేరాలతో ఆ వ్యక్తిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.