కాంగ్రెస్‌ ఎక్కడ గెలిస్తే ఆ రాష్ట్రం పార్టీ ఏటీఎం

మహా వికాస్‌ అఘాడీ అంటే అవినీతి, కుంభకోణాలకు నెలవు అంటూ ప్రధాని ఆరోపణలు

Advertisement
Update:2024-11-09 16:43 IST

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒక విడతలో జరగనున్నాయి. నవంబర్‌ 20న 288 స్థానాలకు పోలింగ్‌ జరగనున్నది. నవంబర్‌ 23న ఫలితాలు ప్రకటించనున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ అక్కడ అధికార మహాయతి, ప్రతిపక్షం మహావికాస్‌ అఘాడీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో అకోలాలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విపక్షాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మహావికాస్‌ అఘాడీ అంటేనే అవినీతి అంటూ ఆరోపించారు.

ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. నవంబర్‌ 9వ తేదీకి చరిత్రలో అత్యంత ప్రాధాన్యం ఉన్నది. 2019లో సరిగ్గా ఇదే రోజు సుప్రీంకోర్టు రామమందిరంపై తీర్పునిచ్చింది. ఆ తీర్పు తర్వాత ప్రతి మతంలోని ప్రజలు గొప్ప సున్నితత్వాన్ని ప్రదర్శించారు. దేశానికే మొదటి ప్రాధాన్యమనే భావన భారత్ కు ఉన్న గొప్ప బలం. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటైతే ఆ రాష్ట్రాన్ని తమ ఏటీఎంగా మార్చుకుంటుంది. మహా వికాస్‌ అఘాడీ అంటే అవినీతి, కుంభకోణాలకు నెలవు. కర్ణాటకలో మద్యం విక్రయదారుల నుంచి రూ. 700 కోట్లు కొల్లగొట్టారు. ఎన్నికల్లో గెలిస్తే ఇంకెంత దోచుకుంటారో ఊహించండి అంటూ ప్రధాని ఆరోపించారు.

హర్యానా ప్రజలు కాంగ్రెస్‌ కుట్రను భగ్నం చేశారని తెలిపారు. దేశాన్ని బలహీనపరచడానికి ఆ పార్టీ యత్నిస్తున్నదని ధ్వజమెత్తారు. వివిధ కులా ల మధ్య చిచ్చుపెట్టి సమాజాన్ని విడదీయడానికి ప్రయత్నిస్తున్నదని.. మనమంతా ఐక్యంగా ఉండి వారి కుట్రలను భగ్నం చేయాలని ప్రధాని పిలపునిచ్చారు. ఎస్సీల హక్కులను కాంగ్రెస్‌ పార్టీ హరిస్తున్నదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పదేళ్లలో పేదలకు పక్కా ఇళ్లు నిర్మించింది. మీరు ఇతర గ్రామాలను సందర్శించినప్పుడు ఇల్లు లేని వారు, గుడిసెల్లో నివసించే వారు కనిపిస్తే వారి వివరాలతో సహా చిరునామాను నాకు పంపించండి. అతడికి శాశ్వతంగా ఒక ఇల్లు సొంతమవుతుందని నా తరఫున హామీ ఇవ్వండి. కచ్చితంగా ఆ హామీని నేను నెరవేరుస్తా. రాష్ట్ర ప్రజల నుంచి ఎప్పుడూ ఆశీస్సులు అందుతూనే ఉన్నాయి. మరోసారి మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. ఎన్నికల్లో మహాయతి కూటమి గెలిపిస్తారని ఆశిస్తున్నాను అన్నారు.

Tags:    
Advertisement

Similar News