బజరంగ్ దళ్ చరిత్ర ఏంటి ? గతంలో ఆ సంస్థను నిషేధించారా ?

బజరంగ్ దళ్ సంస్థ పై నిషేధం విధించే అంతగా ఆ సంస్థ చేసిన నేరాలేంటి ? గతంలో ఎప్పుడైనా ఆ సంస్థను భారత ప్రభుత్వం నిషేధించిందా ? హిందూమత రక్షణ కోసం పని చేస్తామని చెబుతున్న బజరంగ్ దళ్, ఇతర మతాలకు వ్యతిరేకం కాదని అంటున్న మాటల్లో నిజమెంత ?

Advertisement
Update:2023-05-06 20:35 IST

కర్నాటకలో తాము అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్ ను నిషేధిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పడాన్ని బీజేపీ అతిపెద్ద ఎన్నికల సమస్యగా చేసింది. హనుమంతుడినే అవమానిస్తారా అంటూ ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీయే మాట్లాడటం బజరంగ్ దళ్ పట్ల బీజెపికి ఎంత ప్రేమ ఉందో అర్దమవుతోంది. అయితే ఈ బజరంగ్ దళ్ సంస్థ పై నిషేధం విధించే అంతగా ఆ సంస్థ చేసిన నేరాలేంటి ? గతంలో ఎప్పుడైనా ఆ సంస్థను భారత ప్రభుత్వం నిషేధించిందా ? హిందూమత రక్షణ కోసం పని చేస్తామని చెబుతున్న బజరంగ్ దళ్, ఇతర మతాలకు వ్యతిరేకం కాదని అంటున్న మాటల్లో నిజమెంత ?

అయోధ్యలో రాముని గుడి నిర్మాణం కోసం పోరాటం ప్రారంభించిన విశ్వ హిందూ పరిషత్, 1984లో ''రామ్-జానకి రథయాత్ర'' అనే కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్‌లో చేపట్టింది. ఆ రథ యాత్రకు రక్షణ కోసం దేశ‌ వ్యాప్తంగా ఉన్న హిందుత్వ యువకులను అక్కడికి రప్పించారు. ఆ సందర్భంగా ఉత్తరప్రదేశ్ కు చేరుకున్న యువతతో 1984 అక్టోబరు 8న ఉత్తరప్రదేశ్‌లో బజరంగ్ దళ్‌ పుట్టింది.

హిందువులను చైతన్య పరచడం, వారికి రక్షణ కల్పించడం, ఆవులను కాపాడటం, హిందూ దేవాలయాలను కాపాడటం, హిందూ సంస్కృతిని కాపాడటం, విదేశీ సంస్కృతిని వ్యతిరేకించడం, అఖండ భారత్ నిర్మాణం తదితర లక్ష్యాలతో ఏర్పడిన బజరంగ్ దళ్ దేశ‌ వ్యాప్తంగా విస్తరించింది.

అయితే ఆ సంస్థ కార్యకలాపాలపై అనేక విమర్శలున్నాయి. 1992 డిసెంబర్ 6న అయోధ్యలోని బాబ్రీ మసీదును కూల్చి వేసిన ఘటనలో బజరంగ్ దళ్ ముఖ్య పాత్ర పోషించింది. ఆ సంఘటన తర్వాత అప్పటి పీవీ నర్సింహా రావు ప్రభుత్వం బజరంగ్ దళ్ ను నిషేధించింది. సంవత్సరం తర్వాత నిషేధం ఎత్తివేశారు.

గుజరాత్ లో 1998 లో క్రైస్తవులపై బజరంగ్ దళ్ దాడులకు దిగింది. మత మార్పిడులు చేస్తున్నారనే సాకుతో అనేక‌ చర్చిలను తగలబెట్టారు.క్రైస్తవుల మీద వరుస దాడులు జరిగాయి. బైబిల్ గ్రంథాలను కాల్చివేశారు. పాఠశాలలు, చర్చిలు, దుకాణాలను ధ్వంసం చేశారని హ్యూమన్ రైట్స్ వాచ్ (HRW) అనే సంస్థ బహిర్గత పర్చింది.

2002 లో గుజరాత్ లో ముస్లింలపై జరిగిన దాడులు, అనేక హత్యల్లో బజరంగ్ దళ్ ప్రధాన పాత్ర పోషించిందనే ఆరోపణలున్నాయి. ప్రధానంగా 97 మంది ముస్లింలు హత్యకు గురైన ''నరోదా పాటియా నరమేధం'' కేసులో నాటి గుజరాత్ బజరంగ్ దళ్ నేత బాబుభాయి పటేల్‌ బజరంగీ దోషిగా తేలారు. ఆయనకు కోర్టు జీవితకాల కారాగారశిక్ష విధించింది.

2007లో ఒక ప్రైవేటు చానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో.. తాము ముస్లింలపై హింసకు ఎలా పాల్పడ్డామో బజరంగీ స్పష్టంగా చెప్పారు. తాము చేసింది హీరోయిక్ కార్యక్రమమని ఆయన చెప్పుకున్నారు.

1999 లో ఒడిశాలోని మనోహర్‌పుర్ లో గ్రాహం స్టెయిన్స్ అనే ఆస్ట్రేలియాకు చెందిన క్రైస్తవ మిషనరీని, ఆయన ఇద్దరు పిల్లలను సజీవ దహనం చేసిన కేసులో కీలక‌ పాత్రదారి బజరంగ్ ద‌ళ్ నాయకుడు దారా సింగ్ అనే ఆరోపణలు వచ్చాయి. ఆయనపై కేసు కూడా నమోదయ్యింది.

మయూర్‌భంజ్ జిల్లాలోని కరంజియా సబ్-డివిజన్‌లోని పాడియాబెడ గ్రామంలో ముస్లిం వ్యాపారి షేక్ రెహ్మాన్‌ను హత్య చేసిన‌ కేసులో దారా సింగ్ ను దోషిగా కోర్టు నిర్ధారించింది.క్రిస్టియన్ పూజారి అరుల్ దాస్ హత్య కేసులో కూడా సింగ్ దోషిగా నిర్ధారించబడ్డాడు.

2008 ఆగస్టు 23న ఒడిశాలో వీహెచ్‌పీ నేత లక్ష్మానంద సరస్వతి హత్య తర్వాత 600కి పైగా గ్రామాల మీద దాడులు జరిగాయి. సుమారు 39 మంది క్రైస్తవులను హత్య చేశారు. 232 చర్చిలను నాశనం చేశారు. ఇవి చేసింది బజరంగ్ దళ్ కార్యకర్తలే అనే ఆరోపణలున్నాయి.

2006లో మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఒక ఇంట్లో బాంబు పేలి ఇద్దరు బజరంగ్ దళ్ కార్యకర్తలు చనిపోయారు. ఆ బాంబును వారు తయారు చేస్తుండగా అది పేలిందనేది ఆరోపణ.

ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో 2008లో బాంబు తయారు చేస్తూ, అది పేలిపోవడంతో ఇద్దరు బజరంగ్ దళ్ కార్యకర్తలు చనిపోయినట్లు కేసు నమోదైంది.

2008 లో కర్నాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అదే సంవత్సరం ఆ రాష్ట్రంలోని అనేక చర్చిలపై దాడులు జరిగాయి. ముఖ్యంగా ఉడుపి, చిక్‌మగుళూరు జిల్లాల్లో ఈ దాడుల తీవ్రత ఎక్కువగా ఉంది.

2014 లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక అనేక ఉత్తరాది రాష్ట్రాల్లో గో హత్యలు, ఆవులను తరలిస్తున్నారనే సాకుతో ముస్లింల మీద దాడులు హత్యలు జరిగాయి. వీటి వెనక బజరంగ్ దళ్ ఉన్నదనే ఆరోపణలున్నాయి. అంతే కాదు కర్నాటకలో హలాల్ మాంసం కొనద్దనే ప్రచారాన్ని మొదలు పెట్టి అసలు ముస్లిం వ్యాపారుల వద్ద ఏ వస్తువులూ కొనద్దనే ప్రచారం చేయడంలో శ్రీరాం సేనతో కలిసి బజరంగ దళ్ దే ప్రధాన పాత్ర.

2002 మార్చి 16న బజరంగ్ దళ్, వీహెచ్‌పీ, దుర్గావాహినికి చెందిన 500 మంది కార్యకర్తలు ఒడిశా అసెంబ్లీ అసెంబ్లీలోకి చొచ్చుకపోయి. అసెంబ్లీలో విధ్వంసం సృష్టించారని మీడియా రిపోర్ట్ చేసింది. ఈ సంఘటన నేపథ్యంలో బజరంగ్ దళ్‌, వీహెచ్‌పీలను నిషేధించాలంటూ టీఎంసీ, జేడీయూ డిమాండ్ చేశాయి.

2006లో మహారాష్ట్ర మాలేగావ్ లో పేలుళ్ళు జరిపి 40 మంది మరణానికి కారణమైన కేసులో బజరంగ్ దళ్ కార్యకర్తలున్నారు.

ఇక మోరల్ పోలీసింగ్ చేయడంలో దేశంలో బజరంగ్ దళ్ ముందు వరసనుందనే విమర్శలున్నాయి. ఎవరు ఏం తినాలి? ఎటువంటి దుస్తులు ధరించాలి? ఎవరిని పెళ్ళి చేసుకోవాలి ? ఎలా పెళ్ళి చేసుకోవాలి ? ఇలా చాలా రకాల నిబందనలను బజరంగ్ దళ్ ప్రజలపై విధిస్తోంది.

ఫిబ్రవరి 14న వాలెంటీన్ డే సందర్భంగా ప్రతి ఏటా పార్కుల్లో గుంపులుగా తిరుగుతూ ఎవరైనా అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి కనిపిస్తే దాడులు చేయడం, అమ్మాయిలతో అబ్బాయిలకు రాఖీలు కట్టించడం, బలవంతంగా పెళ్ళి చేయడం వంటి పనులు చేయడంలో బజరంగ్ దళ్ పేరెన్నికపొందింది. హైదరాబాద్ , బెంగుళూరు తో సహా అనేక పట్టణాల్లో బజరంగ్ దళ్ ఇలాంటి దాడులకు పాల్పడింది.

కర్నాటక రాష్ట్రం మంగళూరులోని ఓ పబ్ లో బజరంగ్ దళ్, శ్రీరామ్ సేన కార్యకర్తలు యువతీ యువకులపై దాడి చేసిన సంఘటన దేశ‌వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2009 జనవరి 24న జరిగిన ఈ సంఘటనపై కేసు కూడా నమోదయ్యింది.

హిందూ సంస్కృతికి విరుద్ధమని ఆరోపణలు చేస్తూ కర్ణాటకలోని శివమొగ్గలో ఈ సంవత్సరం మార్చిలో మహిళల ''నైట్ అవుట్ పార్టీ'' పై బజరంగ్ దళ్ కార్యకర్తలు దాడి చేశారు. దీనిపై కూడా కేసు నమోదయ్యింది.

ఇదీ బజరంగ్ దళ్ చరిత్ర. ఇటువంటి చరిత్ర ఉన్న ఆ సంస్థను నిషేధిస్తామని తాజాగా కాంగ్రెస్ ప్రకటించడంతో బీజేపీకి మండిపోయింది. ఇప్పుడు కర్నాటక ఎన్నికల్లో అన్ని సమస్యలను పక్కకు పెట్టి బజరంగ్ దళ్ నిషేధ అంశమే ప్రధానం చేసింది బీజేపీ. బజరంగ్ దళ్ హనుమంతుడి ప్రతిరూపంగా బీజేపీ ప్రచారం చేస్తున్నది.

Tags:    
Advertisement

Similar News