తమిళనాడు తరహాలో బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తాం

ఆ రాష్ట్రంలో రిజర్వేషన్లపై అధ్యయనం చేస్తున్న బీఆర్‌ఎస్‌ బృందం

Advertisement
Update:2024-09-26 19:43 IST

తమిళనాడులో విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు ఇస్తున్న రిజర్వేషన్ల మాదిరిగానే తెలంగాణలోనూ రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఉద్యమిస్తామని బీఆర్‌ఎస్‌ బీసీ నాయకులు తెలిపారు. తమిళనాడులో అమలవుతున్న బీసీ రిజర్వేషన్లతో పాటు అక్కడి ప్రభుత్వం బీసీలకు కల్పిస్తున్న సంక్షేమ పథకాలు, వారి అభివృద్ధి కోసం చేపడుతున్న చర్యలు అధ్యయనం చేయడానికి గురువారం ఉదయం బీఆర్‌ఎస్‌ బీసీ నాయకుల ప్రతినిధి బృందం చెన్నైకి బయల్దేరి వెళ్లింది. చెన్నైలో బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో నాయకులు భేటీ అయ్యారు. తమిళనాడులో రిజర్వేషన్లు, అభివృద్ధి పథకాల గురించి బీసీ వెల్ఫేర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ విజయ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో అధికారులు నాలుగు గంటల పాటు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. మద్రాసు ప్రెసిడెన్సీ కాలం నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో అమలవుతున్న బీసీ రిజర్వేషన్లు, వాటి వెనుక జరిగిన సామాజిక న్యాయపరమైన అంశాలను వివరించారు. ఇందిరా సాహ్నికేసు తీర్పు తర్వాత, వెనువెంటనే స్పందించిన తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక రిజర్వేషన్ల కోసం చట్టం చేసిందన్నారు. న్యాయపర వివాదాల నుంచి రక్షణ కోసం ఆనాటి కేంద్రంతో పోరాడి, రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్ లో చేర్చి బీసీ రిజర్వేషన్లను సాధించుకున్నామని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల కోసం జస్టిస్ అంబాశంకర్ కమిషన్ శాస్త్రీయంగా ఇంటింటి సర్వే నిర్వహించి, స్పష్టమైన లెక్కలు సేకరించారని వివరించారు. చట్ట సభల్లో రిజర్వేషన్లు లేకపోయినా సామాజిక చైతన్యం, తమిళ అస్తిత్వంతో 90 శాతానికి పైగా స్థానాలను బీసీ, ఎస్సీ, ఎస్టీలు గెలిచి ప్రాతినిథ్యం వహిస్తున్నారని అధికారులు వివరించారు.

తెలంగాణలో విద్యా ఉద్యోగాలలో బీసీలకు న్యాయం జరగాలంటే తమిళనాడు తరహా రిజర్వేషన్లు ఒక్కటే అంతిమ పరిష్కార మార్గమని కేసీఆర్ ఎప్పుడో చెప్పారని శాసనమండలిలో విపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి అన్నారు. చెన్నై బీసీ భవన్ ఆవరణలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ తన పదేళ్ల పాలనలో పలు సందర్భాల్లో తమిళనాడు తరహా రిజర్వేషన్లు తెలంగాణలో అమలు చేయాలని ప్రధాని మోడీని కోరారన్నారు. తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాలు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచుకునే వెసులుబాటు కల్పించాలని కూడా డిమాండ్‌ చేశారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో శాసన మండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు గంగుల కమలాకర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, జోగు రామన్న, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, పుట్ట మధు, కోరుకంటి చందర్, కార్పొరేషన్‌ మాజీ చైర్మన్లు జూలూరు గౌరీశంకర్, ఆంజనేయగౌడ్, పల్లె రవికుమార్, తుల ఉమ, గెల్లు శ్రీనివాస్‌ యాదవ్, నాగేందర్ గౌడ్, రవీందర్‌ సింగ్, బాలరాజు యాదవ్, బీసీ కమిషన్ మాజీ సభ్యులు సుభప్రద పటేల్, కిశోర్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రీనివాస్, చెరుకు సుధాకర్, రాజ్యలక్ష్మి, బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్, విద్యార్థి నేత దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News