బీజేపీతో జట్టు కట్టడం మా మూర్ఖత్వమే.. బీహార్ సీఎం నితీష్ కుమార్

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బీజేపీ పై నిప్పులు చెరిగారు. పాట్నాలో తమ పార్టీ జాతీయ మండలి సమావేశంలో మాట్లాడిన ఆయన బీజేపీతో ఒకనాడు జట్టు కట్టడం తమ పార్టీ మూర్ఖత్వమేనన్నారు.

Advertisement
Update:2022-09-05 15:32 IST

బీజేపీతో ఒకనాడు జట్టు కట్టడం తమ పార్టీ మూర్ఖత్వమేనని బీహార్ సీఎం, జేడీ-యూ అధినేత నితీష్ కుమార్ అంగీకరించారు. తమ పార్టీ ఉన్నంతవరకు బీజేపీతో తిరిగి చేతులు కలిపేది లేదని ప్రకటించారు. 2017 కి ముందు దాదాపు నాలుగేళ్లు బీజేపీకి దూరంగా ఉన్నామని, కానీ 2017 లో తిరిగి దానితో పొత్తు పెట్టుకున్నామని ఆయన అన్నారు. పాట్నాలో తమ పార్టీ జాతీయ మండలి సమావేశంలో మాట్లాడిన ఆయన.. 2013 లో కాషాయ పార్టీతో మైత్రిని వదులుకుని ఎన్డీయేని వీడామన్నారు. 'అప్పుడు మా పరిస్థితి ఎంతో బాగుంది.. కానీ 2017 లో పొరబాటు చేశాం.. మళ్ళీ పొత్తు పెట్టుకున్నాం.. ఫలితంగా రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ప్రజలు మమ్మల్ని కాదనుకున్నారు. అయితే తిరిగి బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని మేం నిర్ణయించాక వారంతా దాన్ని హర్షించారు' అన్నారాయన. 2014 లో జరిగే లోక్ సభ ఎన్నికలకు తమ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని బీజేపీ 2013 లో ప్రకటించిన తరువాత తాము ఆ పార్టీకి దూరమయ్యామని, 2015 లో జరిగిన బీహార్ ఎన్నికల్లో తమ జేడీ-యూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించిందని గుర్తు చేశారు.

రెండేళ్ల అనంతరం అవినీతి ఆరోపణల నేపథ్యంలో అప్పటి డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ పదవికి రాజీనామా చేయడానికి నిరాకరించారు. అప్పుడు మళ్ళీ జేడీ-యూ ... బీజేపీకి 'దగ్గరయింది' . కానీ ఇందుకు కారణాలు చాలా ఉన్నాయని నితీష్ కుమార్ తెలిపారు. కొత్త ప్రభుత్వంలో తన డిప్యూటీగా ఉన్న తేజస్వి యాదవ్ గురించి ప్రస్తావించకుండా ఆయన.. తమ సూచనలను బీజేపీ ఖాతరు చేయలేదని, తాము చెప్పినవాటిని పట్టించుకోకుండా దాదాపు అణగదొక్కడంతో మళ్ళీ ఆ పార్టీతో తెగదెంపులు చేసుకున్నామని వివరించారు. ఒకనాడు అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వంలో మాకు ఎంతో గౌరవం ఉండేది.. కానీ వీళ్లంతా (బీజేపీ నేతలు) వచ్చాక మమ్మల్ని పక్కన పెట్టడమే పనిగా పెట్టుకున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు.

మా పార్టీలో చీలికలు తెచ్చేందుకు వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో గుర్తించామని, ఇక తమ పార్టీ ఉన్నంతవరకు తిరిగి బీజేపీతో ఎలాంటి పొత్తు పెట్టుకోబోమని నితీష్ స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి పదవికి తాను రేసులో లేనన్నారు. విపక్షాలన్నీ ఏకమైతే వారిని ఓడించవచ్చునని ఆయన చెప్పారు. నేనీ రోజున చిరునవ్వులు నవ్వుతున్నానంటే .. ఇందుకు బీజేపీయుల నుంచి 'విముక్తి' పొందినట్టే మీరు భావించాలని తమ సహచరులనుద్దేశించి చమత్కరించారు. దేశాన్ని తమ చేత జిక్కించుకుని నాశనం చేయజూసేవారి నుంచి మనం రక్షించాల్సి ఉందన్నారు. నితీష్ కుమార్ సోమవారం ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని, మరికొందరు నేతలను ఆయన కలుసుకోనున్నారు. మూడు రోజుల ఢిల్లీ టూర్ లో ఆయన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో కూడా భేటీ అయ్యే సూచనలున్నాయి.





Tags:    
Advertisement

Similar News