బెంగళూరు హోటళ్లలో సాంబార్ నిషేధం.. ఎందుకంటే..?
నీరు ఎక్కువగా ఉపయోగించే సాంబార్, రసం వంటివి బెంగళూరులో హోటళ్లు, రెస్టారెంట్ల మెనూ నుంచి మాయమైపోయాయి.
బెంగళూరు హోటళ్లలో మెనూ నుంచి ఇడ్లీ సాంబార్, వడ సాంబార్ అనేవి మాయమైపోయాయి. భోజనంలో కూడా రసం వేయట్లేదు. ఇలాంటి మార్పులు ఇంకా అక్కడ చాలానే ఉన్నాయి. వీటన్నిటికీ కారణం నీటి కొరత. గతంలో ఎన్నడూ లేనంతగా కర్నాటక నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా బెంగళూరు నగరంలో బోర్లు ఎండిపోయాయి. నగరానికి నీరు బయటనుంచే సరఫరా కావాల్సి వస్తోంది. మహానగరానికి ఎన్ని ట్యాంకర్లు వచ్చినా సరిపోవడంలేదు. దీంతో ప్రజల లైఫ్ స్టైల్ లో చాలా మార్పులు వచ్చేశాయి.
హోటళ్లు, రెస్టారెంట్ల విషయానికొస్తే.. నీరు ఎక్కువగా ఉపయోగించే సాంబార్, రసం వంటివి మెనూ నుంచి మాయమైపోయాయి. హోటళ్లలో తాగేందుకు విడిగా నీళ్లు ఇవ్వడంలేదు, ఎవరైనా బాటిల్స్ కొనుక్కోవాల్సిందే. చిన్న, పెద్ద అన్ని హోటళ్లలో డిస్పోజబుల్ ప్లేట్స్ నే వాడుతున్నారు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో కస్టమర్లకోసం ఏర్పాటు చేసే టాయిలెట్స్ కి తాళాలు వేస్తున్నారు. కస్టమర్లు మరీ గొడవ చేస్తే టోకెన్ సిస్టమ్ అమలు చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఆఫీస్ కి రావాలని ఉద్యోగులపై ఒత్తిడి చేసిన ఐటీ కంపెనీలు ఇప్పుడు రూటు మార్చాయి. వర్క్‌ఫ్రమ్‌హోమ్ ఫెసిలిటీని పొడిగిస్తున్నాయి.
వాటర్ క్యాన్ రూ.120
గతంలో రూ.20 ఉండే మంచినీటి వాటర్ క్యాన్ ఇప్పుడు రూ.120కి చేరుకుంది. ఇతర అవసరాలకు వాడుకునే వాటర్ ట్యాంకర్ ధర 2 వేలరూపాయలకు పెరిగింది. రోజుకి రెండుసార్లు స్నానం చేసేవారు కూడా.. రెండుమూడురోజులకోసారి మమ అనిపిస్తున్నారు. ఇక నీటి కరువు వల్ల భవన నిర్మాణ పనులు దాదాపుగా ఆగిపోయాయి. వేసవి సెలవల్లో పిల్లల్ని ఆకట్టుకోడానికి ఏర్పాటు చేసే స్విమ్మింగ్ పూల్స్ ఈ ఏడాది అస్సలు లేనే లేవు. బైక్ వాష్, కార్ వాష్ పాయింట్లకు తాళాలు వేశారు నిర్వాహకులు. బెంగళూరు వేసవి పర్యాటకంపై కూడా ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.