కాంగ్రెస్ కి జాక్ పాట్.. కర్నాటకలో ఊహించని మద్దతు

కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటూ వీరశైవ లింగాయత్ ఫోరం తమ వర్గానికి పిలుపునిచ్చింది. ఈమేరకు వారు ఓ లేఖ విడుదల చేశారు.

Advertisement
Update:2023-05-07 13:51 IST

సోమవారంతో కర్నాటకలో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది, బుధవారం పోలింగ్ జరుగుతుంది. ఈ టైమ్ లో కాంగ్రెస్ పార్టీకి అనూహ్య మద్దతు లభించింది. ఇప్పటి వరకూ బీజేపీకి దగ్గర అనుకుంటున్న వీరశైవ లింగాయత్ వర్గం కాంగ్రెస్ కి తమ మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటూ వీరశైవ లింగాయత్ ఫోరం తమ వర్గానికి పిలుపునిచ్చింది. ఈమేరకు వారు ఓ లేఖ విడుదల చేశారు. దీంతో కాంగ్రెస్ శిబిరంలో సంతోషం నెలకొంది.

అన్నీ మంచి శకునములే..

కర్నాటకలో ఈసారి హంగ్ తప్పదనే సంకేతాల మధ్య ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఆ తర్వాత వచ్చిన సర్వేలన్నీ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపడం విశేషం. ఎన్నికల తేదీ దగ్గరపడేకొద్దీ కాంగ్రెస్ సింగిల్ గానే అధికారంలోకి వస్తుందని చెబుతూ పలు సర్వేలు విడుదలయ్యాయి. ఈ శుభ శకునాల మధ్య వీరశైవలింగాయత్ వర్గం మద్దతు.. కాంగ్రెస్ కి మరింత బలాన్ని చేకూర్చుతుందనడంలో సందేహం లేదు.

కర్నాటకలో లింగాయత్ యోగులు, వారి ఆశీర్వాదాలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉంటాయి. బలమైన లింగాయత్ వర్గం ఓట్ల కోసం బీజేపీ, జేడీఎస్, కాంగ్రెస్ లు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటి వరకూ లింగాయత్‌ లు కాషాయ పార్టీవైపు మొగ్గుచూపుతూ వచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్‌కు మద్ధతు తెలిపాలంటూ కర్నాటక వీరశైవ లింగాయత్ ఫోరం విడుదల చేసిన లేఖ బీజేపీకి ఆందోళన కలిగిస్తోంది. ముంబై కర్నాటక, హైదరాబాద్ కర్నాటకలో మొత్తం 13 జిల్లాల్లో 90 అసెంబ్లీ సీట్లున్నాయి. గత ఎన్నికల్లో అత్యధికంగా బీజేపీ 52 సీట్లు, కాంగ్రెస్ 32, జేడీఎస్ 6 సీట్లు గెలుచుకున్నాయి. లింగాయత్‌ లు అధికంగా ఉండే ఈ ప్రాంతాల్లో ఈసారి కాంగ్రెస్ మెజార్టీ స్థానాలతో విజయఢంకా మోగించడం గ్యారెంటీ అని తేలిపోయింది. 

Tags:    
Advertisement

Similar News